
అంబులెన్స్ తరహా సేవలు..
హన్మకొండ: విద్యుత్ అంతరాయాల నివారణ, త్వరితగతిన పునరుద్ధరణకు టీజీ ఎన్పీడీసీఎల్ అంబులెన్స్ తరహా సేవలకు సిద్ధమైంది. ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు, ఈదురు గాలులు, భారీ వర్షాల నేపథ్యంలో కలిగే విద్యుత్ అంతరాయాలు తగ్గించడంతోపాటు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టడానికి ఎమర్జెన్సీ రీస్టోర్ టీంలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఎమర్జెన్సీ రిస్టోర్ టీం వాహనంతోపాటు సిబ్బంది, మెటీరియల్ నిత్యం అందుబాటులో ఉంటుంది. సమస్య తలెత్తిన క్షణాల్లో ఈ వాహనం అంబులెన్స్‌లా దూసుకెళ్తుంది. జీపీఆర్‌ఎస్ లోకేషన్ ద్వారా వేగంగా చేరుకుని సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తారు. ఈవాహనంలో సంబంధిత మెటీరియల్ థర్మో విజన్ కెమెరాలు, రంపాలు, టార్చ్ లైట్లు, నిచ్చెనలు, ఇన్సులేటర్లు, కండక్టర్లు, కేబుల్స్, ఇతర విద్యుత్ మెటీరియల్ అందుబాటులో ఉంటాయి. సిబ్బంది 24/7 అందుబాటులో ఉంటూ రాత్రి, పగలు అనే తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తారు. భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ సర్కిల్‌లో ప్రత్యేక డ్రెస్ కోడ్‌తో సిబ్బంది, మెటీరియల్, ఎమర్జెన్సీ రిస్టోర్ వాహనంతో సిద్ధంగా ఉన్నారు. విద్యుత్ సరఫరాలో ఆటంకం కలిగిన వెంటనే చేరుకునేలా సమాయత్తంగా ఉన్నారు.
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా
వినియోగదారులకు నాణ్యమైన, అంతరాయాలు లేని విద్యుత్ అందిస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలకు విద్యుత్ అంతరాయం కలిగితే వెంటనే సరఫరా పునరుద్ధరణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం. ఈ క్రమంలో ఎమర్జెన్సీ రిస్టోర్ టీంను సిద్ధంగా ఉంచాం. వీరు సమస్య తలెత్తిన వెంటనే వేగంగా చేరుకుని సరఫరా పునరుద్ధరిస్తారు.
– కె.గౌతం రెడ్డి, ఎస్‌ఈ, వరంగల్ సర్కిల్
టీజీ ఎన్పీడీసీఎల్‌లో ఎమర్జెన్సీ రీస్టోర్ టీం

అంబులెన్స్ తరహా సేవలు..