
కాకతీయుల శిల్పకళ అద్భుతం
● కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి
విద్యారణ్యపురి: కాకతీయుల శిల్పకళ అద్భుతమని, నాటి సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనమని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో హిస్టరీ విభాగం ఆధ్వర్యంలో ‘కాకతీయాస్ టెంపుల్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్’ అనే అంశంపై రెండు రోజులు నిర్వహించునున్న రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ ప్రారంభ సభలో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాకతీయుల కాలంలో వివిధ కట్టడాల్లో నాటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సౌండ్‌బాక్స్ టెక్నాలజీని ఉపయోగించారన్నారు. ప్రభుత్వ పింగిళి మహిళా కళా శాల ప్రిన్సిపాల్ బి. చంద్రమౌళి మాట్లాడుతూ కాకతీయుల శిల్పకళా సాంస్కృతిక వైభవాన్ని తెలియజేసేందుకు ఈ వర్క్ షాప్ ఒక వేదికగా ఉపయోగపడుతుందన్నారు. సాంస్కృతిక పరిశోధకుడు, తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్ కీలకపోన్యాసం చేస్తూ దక్షిణాసియాలోనే ప్రసిద్ధ హోజసాల చాళుక్య శైలులతో కూడిన కాకతీయుల శిల్పకళా ప్రసిద్ధిగాంచిందన్నారు. రామ ప్ప, వెయ్యిస్తంభాల ఆలయాల్లో అద్భుత సౌందర్యం దాగి ఉందన్నారు. వరంగల్ నిట్ విశ్రాంత ప్రొఫెసర్ పాండురంగారావు మాట్లాడుతూ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్పదేవాలయాన్ని ప్రకృతి విపత్తులనుంచి పరిరక్షించుకోవాలన్నారు. కేయూహిస్టరీ విభాగం విశ్రాంత ఆచార్యుడు కె.విజయబాబు మాట్లాడుతూ రామప్పదేవాలయంలో మదనిక, నాగిని వంటి శిల్పాల సౌందర్యం 800 సంవత్సరాలనాటి సాంకేతికత నేటితరానికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. అనంతరం కేయూ పాలకమండలి సభ్యుడు మల్లం నవీన్, హెరిటేజ్ యాక్టివిస్ట్ అరవింద్ ఆర్య, చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్ అరుణ మాట్లాడారు. ఈ వర్క్‌షాప్‌లో కన్వీనర్ కొలిపాక శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని, అధ్యాపకులు సురేశ్‌బాబు,శ్యామ్యూల్‌ప్రవీణ్‌కుమార్, యుగేంధర్, మధు, సుజాత తదితరులు పాల్గొన్నారు.