
అవయవదానంపై అవగాహన ఉండాలి
● తెలంగాణ నేత్ర అవయవ, శరీర దాతల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి
హన్మకొండ: అవయవదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ నేత్ర అవయవ, శరీర దాతల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి అన్నారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా బుధవారం హనుమకొండ బాలసముద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏకశిల పార్కులో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ అవయవ దానం అవసరమని చాటి చెప్పేందుకే ప్రపంచ అవయవ దాన దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. దేశంలో అవయవలేమితో ప్రతీ సంవత్సరం ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, దేశంలో అవయవదానం రేటు అతి తక్కువ ఉందన్నారు. ప్రతీ 10 లక్షల మందికిగాను 0.65 మంది దాతలుగా ముందుకు వస్తున్నారని వివరించారు. పాశ్చాత్య దేశాలు స్పెయిన్, క్రొయేషియాలో 10 లక్షల మందికి గాను 30 మంది దాతలు అవయవదానానికి ముందుకువస్తున్నారన్నారు. భారతదేశంలోనూ అవయవదాతలు ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా అవయవదానంపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు మల్లారెడ్డి, వేణు, ప్రతినిధులు ఎం.పద్మ, నిమ్మల శ్రీనివాస్, భారతి, విజయ కుమారి, నిర్మల, జనార్దన్ రెడ్డి, సత్యనారాయణ, పుల్లారెడ్డి, రాంబాబు, అంజలి, భాస్కర్, శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.