
విద్యుత్ అధికారులు హెడ్ క్వార్టర్‌లో ఉండాలి
● టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
హన్మకొండ: రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఎన్పీడీసీఎల్‌లోని 16 సర్కిళ్ల ఎస్‌ఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఈ నెల 13 నుంచి 16 వరకు వరుసగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిందని, ఈ నేపథ్యంలో సర్కిళ్ల సూపరింటెండెంట్ ఇంజనీర్లు, డివిజనల్ ఇంజనీర్లు, ఇతర అధికారులు హెడ్‌క్వార్టర్‌లో ఉంటూ విధులు నిర్వర్తించాలన్నారు. ఎప్పటికప్పుడు లోడ్ మానిటరింగ్ చేయాలన్నారు. ఎక్కడైనా అంతరాయాలు సంభవిస్తే వెంటనే సరఫరా పునరుద్ధరించేలా ఉద్యోగులు, మెటీరియల్‌ను సిద్ధంగా ఉంచుకుని వెంటనే పనులు చేపట్టాలన్నారు. అత్యవసర పరిస్థితులు నెలకొనే అవకాశమున్న నేపథ్యంలో సిబ్బంది, ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు షిఫ్ట్ విధానంలో 24 గంటలు విధులు కేటాయించాలన్నారు. విద్యుత్ సమస్యలుంటే వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం అందించాలని కోరారు.