
సహాయక చర్యలు చేపట్టాలి
రామన్నపేట: రానున్న 72 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి సూచించారు. మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయం నుంచి కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి కార్పొరేషన్, రెవెన్యూ, విద్యుత్, అగ్నిమాపక, వైద్యారోగ్యశాఖ, ఇరిగేషన్, ప్రైస్ దిలార్డ్ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు మేయర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగరంలోని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు గత రాత్రి కురిసిన భారీ వర్షానికి జలమయమైన కాలనీల్లోని ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు పోలీసుల సహకారంతో తరలించాలన్నారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఏలాంటి అసౌకర్యాలు కలగకుండా మంచినీరు, పారిశుద్ధ్యం, దుప్పట్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కార్పొరేషన్ డీఆర్‌ఎఫ్ మూడు బోర్డ్స్ రూఫ్స్ తదితర సామగ్రితో సిద్ధంగా ఉన్నాయని, వీరితో పాటు అపదమిత్ర, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం వంద మందితో సిద్ధంగా ఉన్నారని వారి సేవలను కూడా వినియోగించుకోవాలన్నారు. ప్రధాన కార్యాలయంలో 24 గంటల పాటు ఏర్పాటు చేసిన మాన్సూన్ రెస్పాన్స్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 1980 మొబైల్ నెంబర్ 97099 99676 అత్యవసర సహాయార్థం సంప్రదించాలని మేయర్ కోరారు. కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ తదితర విభాగ అధికారులు పాల్గొన్నారు.
క్యాంపు కార్యాలయాల సందర్శన..
టెలికాన్ఫరెన్స్ సమీక్షా ఆనంతరం మేయర్ సుధారాణి మంగళవారం రాత్రి కార్పొరేషన్ ఆధ్వర్యంలో పోతన నగర్, మర్వాడీ భవన్‌లో, కరీమాబాద్ బీరన్నకుంట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించి వరద బాధితులు, నిర్వాసితులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా బాధితులకు భరోసా కల్పించి వర్షం తగ్గే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని, ఏలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మేయర్ వారికి హామీ ఇచ్చారు.
మరో 72గంటల పాటు భారీ వర్షాలు..
వరద బాధితులకు పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు
గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి