
పింఛన్లు పెంచకుంటే గద్దె దించుతాం
పాలకుర్తి టౌన్: పింఛన్లు పెంచకుంటే సీఎం రేవంత్‌రెడ్డిని గద్దె దించుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. దివ్యాంగులు, వృద్ధులు, వితంతు, ఒంటరి మహిళల పింఛన్ల పెంపు కోసం సెప్టెంబర్ 3న హైదరాబాద్‌లో నిర్వహించే మహా గర్జనను విజయవతం చేయాలని కోరుతూ మంగళవారం పాలకుర్తి మండల కేంద్రంలోని ఓ గార్డెన్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పథకం సాధన కోసం ఎమ్మారీఎస్ ఎంతో శ్రమించిందని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనం వీడాలని, గడీ నుంచి బయటకు రావాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 50 లక్షల మంది దివ్యాంగులను మోసం చేస్తోందని, దీనిపై కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా పోరాడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగులకు రూ. 6 వేలు, వృద్ధులకు రూ.4 వేలు, తీవ్ర వైకల్యం ఉన్నవారికి రూ.15 వేలు పెంచి పింఛన్లు ఇస్తామని పేర్కొందని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా పింఛన్లు పెంచకుండా రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. పింఛన్ పెంపు ఎప్పుడు అమల్లోకి వస్తుందని, కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని 50 లక్షల మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు సునీల్ మాదిగ, యాదగిరి స్వామి, తాళ్లపెల్లి కుమార్, గద్దల కిశోర్, దిండిగల వెంకన్న, గుండాల రవి, రమేశ్, వలపు వెంకన్న, సుధాకర్, జలగం నరేశ్, దండు రామచంద్రం, శ్రీధర్ పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌కు మందకృష్ణ హెచ్చరిక
పాలకుర్తిలో నియోజకవర్గ సన్నాహక సమావేశం