
శైవ క్షేత్రాల సందర్శనకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
హన్మకొండ: శ్రావణమాసం సందర్భంగా శైవ క్షేత్రాలను సందర్శించే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పంచారామాల దర్శన యాత్రకు సూపర్ లగ్జరీ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను తెలిపారు. ఈ నెల 17న హనుమకొండ బస్ స్టేషన్ నుంచి ప్రత్యేక పంచారామ దర్శన యాత్రకు సూపర్ లగ్జరీ బస్సులు నడపనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ యాత్రలో భక్తులు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధి చెందిన పంచారామ క్షేత్రాలు అమరావతి అమరలింగేశ్వర స్వామి, భీమవరం శ్రీసోమేశ్వర స్వామి, పాలకొల్లు క్షీర లింగేశ్వర స్వామి, ద్రాక్షారామం భీమేశ్వర స్వామి, సామర్లకోట భీమేశ్వర స్వామి దర్శించుకోవచ్చన్నారు. ఒకే రోజు ఐదు శైవ క్షేత్రాలను దర్శించుకోవడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక అనుభవాలు పొందొచ్చన్నారు. ఈ యాత్ర బస్సులు ఆగస్టు 17న (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు హనుమకొండ బస్ స్టేషన్ నుంచి ప్రారంభమై సోమవారం అన్ని క్షేత్రాల దర్శనం అనంతరం తిరిగి మంగళవారం ఉదయం హనుమకొండకు చేరుకుంటాయన్నారు. సూపర్ లగ్జరీ సర్వీస్ చార్జీలు పెద్దలకు రూ.2,300, పిల్లలకు రూ.1,400 నిర్ణయించినట్లు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి సమాచారం, టికెట్ బుకింగ్ కోసం 9063407493, 7780565971, 9866373825, 9959226047 నంబర్లను సంప్రదించాలని సూచించారు.