
రాత్రంతా జాగారం
● నగరంలో కురిసిన వర్షానికి
స్తంభించిన జనజీవనం
● ముంపునకు గురైన కాలనీలు
హన్మకొండ: నగరంలో గురువారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి ముంపు ప్రాంత కాలనీల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు వర్షం దంచికొట్టింది. భారీ వర్షానికి వరంగల్ మహానగరంలో వరద పోటెత్తింది. ముంపు ప్రాంత కాలనీలు నీట మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో ఒండ్రు మట్టి పేరుకుపోయింది. ముంపు కాలనీల వాసులు నీళ్లను ఎత్తి పారబోస్తూ రాత్రంతా జాగారం చేశారు. అత్యధికంగా కాజీపేటలో 108.9 మిల్లీమీటర్లు, హనుమకొండలో 103 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లాలో ఖిలా వరంగల్‌లో 68.2 నమోదైంది. ఈ వర్షాకాలం సీజన్‌లో అత్యంత భారీ వర్షంగా అధికారులు చెబుతున్నారు.