
తల్లిపాలతో ఆరోగ్యం
● వరంగల్ కలెక్టర్ సత్యశారద
ఎంజీఎం/న్యూశాయంపేట/రామన్నపేట: తల్లిపాలు తాగితే శిశువులు ఆరోగ్యంగా ఉంటారని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గురువారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్‌లోని సీకేఎం ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు. బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా సెయింట్ ఆన్స్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు బాలింతలు, గర్భిణులకు తల్లిపాల విశిష్టతను వివరిస్తూ వేసిన నాటకం ఆకట్టుకుంది. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీడబ్ల్యూఓ రాజమణి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, వైద్యాధికారులు సత్యజిత్ పాల్గొన్నారు.
పంద్రాగస్టుకు పటిష్ట ఏర్పాట్లు
పంద్రాగస్టు వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఏర్పాట్లపై అన్ని శాఖల జిల్లా అధికారులతో గురువారం సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 15న ఉదయం ఖిలా వరంగల్ ఖుష్‌మహల్ మైదానంలో నిర్వహించే జెండా వందన కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు, వేదిక అలంకరణ చేయాలని ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, అతిథులను వేడుకలకు ఆహ్వానించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, అఽధికారులు రాంరెడ్డి, సాంబశివరావు, కౌసల్యాదేవి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఏనుమాముల మార్కెట్ యార్డులోని ఈవీఎం గోదాంలను కలెక్టర్ పరిశీలించారు. అలాగే నగరంలోని 3వ డివిజన్ పైడిపల్లిలోని డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. 11వ చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా వరంగల్ కొత్తవాడలోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి కెమిస్ట్ భవన్ వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.