
గురుదక్షిణ కోసమే నీటి పంపింగ్ చేయని సీఎం
మాజీ ఉప ముఖ్యమంత్రి
డాక్టర్ తాటికొండ రాజయ్య
హన్మకొండ: గురు దక్షిణ ఇవ్వడానికి, ఆంధ్రా, బనకచర్ల ప్రాజెక్టుకు నీటిని వదలడం కోసమే సీఎం రేవంత్‌రెడ్డి గోదావరి జలాలను పంపింగ్ చేయడం లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దుయ్యబట్టారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. వర్షాలు పడకున్నా రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దడానికి కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను కేసీఆర్ నిర్మించారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగు నీటి ప్రాజెక్టులను నిరుపయోగంగా మార్చిందని, కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా నీటిని పంపింగ్ చేసి చెరువులు నింపకుండా ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని తూర్పారబట్టారు. సాగునీటిపై ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి నీటి విడుదలపై కార్యాచరణ సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు. ఘోష్ కమిషన్ 660 పేజీల నివేదికలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న 60 పేజీల అంశాలను మాత్రమే బయట పెట్టారని విమర్శించారు. కేసీఆర్‌ను జైలుకు పంపే దిశగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. నాలుగు కమిషన్‌ల రిపోర్టులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉన్నాయని దుయ్యబట్టారు. అసెంబ్లీలో పూర్తి నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు జోరిక రమేశ్, హరి రమాదేవి, దేవమ్మ, కర్ర సోమిరెడ్డి, నాగుర్ల కృష్ణమూర్తి, గుండె మల్లేశ్, పడాల సతీశ్ పాల్గొన్నారు.