
21న వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు
రామన్నపేట : వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నూతన పాలకవర్గ ఎన్నికకు ఈనెల 21న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎలక్షన్ ఆఫీసర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా సహకార అధికారి ఎం. వాల్యా నాయక్ తెలిపారు. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 8,11, 12 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 13న పరిశీలన, 14న నామినేషన్ల ఉపసంహరణ, తుది జాబితా, గుర్తుల కేటాయింపు, 21న పోలింగ్, పోలింగ్ అనంతరం ఫలితాలు ప్రకటిస్తామని వివరించారు. ఫలితాల ప్రకటన తర్వాత మూడు రోజుల్లో ఆఫీస్ బేరర్స్ ఎన్నికల ఉంటాయని పేర్కొన్నారు. బ్యాంక్ పాలకవర్గంలో మొత్తం 12 మంది సభ్యులకు గాను ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి ఒక స్థానం, మహిళా కేటగిరీకి రెండు స్థానాలు, ఓపెన్ కేటగిరీకి 9 స్థానాలు రిజర్వ్ చేసినట్లు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ కార్యక్రమం ఓ సిటీ రోడ్డులోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో, పోలింగ్, ఓట్ల లెక్కింపు ఏవీవీ కళాశాలలో జరుగుతుందని వివరించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
బంధువు దశదిన కర్మకు వెళ్లి
తిరిగిరాని లోకాలకు..
● చెరువులో నీటమునిగి వ్యక్తి మృతి
ఎల్కతుర్తి: బంధువు దశదిన కర్మ అనంతరం స్నానం చేయడానికి చెరువులో దిగిన ఓ వ్యక్తి ఈత రాక నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో చోటు చేసుకుంది. ఎస్సై దివ్య కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మర్రి ఓదెలు(49) తన బంధువు ఎల్లయ్య ఇటీవల మృతి చెందగా ఆయన దశదిన కర్మ నిమిత్తం ఈనెల 3న చెరువు వద్దకు వెళ్లారు. కార్యక్రమం అనంతరం స్నానం చేయడానికి చెరువులోకి దిగిన ఓదెలు.. నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. ఈ విషయం కుటుంబీకులు గమనించలేదు. అనంతరం ఇంటివద్దకు చేరుకుని పలు చోట్ల వెతికినా ఓదెలు ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు (4వ తేదీన) తెల్లవారుజామున చెరువులో ఓదెలు మృతదేహం తేలి ఉండడాన్ని గమనించిన స్థానికులు.. కుటుంబీకులు సమాచారం ఇచారు. దీంతో వారు చెరువు వద్దకు వెళ్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై దివ్య సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని చెరువు నుంచి వెలికి తీశారు. ఈ ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.