
జెండా ఊపి బస్సును ప్రారంభిస్తున్న సుధారాణి
వరంగల్ అర్బన్: మేడారం మహా జాతరలో పారిశుద్ధ్య నిర్వహణ, సేవలు అందించేందుకు గ్రేటర్ వరంగల్‌కు చెందిన కార్మికులు, సిబ్బంది సోమవారం తరలివెళ్లారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులను మేయర్ గుండు సుధారాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా సుధారాణి మాట్లాడుతూ.. జాతరలో భక్తులకు సేవందించేందుకు 550 మంది పారిశుద్ధ్య కార్మికులు, 30 మంది జవాన్లు, ఆరుగురు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు సూపర్‌వైజర్లు వెళ్లినట్లు పేర్కొన్నారు. పారిశుద్ధ్య సేవలు, తాగునీటి సరఫరా పర్యవేక్షణకు వింగ్ అధికారులు ఐదురోజుల పాటు అక్కడే అందుబాటులో ఉంటారన్నారు. అడిషనల్ కమిషనర్ అనిసుర్ రషీద్, సీఎంహెచ్‌ఓ రాజేశ్, శానిటరీ సూపర్‌వైజర్లు సాంబయ్య, నరేందర్, భాస్కర్ తదితరులు ఉన్నారు.