తెనాలి ‘పుర’పోరుకు సర్వసన్నద్ధమైన వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఖరారులో తొలి అడుగే వేయని కూటమి తొలిరోజు నాలుగు నామినేషన్లూ వైఎస్సార్ సీపీ వారివే
తెనాలి: పరుగు పందెంలో గెలుపు అంటే మంచి ఆరంభంపైనే ఆధారపడి ఉంటుంది. రాజకీయాలకూ ఈ సూత్రం వర్తిస్తుందని సీనియర్ నాయకులు చెబుతుంటారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల రేసులో ఆంధ్రప్యారిస్ తెనాలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శించింది. 52 వార్డుల బీఫారాలు తీసేసుకోవటమే కాకుండా, ఎంపిక చేసిన నలుగురు అభ్యర్థులు తొలిరోజునే నామినేషన్లను దాఖలు చేశారు. కూటమి పార్టీలో స్థానిక సారథులైన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ల మధ్య సీట్ల పంచాయితీ ఇంకా తేలనేలేదు. ఆశావహులకు ఇదే పెద్ద తలనొప్పిగా మారింది.
గెలుపు లక్ష్యంగా..
ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు లక్ష్యంగా పోటీ పడాలన్న భావనతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం నియోజకవర్గంలోని పట్టణ వార్డు కమిటీలు, గ్రామ కమిటీలను నియమించారు. వివిధ విభాగాలకు సంబంధించిన అనుబంధ కమిటీల నియామకాన్ని కూడా పూర్తి చేశారు. ఇందుకోసం నెలల తరబడి గ్రామ, వార్డు సభలను నిర్వహిస్తూ నియామకాలను జరిపారు. నియోజకవర్గానికో నాలుగు వేల పార్టీ సైన్యాన్ని సిద్ధం చేశారు. ఆ క్రమంలో తెనాలి నియోజకవర్గంలోనూ అన్ని కమిటీలతో పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ముందుగా చెప్పినట్టుగా గుర్తింపు కార్డులనూ అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల పంచాయితీ నడుస్తోంది. వైఎస్సార్ సీపీ మాత్రం తెనాలి చైర్మన్ అభ్యర్థిగా వ్యాపార ప్రముఖుడు మద్దాళి శేషాచలం పేరును ప్రకటించటంతో ముందడుగు వేసింది.
పేరు ఇప్పటికే ఖరారు
పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఇచ్చిన హామీ ప్రకారం గత ఎన్నికల్లో జనరల్ మహిళకు రిజర్వు చేసిన చైర్పర్సన్ సీట్లో తొలుత ముస్లిం మైనారిటీకి, చివరి రెండున్నరేళ్లకు బీసీలకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న శివకుమార్... ఈసారి ఎన్నికల్లో ఇతర ఓసీ సామాజికవర్గాల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ, తనను ఎంతో ఆదరించిన ఆర్యవైశ్యులకు చైర్మన్ అవకాశం కల్పించారు. ఆ ప్రకారంగానే పార్టీ అధిష్ఠానానికి తెనాలి నుంచి మద్దాళి శేషాచలం పేరును మాత్రమే ప్రతిపాదించారు. అధిష్ఠానం దీనికి ఆమోదముద్ర వేసి గురువారం సాయంత్రమే అభ్యర్థిని ప్రకటించింది. కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపికలోనూ అదే దూకుడును పార్టీ ప్రదర్శించింది. దాదాపు అందరు అభ్యర్థులకూ ఎన్ఓసీలు, బీఫారాలు తీసుకున్నారు. తొలిరోజున నలుగురు కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లను ఆయా కేంద్రాలలో దాఖలు చేశారు.
తెనాలి మున్సిపల్ కార్యాలయ ప్రాంతం (ఫైల్)
కూటమి తరఫున చైర్మన్ పదవిని జనసేనకు కేటాయిస్తూ గురువారం రాత్రి పొద్దుపోయాక నిర్ణయించారు. 24 గంటల తర్వాత శుక్రవారం రాత్రికి కూడా పోటీచేసే అభ్యర్థిని ఆ పార్టీ ప్రకటించనేలేదు. కాపు సామాజికవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు తోటకూర వెంకట రమణారావు అన్నిరకాలుగా సిద్ధమయ్యారు. అయితే వైఎస్సార్సీపీ ఆర్యవైశ్యులకు టికెట్ కేటాయించటంతో జనసేనలో అంతర్మథనం మొదలైందని చెబుతున్నారు. జనసేన తరఫున పోటీ చేయాలని ఆర్యవైశ్య ప్రముఖుడు ఒకరితో శుక్రవారం మంతనాలు జరిపారని, రాత్రి వరకూ ఇంకా ఏమీ తేలలేదంటున్నారు. ఇకపోతే కౌన్సిలర్ల స్థానాల కోసం మంత్రి మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి మధ్య చర్చ జరగలేదని తెలిసింది. మంత్రి మనోహర్ పిలిస్తే, 37 కౌన్సిలర్ స్థానాలు అడగాలని ఆలపాటి తమ టీడీపీ నాయకులకు ఆదేశాలిచ్చినట్టు చెబుతున్నారు. మంత్రి మనోహర్ మాత్రం టీడీపీ, జనసేన చెరో 25 సీట్లు, బీజేపీకి రెండు స్థానాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. చైర్మన్ అభ్యర్థితోపాటు కౌన్సిలర్ల సంఖ్యను తేల్చని ‘కూటమి’కన్నా వైఎస్సార్సీపీ రేసులో మంచి ఆరంభాన్ని ఇవ్వడం పట్టణంలో హాట్టాపిక్ అయింది.
పుర ఎన్నికల్లో ఫ్యాన్ తొలి నుంచి దూకుడు పెంచింది. మరోవైపు కూటమి పార్టీలు ఆ స్పీడు అందుకోలేక చతికిలబడ్డాయి. తెనాలి మున్సిపాలిటీకి చైర్మన్ అభ్యర్థి ఖరారులో వైఎస్సార్సీపీ వేగం చూపింది. కూటమి మాత్రం కుదేలైపోయింది.


