జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు చేయాల్సిన వ్యయ వివరాలు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మేయర్ అభ్యర్థికి రూ.25 లక్షలు, నగర పాలక సంస్థ వార్డు సభ్యులకు రూ.10 లక్షలు, పురపాలక సంఘం అధ్యక్షులకు రూ.20 లక్షలు, పురపాలక సంఘంలో వార్డు సభ్యులకు రూ.7.50 లక్షలు వ్యయ పరిమితులు ఉన్నాయన్నారు. ఎన్నికల నియమావళి పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్న ఏ అంశాన్నీ ఉపేక్షించవద్దన్నారు. వ్యయ కమిటీలు, స్టాటిక్ సర్వేలియన్స్ బృందాలు, వీడియో వ్యూయింగ్ బృందాలు, ఎం.సి.సి. బృందాలు రేయింబవళ్లు తనిఖీ నిర్వహించాలని తెలిపారు. సంబంధిత నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలన్నారు. పారదర్శకమైన ఎన్నికల నిర్వహణే ప్రధాన లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జీఎంసీ కమిషనర్ కె.మయూర్అశోక్, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, డీపీవో బి.వి.నాగసాయికుమార్, డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, ఎస్జీఎస్డబ్ల్యూ సమన్వయ అధికారి మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


