ఓటమి భయంతో కూటమి అక్రమాలు | - | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతో కూటమి అక్రమాలు

Oct 17 2026 6:12 AM | Updated on Oct 17 2026 6:12 AM

సీఎం చంద్రబాబు పిరికిపంద చర్యలు సిగ్గుచేటు

నామినేషన్లు వేయనీయకుండా అడ్డగింత దారుణం

పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకాలు

దాచేపల్లి నగర పంచాయతీ చైర్మన్‌ అభ్యర్థి రవికుమార్‌ అరెస్టు అన్యాయం

వైఎస్సార్‌ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు

గుంటూరు ఎడ్యుకేషన్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో చంద్రబాబు సర్కారు పోలీసులను అడ్డు పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు పోటీ చేయకుండా అక్రమ కేసులు మోపుతోందని ఆరోపించారు. శుక్రవారం సిద్ధార్థనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.... దాచేపల్లి నగర పంచాయతీ చైర్మన్‌ పదవికి వైఎస్సార్‌ సీపీ నుంచి నామినేషన్‌ వేసేందుకు సిద్దమైన కొప్పుల రవికుమార్‌ తెలంగాణ మద్యం కలిగి ఉన్నారనే ఆరోపణలతో పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దాచేపల్లిలో వైఎస్సార్‌ సీపీనే గెలుస్తుందనే భయంతో ఎలాగైనా అడ్డుకోవాలనే రవిని అక్రమంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. చేయని నేరాన్ని ఒప్పుకోవాలని బలవంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్థికంగా స్థితిమంతులైన కాపు సామాజిక వర్గానికి చెందిన కొప్పుల సాంబయ్య కుటుంబానికి తెలంగాణ మద్యం అమ్ముకోవాల్సిన దుస్థితి పట్టలేదన్నారు. గతంలో మున్సిపల్‌ చైర్మన్‌గా చేసిన కొప్పుల సాంబయ్య కుటుంబాన్ని భయపెట్టేందుకే టీడీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కొప్పుల రవి నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌లో పోలీసులే మద్యం బాటిళ్లను తెచ్చి పెట్టి, అక్రమ కేసు మోపారని ఆరోపించారు. పోలీసులే ఇంత దారుణంగా వ్యవహరిస్తే ఇక ఇక్కడ ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల్లో ధైర్యంగా పోటీ చేసి గెలుపు, ఓటములను ప్రజా తీర్పునకు వదిలేయాలని సూచించారు. సీఎం చంద్రబాబు ఇటువంటి పిరికిపంద చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు.

పోలీసులు తీరు మార్చుకోవాలి

అధికారం ఉంది కదా అని కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ప్రతిపక్ష నేతలను భయపెట్టి, ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా అడ్డుకుంటున్న పోలీసులు ప్రభుత్వం మారిన తరువాత పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోవాలని అంబటి హెచ్చరించారు. ఎన్నికల సమయంలో తప్పుడు కేసులతో అభ్యర్థులను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ఇలాగైతే నామినేషన్లు ఎలా వేస్తారన్నారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను అక్రమ కేసుల్లో ఇరికించి, ఎన్నికలను ఏకగీవ్రం చేసుకుంటారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నామినేషన్లు వేసేందుకు ఇక రెండు రోజులే గడువు ఉన్న నేపథ్యంలో టీడీపీ అక్రమాలకు వ్యతిరేకంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన కొప్పుల రవిని తక్షణమే విడుదల చేసి, నామినేషన్‌ వేసే అవకాశాన్ని కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులు ఇదే విధంగా ఉన్నాయని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా, పోటీలో లేకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement