గ్రామీణ డాక్ సేవకులు కీలకం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): ఈ నెల 22 వ తేదీన ‘గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనం’ నిర్వహించనున్నట్లు చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీదేవి తెలిపారు. గుంటూరు నగర శివారులో గల బొమ్మిడాల నగర్‌లో ఉన్న శ్రీ సత్య సాయి స్పిరిచువల్ సొసైటీలో ఆదివారం జరగబోవు కార్యక్రమం ఏర్పాట్లను ఆమె శుక్రవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న వేలాది గ్రామీణ డాక్ సేవకులను ఒకే వేదికపైకి తెచ్చి సేవలకు గుర్తింపు ద్వారా ప్రోత్సహించడం ఈ సమ్మేళనం లక్ష్యం అన్నారు. ఉత్తమంగా పనిచేసిన 10 మంది గ్రామీణ డాక్ సేవకులను సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సూపరిండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ (గుంటూరు డివిజన్) యలమందయ్య , అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ (విజయవాడ) ఎస్. వీర నారాయణ, సూపరింటెండెంట్ పోస్టల్ స్టోర్స్ (విజయవాడ) రవిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


