అంబటికి ఎమ్మెల్సీ తోట పరామర్శ
● ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ అంబటి రాంబాబు ఇంటిపై వద్ద టీడీపీ మూకలు దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దమనకాండలు ఉధృతంగా చేస్తున్నారని మండిపడ్డారు. అంబటి రాంబాబుపై, ఇల్లు, కార్యాలయంపై జరిగిన హింసకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
● మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులను అడ్డుగా పెట్టుకుని దాడి చేసే ప్రయత్నం చేయడంపై రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. ఇది రాష్ట్ర డీజీపీ అసమర్థత అని ఒప్పుకోవాలని అన్నారు. కనీసం అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయం వద్ద బందోబస్త్‌కు వచ్చిన ఒక్క పోలీస్‌నైనా సస్పెండ్ చేశారా అని ఆయన ప్రశ్నించారు.
● నంబర్–1 టీవీ న్యూస్ ఛానల్ ఎండీ సుధాకర్ మాట్లాడుతూ అంబటి ఇంటి వద్ద జరిగిన విధ్వంసకాండపై సాక్షాత్తు గుంటూరు –2 టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి భర్త వచ్చి నిలబడటం ఏంటని అన్నారు. ఇప్పటి వరకు దీనిపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఏం మాట్లాడలేదని అన్నారు. అంబటి రాంబాబుకు కులమంతా అండగా ఉంటుందని, వైఎస్‌ఆర్‌సీపీ ముద్ర వేసినా భయపడేది లేదన్నారు. ఏ కాపు నాయకుడిపై దాడులు జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నామని చెప్పారు.
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : మాజీ మంత్రి అంబటి రాంబాబు కార్యాలయం, ఇంటి వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్పష్టించిన దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. టీడీపీ మూకల విధ్వంస కాండలో ధ్వంసమైన గుంటూరు సిద్ధార్థనగర్‌లోని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయాన్ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, కాపు నాయకులు దాసరి రాము శుక్రవారం సందర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.