ఇండోనేషియా బాల్‌బ్యాడ్మింటిన్ పోటీల్లో లిఖిత విజయం
శావల్యాపురం: అంతర్జాతీయ స్థాయి బాల్‌బ్యాడ్మింటన్ క్రీడా పోటీల్లో ముక్కపాటి లిఖిత విజయం సాధించినట్లు కోచ్ రాగుల రాధా కృష్ణమూర్తి శుక్రవారం తెలిపారు. ఈ నెల 14 నుంచి 19 వరకు ఇండోనేషియా దేశంలో జరిగిన అంతర్జాతీయ ఇండియా బాల్‌బ్యాడ్మింటన్ టెస్టు సిరిస్‌లో సీనియర్ విభాగంలో బాలికల పోటీల్లో విజయం సాధించి ప్రశంసా పత్రం, గోల్డ్ పతకం అందుకొని దేశ కీర్తి ప్రతిష్టలు పెంచిందన్నారు. కనమర్లపూడి గ్రామానికి చెందిన ముక్కపాటి లిఖిత శావల్యాపురం జడ్పీ ఉన్నత పాఠశాల్లో 10 తరగతి వరకు విద్యాభ్యాసం చేసింది. ప్రాథమిక దశ నుంచి విద్యతో పాటు అంచెంచెలుగా క్రీడల్లో రాణిస్తూ మండలస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎదిగింది. పల్నాడు జిల్లా నుంచి ఏకై క యువతిగా గుర్తింపు పొందింది. ఇండోనేషియా దేశం వెళ్లడానికి ఖర్చుల నిమిత్తం 1991–92 పదో పూర్వ విద్యార్థుల వ్యాయామ ఉపాధ్యాయులు పురిమెట్ల అజీం, కొర్నేమల్లి సాంబశివరావు గ్రామస్తులు, దాతలు, తన స్నేహితులు ప్రోత్సాహంతో ప్రవాసా భారతీయులు పోట్లూరు వాసి పూర్వ విద్యార్థి నన్నూరి రాఘవ తనవంతు సాయం అందజేశారు. తండ్రి కోటయ్య అనారోగ్యంతో మృతి చెందిగా, తల్లి మంచానికి పరిమితమైంది. తాతాయ్య–నాయనమ్మ తన అక్కయ్య కుటుంబ సభ్యులు ప్రోత్సాహంతో తాను అనుకున్న లక్ష్యాలను సాధిస్తోంది లిఖిత.


