భీష్మ ఏకాదశి లక్ష తులసి దళార్చన
సత్తెనపల్లి: స్థానిక వడ్డవల్లి రామాలయం, వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో 21వ వార్షిక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం భీష్మ ఏకాదశి సందర్భంగా మాతృమూర్తులు, లక్ష్మీనారాయణ సమాజం వారిచే విష్ణు సహస్రనామ పారాయణంతోపాటు లక్ష తులసి దళార్చన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. శుక్రవారం విశేష నవ కలశ స్నపన (అభిషేకం) జరుగుతుందని, భక్తులు అభిషేక ద్రవ్యాలు సమర్పించుకోవచ్చని తెలిపారు.
నూజండ్ల: కొండ గురునాథస్వామి తిరునాళ్ల ఏర్పాట్లను రూరల్ సీఐ బి.బ్రహ్మయ్య గురువారం పరిశీలించారు. ఫిబ్రవరి 1వ తేదీన రవ్వవరం గ్రామ సమీపంలో కొండ గురునాథస్వామి తిరునాళ్ల జరగనుంది. దీనికి పల్నాడు జిల్లాతోపాటు ప్రకాశం, బాపట్ల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నారు. గత ఏడాది మూడు ప్రభలు ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది ఎనిమిదికి పైగా ప్రభలు నిర్మిస్తున్నారు. వేముల, కమ్మవారిపాలెం, గాంధీనగర్, శేషవారిపాలెం తదితర గ్రామాల నుంచి ప్రభలు ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ పెద్దలు తెలిపారు. తిరునాళ్ల ముందు రోజు మెట్ల పూజలో మహిళలు పొంగళ్లు పొంగించుకుంటారు. సోమవారం ఎడ్ల పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వాహనాల రాకపోకలు, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రభల నిర్మాణానికి అనుమతులు తీసుకోవాలని తెలిపారు.
నరసరావుపేట రూరల్: ఇస్సపాలెంలోని మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణానికి నరసరావుపేటకు చెందిన అందుకూరి శేషా చలపతి, మేనక మీనాక్షి దంపతులు, వారి కుమార్తె ప్రీతి మానస, కుమారుడు భార్గవ రామశాస్త్రిలు రూ.3 లక్షలు విరాళంగా అందజేశారు. ఆలయ కార్యాలయంలో గురువారం ఈవో నలబోతు మాధవీదేవిని కలిసి ఈ విరాళం అందించారు.
రేపల్లె: ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాలలోని 36 కేంద్రాలలో ఫిబ్రవరి 1, 2 తేదీలలో టైపు రైటింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్ల ఏపీ టైప్‌రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇనిస్టిట్యూట్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సీవీ మోహనరావు చెప్పారు. స్థానిక కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా ఆరువేల మంది వరకు హాజరవుతున్నట్లు చెప్పారు. రేపల్లె కేంద్రంలో ఫిబ్రవరి 1న నిర్వహిస్తున్న పరీక్షలకు 45 మంది హాజరవుతున్నారని తెలిపారు. ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషలలో లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలను, అదనంగా ఇంగ్లిష్ జూనియర్ గ్రేడ్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా షార్ట్ హ్యాండ్ పరీక్షలు ఈ నెల 30, 31 తేదీలలో ఏడు కేంద్రాలలో నిర్వహించనున్నట్లు వివరించారు.


