బాల్య వివాహాలను ప్రోత్సహించవద్దు
జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్: బాల్య వివాహాలు ఆరోగ్యకరమైన సమాజానికి మంచివి కాదని, వాటిని ప్రోత్సహించవద్దని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న బాల్య వివాహ విముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో క్రాఫ్ రూపొందించిన బాల్య వివాహాల విముక్తి రథాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ విముక్తి రథం జిల్లాలోని అన్ని మండలాలలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రచారం కల్పించడంలో ఉపయోగపడుతుందన్నారు. దీని ద్వారా ప్రజలు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి అధికారులకు సహకరించి, అవసరమైతే 1098, 112 టోల్ ఫ్రీ నంబర్‌లకు, పోలీస్ టోల్ ఫ్రీ నంబర్ నెంబరు 100కు సమాచారం తెలియజేయవచ్చని చెప్పారు.
జీఎస్టీ వసూళ్లు సమర్థంగా నిర్వహించాలి
జిల్లాలో జీఎస్టీ వసూలు సమర్థంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు నిర్దేశిత మార్గదర్శకాలు ప్రకారం వాణిజ్య పన్నుల శాఖకు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. గురువారం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జీఎస్టీ సమర్థంగా వసూలు చేసేందుకు ప్రతినెలా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ శాఖలలో పనుల టెండర్లలో జీఎస్టీలో నమోదైన సంస్థలు మాత్రమే పాల్గొనేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. పనులు నిర్వహించిన సంస్థలకు బిల్లులు మంజూరు సమయంలో జీఎస్టీ చెల్లింపులను పరిశీలించాలన్నారు.
● అనంతరం వాణిజ్య పన్నుల శాఖ గుంటూరు డివిజన్ జాయింట్ కమిషనర్ బి.గీతామాధురి జిల్లాలో జీఎస్టీకి సంబంధించి వివిధ శాఖలు అందించాల్సిన సమాచారం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
‘స్పర్శ’ లెప్రసీ పోస్టర్ ఆవిష్కరణ
‘స్పర్శ’ లెప్రసీ అవగాహన శిబిరం పోస్టర్‌ను గురువారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా మాట్లాడుతూ ‘వివక్షను అంతం చేయడం గౌరవాన్ని కాపాడటం‘ అనే ఇతివృత్తంతో శుక్రవారం నుంచి ఫిబ్రవరి 13 వరకు ‘స్పర్శ‘ లెప్రసీ అవగాహన కార్యక్రమాలు జిల్లాలో నిర్దేశిత మార్గదర్శకాలు ప్రకారం సక్రమంగా నిర్వహించాలన్నారు.


