7 నుంచి కొండవీడు ఫెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

7 నుంచి కొండవీడు ఫెస్ట్‌

Jan 29 2026 6:25 AM | Updated on Jan 29 2026 6:25 AM

7 నుంచి కొండవీడు ఫెస్ట్‌

7 నుంచి కొండవీడు ఫెస్ట్‌

తుది ప్రణాళిక ఖరారు

కోటను సందర్శించిన

జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యే

యడ్లపాడు: కొండవీడు కోట గొప్ప పర్యాటక కేంద్రంగా, అలాగే భావితరాలకు ఈ ప్రాంత చరిత్ర తెలిసేలా చేయడమే లక్ష్యంగా ఫిబ్రవరి 7, 8వ తేదీల్లో కొండవీడు ఫెస్ట్‌ – 2026 నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్‌ కృత్తికా శుక్లా తెలిపారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి బుధవారం కొండవీడుకోటను సందర్శించారు. ఉత్సవాల నిర్వహణపై శాఖలవారీగా చేపట్టాల్సిన విధులను సమీక్షించి మీడియాతో మాట్లాడారు. ఉత్సవాలు కొండపైనే నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఆయా కార్యక్రమాలను వారు వెల్లడించారు.

ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం

సందర్శకులు తమ వాహనాలను కొండ దిగువన ఏర్పాటు చేసిన పార్కింగ్‌ ప్రదేశంలో నిలిపి, అక్కడి నుంచి ఘాట్‌రోడ్డు మీదుగా ఏర్పాటు చేసిన 10 ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా కొండపైకి చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. భద్రతా కారణాలరీత్యా ఇతర వాహనాలకు కొండపైకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. వివిధ శాఖల జిల్లా అధికారులకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు.

పర్యాటక అభివృద్ధికి చర్యలు

జాతీయ స్థాయి పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా కొండవీడును తీర్చిదిద్ది పూర్వవైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సమీక్షలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. చారిత్రక కొండవీడు కోట పూర్వవైభవాన్ని చాటి చెప్పేలా ఫిబ్రవరి 7, 8వ తేదీల్లో ‘కొండవీడు హెరిటేజ్‌ ఉత్సవాలు’ ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ప్రత్తిపాటి ప్రకటించారు. తొలిరోజు ప్రత్యేక అతిథిగా పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్‌, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తోపాటు మరో ఇద్దరు మంత్రులు పాల్గొంటారన్నారు. ఉత్సవాల ముందు ఫిబ్రవరి 5న ప్రచార కార్యక్రమం, కొండవీడు చరిత్ర తెలిపే ప్రత్యేక గీతం ఆవిష్కరణ ఉంటుందన్నారు. ఉత్సవాల అనంతరం ఫిబ్రవరి 10వ తేదీ నుంచి వేసవి ముగిసే వరకు కొండపై పర్యాటకుల కోసం నైట్‌ క్యాంపెయిన్‌, భోజన వసతులు అందుబాటులో తెస్తున్నట్లు తెలిపారు. రూ.220 కోట్లతో చౌడవరం నుంచి కోటకు 5 కి.మీ. టన్నెల్‌ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసేలా చర్యలు, అలాగే కోటపై ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయం, దర్గా, మసీదులకు పురావస్తుశాఖ అనుమతులతో మరమ్మతులు చేపడతామని తెలిపారు. వీటితో పాటు జంతు ప్రదర్శనశాల, సఫారి రైడింగ్‌ ఏర్పాటు చేసే దిశగా ప్రతిపాదనలు చేస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement