రెవెన్యూ సేవలు ప్రజలకు చేరువ కావాలి
గుంటూరు వెస్ట్: జిల్లాలో రెవెన్యూ సేవలపై ప్రజల సంతృప్తి స్థాయిని ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మరింతగా మెరుగుపరిచేలా తహసీల్దార్లు, వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లు బాధ్యతగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి నిర్వహించిన రెవెన్యూ అధికారుల వర్క్ షాప్‌లో కలెక్టర్ మాట్లాడుతూ... దీర్ఘకాలికంగా ఉన్న రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కారం కోసం ప్రభుత్వం రెవెన్యూ శాఖలో ఇటీవల అనేక ఆదేశాలు జారీ చేసిందన్నారు. నిషేధిత భూముల జాబితాలో ఉన్న కొన్ని రకాల భూములు తొలగించేందుకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్థాయి నుంచి ఆర్డీవో, తహసీల్దార్ స్థాయిలోనే దరఖాస్తులు పరిష్కరించటానికి అవకాశం కల్పించారన్నారు. క్షేత్రస్థాయిలోని అధికారులు సక్రమంగా విచారణ ద్వారానే రెవెన్యూ సమస్యలు ఎక్కువ శాతం పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. నూతనంగా రెవెన్యూ శాఖలో జారీ చేసిన ఆదేశాలపై అవగాహన కోసం రెవెన్యూ డివిజన్ అధికారి స్థాయి నుంచి తహసీల్దార్లకు, మండల సర్వేయర్లకు, క్షేత్రస్థాయిలో పనిచేసే విలేజ్ రెవెన్యూ అధికారులకు, గ్రామ సర్వేయర్లకు రెవెన్యూ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రెవెన్యూ సేవలు, దరఖాస్తులు సత్వరమే పరిష్కారం కోసం డివిజన్, మండల, గ్రామస్థాయి రెవెన్యూ సర్వే అధికారుల సామర్థ్యాలను పెంచేందుకు ప్రతి నెల రెవెన్యూ వర్క్‌షాప్‌లలో శిక్షణ నిర్వహించి సమీక్షిస్తామని తెలిపారు. రెవెన్యూ సేవలకు సంబంధించిన దరఖాస్తులను ప్రజలను ఇబ్బంది పెట్టకుండా నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సత్వరమే పరిష్కరించాలన్నారు. పీజీఆర్‌ఎస్ రెవెన్యూ క్లినిక్‌లలో వచ్చిన దరఖాస్తులలో పరిష్కరించే అంశాలను క్షేత్రస్థాయిలో విచారణను సత్వరమే పూర్తి చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పరిష్కరించలేని అంశాలను పూర్తి వివరాలతో దరఖాస్తుదారులకు వివరించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటూ ప్రజలను ఇబ్బంది పెట్టే వారిని గుర్తించి మొదటిసారిగా జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. విలేజ్ రెవెన్యూ అధికారులకు పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేసే అధికారం లేదని, నిబంధనలకు విరుద్ధంగా పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తే వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వెంటనే చేపట్టాలన్నారు. సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ నిషేధిత భూముల జాబితా తొలగింపునకు సంబంధించిన దరఖాస్తులను మూడు నెలల్లో నూరు శాతం పరిష్కరించాలని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి అన్ని రెవెన్యూ ఫైళ్లు ఈ–ఆఫీస్ ద్వారానే కచ్చితంగా పంపించాలన్నారు. సమావేశంలో డీఆర్వో షేఖ్ ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, తెనాలి ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి, ఏడీ సర్వేయర్ పవన్ కుమార్, ఆర్డీవో కె. శ్రీనివాసరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా


