లోకమంతా యోగావశిష్టమే..!
నగరంపాలెం: నేటి సమాజమంతా యోగావశిష్టంతో నిండిపోయిందని మహాసహస్రావధాని, ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ గరికపాటి నరసింహారావు అన్నారు. పట్టాభిపురం శ్రీసత్యనారాయణస్వామి ఆలయ 49వ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి రచించిన యోగావశిష్టంపై బుధవారం ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. డాక్టర్ గరికిపాటి నరసింహారావు ప్రవచనం చేస్తూ.. రామునికి వశిష్ట మహర్షికి జరిగిన సంవాదమే యోగావశిష్టమని అన్నారు. రాముడికి కలిగిన నేను ఎవరనే సందేహనివృత్తికై వశిష్ట మహర్షి వద్దకు వెళ్లారని చెప్పారు. జీవి పుట్టగానే మాయతో నిండి ఉంటాడని, దాన్నుంచి బయటపడేదే యోగావశిష్టం అని పేర్కొన్నారు. మన మనోభావాలను బట్టే మన ఆలోచనా విధానం ఉంటుందన్నారు. జీవి ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరంలోకి ఎందుకు ప్రవేశించాలనీ రాముడు వశిష్టుని అడిగారని తెలిపారు. జన్మనెత్తడానికి దుఃఖానికి కారణం నేను అనేది వదలి పెట్టాలన్నారు. బంధాల వలన వినాశనం తప్పదన్నారు. దేశభక్తి లేనిదే దైవభక్తి లేదని తెలిపారు. ప్రతి హిందూ అన్నవాడు ఏదో రకమైన బొట్టు పెట్టుకోవాలని సూచించారు. ఒకనాడు విశ్వగురువుగా ఉన్న భారతదేశం కొన్ని కారణాల వల్ల విశ్వగురు స్థానాన్ని కోల్పోయిందని, దాన్ని మళ్లీ విశ్వ గురు స్థానంలో నిలబెట్టేందుకు ప్రయత్నం చేయాలన్నారు. కార్యక్రమంలో దేవస్థానం నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక ప్రవచనకర్త
డాక్టర్ గరికపాటి నరసింహారావు
లోకమంతా యోగావశిష్టమే..!


