గుంటూరులో ప్రధాన్ హాస్పిటల్స్ ప్రారంభం
గుంటూరు మెడికల్: గుంటూరు నగర ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు చేరువ చేసేందుకు, ప్రధాన్ హాస్పిటల్‌ను ప్రారంభిస్తున్నట్లు డాక్టర్ పులివర్తి వెంకటేష్ చెప్పారు. ఆదివారం గుంటూరు ఎల్‌వీవీఆర్ అండ్ సన్స్ క్లబ్ ఎదురుగా లక్ష్మీపురం నాలుగో లైన్‌లో నూతనంగా నిర్మించిన ప్రధాన్ హాస్పటల్‌ను డాక్టర్ పులివర్తి వెంకటేష్ తల్లి పులివర్తి సుధారాణి ప్రారంభించారు. వెంకటేష్ కన్‌స్ట్రక్షన్ అధినేత, ప్రముఖ బిల్డర్ పులివర్తి శేషగిరిరావు సమక్షంలో జరిగిన ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సోమవారం నుంచి వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. జిల్లాలోనే తొలిసారిగా అత్యాధునిక వసతులతో నిర్మించిన 12 పడకల ఐసీయూతో పాటు రోగులకు ఎటువంటి సందర్భంలోనూ ఇన్ఫెక్షన్ సోకకుండా ఐసోలేషన్ పడకలు ఏర్పాటు చేశామన్నారు. శస్త్రచికిత్సల సమయంలో క్లిష్టతరమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఇతర ఇన్ఫెక్షనులు సోకకుండా నివారించేందుకు లామినార్ ఎయిర్ ఫ్లో థియేటర్, అడ్వాన్స్‌డ్ అనస్థీషియా వర్క్ స్టేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. క్లిష్టతరమైన ప్రసవాలను చేసే సాంకేతిక నైపుణ్యంతో పాటు అనుభవజ్ఞులైన వైద్యులు ఈ ఆసుపత్రి ప్రత్యేకతగా డాక్టర్ వెంకటేష్ వెల్లడించారు. నగరంలో ఇప్పటివరకు ప్రధాస్ క్లినిక్స్ ద్వారా వైద్య సేవలు అందించిన డాక్టర్ వెంకటేష్ అధునాతన సౌకర్యాలు గల ఈ ఆసుపత్రి ద్వారా మరిన్ని విభాగాల్లో వైద్య సేవలు అందించడం పట్ల వైద్యులతో పాటు రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు అభినందించారు. నిర్మాణ రంగంలో 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో నాణ్యత ప్రమాణాలు, నైతిక విలువలకు మారుపేరుగా నిలిచిన వెంకటేష్ కన్‌స్ట్రక్షన్ అధినేత పులివర్తి శేషగిరిరావు ఆధ్వర్యంలో ఆయన కుమారుడు డాక్టర్ వెంకటేష్ నిర్వహించనున్న ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.అతిథులకు వెంకటేష్ కన్‌స్ట్రక్షన్ డైరెక్టర్లు పులివర్తి కమలేష్, పులివర్తి యోగేష్‌లు కృతజ్ఞతలు తెలిపారు.


