దేవుని సహవాసమే శాంతి మార్గం
బైబిల్ మిషన్ మహోత్సవాల కన్వీనర్ రెవ. జె.శామ్యేల్ కిరణ్ వేడుకలకు పోటెత్తిన క్రైస్తవ భక్తులు
పెదకాకాని: దేవుని సహవాసమే శాంతి మార్గమని బైబిల్ మిషన్ అధ్యక్షుడు, మహోత్సవాల కన్వీనర్ రెవరెండ్ జె. శామ్యేల్ కిరణ్ అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట మహోత్సవాల ప్రాంగణంలో ఫాదర్ ఎం దేవదాసుకు దేవుడు బయలపరిచిన 88వ బైబిల్ మిషన్ మహోత్సవాలు సోమవారం రెండో రోజుకు చేరుకున్నాయి. జె. శామ్యేల్ కిరణ్ వాక్యోపదేశం చేస్తూ తల్లిదండ్రులు తమ పిల్లలను ధార్మిక జీవన మార్గంలో ప్రోత్సహించాలన్నారు. మారు మనసే స్వస్థతకు మొదటి మెట్టు అని, ఏసు నామంలో సంపూర్ణ స్వస్థత లభిస్తుందని బోధించారు. దేవుని చిత్తానుసారంగా ప్రయాణిస్తూ విధేయత, విశ్వాసం, సేవాభావంతో ముందుకు సాగితేనే క్రైస్తవ సమాజం బలంగా నిలబడుతుందని బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ పి. జాన్ దేవదాసు అన్నారు. దైవ నిర్ణయం ప్రకారం ప్రతి విశ్వాసి తన జీవన ప్రయాణాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో సాగితేనే జీవితం సార్థకం అవుతుందని రెవరెండ్ బి. ప్రసాద్ వివరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సంగీత బృందం ప్రత్యేక గీతాలు ఆలపించింది.
పెరిగిన భక్తుల తాకిడి
బైబిల్ మిషన్ మహోత్సవాలకు హాజరైన భక్తులు పెదకాకాని స్వస్తిశాలకు తరలి వెళ్లడంతో అక్కడ తాకిడి పెరిగింది. భక్తిశ్రద్ధలతో స్వస్తిశాలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసుకున్నారు. మహోత్సవాలకు హాజరైన ప్రతి ఒక్కరు పెదకాకాని తోటకు వెళ్లడం, దేవునికి ప్రార్థించుట తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. బైబిల్ మిషన్ మహోత్సవాలకు సోమవారం నంబూరు వీవీఐటీ విశ్వవిద్యాలయం చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, కర్ణాటక చెందిన ఐపీఎస్ అధికారిణి సంగీత, ఐఎఫ్‌ఎస్ అధికారిని రాధ, ఐఆర్‌ఎస్ అధికారి వినయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. వారికి నిర్వాహకులు ఆశీర్వాద వచనాలు అందజేశారు. మహోత్సవాలు మంగళవారం మధ్యాహ్నంతో ముగియనున్నాయి. తెల్లవారుజామున ధ్యానం, ఉదయం 9 – సాయంత్రం 4 గంటల వరకు క్రైస్తవ కీర్తనల ఆలాపన, దైవ సందేశాలు, మహోత్సవాల కన్వీనర్ నివేదిక సమర్పణ తదితర కార్యక్రమాలు ఉంటాయి.
దేవుని సహవాసమే శాంతి మార్గం
దేవుని సహవాసమే శాంతి మార్గం


