కక్షతోనే జోగి రమేష్‌పై అక్రమ కేసు
మాజీ మంత్రులు రాంబాబు, రజిని
ఇబ్రహీంపట్నం: మాజీ మంత్రి జోగి రమేష్ మీద సీఎం చంద్రబాబు కక్ష తీర్చుకోవడానికి అన్యాయంగా కేసులో ఇరికించారని, అయితే దీని వల్ల జోగి రమేష్‌కి క్రేజ్ పెరిగిందే కాని ఎక్కడా తగ్గలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బెయిల్‌పై బయటకు వచ్చిన జోగి రమేష్, ఆయన సోదరుడు రామును మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని సోమవారం వేరువేరుగా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పరామర్శించారు. జోగి రమేష్‌తో పాటు ఆయన సతీమణి జోగి శకుంతలమ్మ, కుమారుడు రాజీవ్ తదితరులకు ధైర్యం చెప్పి యోగక్షేమాలు తెలుకున్నారు.
భయపడే ప్రసక్తే లేదు..
అంబటి మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నాయకులపై కక్ష పూరితంగా కేసులు పెడితే పార్టీ బలహీన పడుతుందని చంద్రబాబు భావిస్తున్నారని, కానీ నాయకులు భయపడకుండా పట్టుదలతో వైఎస్సార్ సీపీని బలపేతం చేస్తామని తెలిపారు. హాస్పిటల్లో పరామర్శించడానికి వెళ్లిన ఆయన సతీమణిపై కూడా కేసు పెట్టడం దారుణమన్నారు. అధికార మదం చూపిస్తే భవిష్యత్తులో వారికి సరైన గుణపాఠం ప్రజలు చెబుతారన్నారు. రెండేళ్ల కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వ పతనం కనిపిస్తోందన్నారు. కార్యకర్తలు రెడ్‌బుక్‌ను సైతం లెక్కచేయడం లేదని, రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయ బావుటా ఎగరవేస్తుందన్నారు. లోకేష్ సీఎం కొడుకు కాబట్టి పెత్తనం చేస్తున్నారని, టీడీపీ పతనానికి అతనే నాంది పలుకుతున్నారని జోస్యం చెప్పారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని తెలిపిన వైఎస్సార్ సీపీని దెబ్బతీయటానికి హిందూ మతాన్ని చంద్రబాబు అడ్డు పెట్టుకోవడం దురదృష్టకరమన్నారు. అమరావతిలో జనసేన నాయకులు వ్యతిరేకిస్తున్న ఎన్టీఆర్ విగ్రహం ప్రజాధనంతో ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ఎన్టీఆర్ విగ్రహం పెట్టే అర్హత లేదన్నారు.
మరింత బలంగా పోరాడతాం..
విడదల రజిని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్న తమ పార్టీ నాయకులను కేసుల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం వేధిస్తోందన్నారు. వాటికి భయపడే ప్రసక్తే లేదన్నారు. బీసీ నాయకుడైన రమేష్‌ను అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకు పంపినప్పటికీ, గతం కంటే బలంగా చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటం చేస్తారని చెప్పారు. 20 నెలల్లో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంపైనా రాని వ్యతిరేకత చంద్రబాబు సర్కారుపై వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో చిలకలూరుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలతో పాటు మైలవరం నియోజకవర్గానికి చెందిన పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.


