డీఆర్‌ఓ ఖాజావలికి రాష్ట్ర స్థాయి అవార్డు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి ఉత్తమ ఎలక్ట్రోరల్ విధానాలను అమలు చేసినందుకు రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చేతుల మీదుగా ఈ అవార్డును ఆదివారం అందుకున్నారు. ఈ ఏడాది ‘నా భారత్ – నా ఓటు‘ (మై ఓట్, మై ఇండియా) థీమ్ తో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రియాశీలకంగా పనిచేయడంతో జిల్లా రెవెన్యూ అధికారికి అవార్డు లభించింది.
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలోని అమరేశ్వరాలయంలో ఉన్న సూర్యదేవాలయంలో రథసప్తమి సందర్భంగా సూర్యభగవానునికి ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాతఃకాలనా సూర్యభగవానుడికి ప్రత్యేకంగా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకా లను పంచామృతాలతో నిర్వహించారు. అనంతరం స్వామి వారికి సహస్రనామ పూజ చేశా రు. సూర్యదేవాలయ అర్చకుడు సప్తగిరి వరప్రసాద్ మాట్లాడుతూ అమరేశ్వరాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పడమర ముఖంగా సూర్యభగవానుడు ప్రతిష్టించటం ప్రత్యేకమన్నారు. ఆలయ అర్చకులు, సిబ్బందితోపాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నగరంపాలెం(గుంటూరువెస్ట్): గుంటూరులో ని శ్రీనగర్ ఆరో వీధిలో కొలువైన త్రిశక్తి పీఠం శ్రీరేణుకమ్మ పెద్దఅంకమ్మ నాగేంద్రస్వామి వార్ల నలభైవ వార్షిక కొలుపుల మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. నిత్య పూజలు అనంతరం భక్తి ప్రపత్తుల నడుమ దేవతమూర్తులను వాహనంపై అలంకరించి, మంగళ వాయిద్యాలు, భాజా భజంత్రీలు, కనకతప్పట్లతో ఊరేగింపుగా నగరోత్సవం కొనసాగింది. ప్రధానవీధుల్లో మహిళలు వారు పోసి కొబ్బరికాయలు కొట్టి సాంబ్రాణి హారతి పట్టారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో త్రిశక్తి పీఠం నిర్వాహకులు కస్తూరి యలమంద వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
నాదెండ్ల: పల్నాడు జిల్లా చిరుమామిళ్ల గ్రామానికి చెందిన గోల్కొండ గ్రూపు సంస్థల చైర్మన్ నడికట్టు రామిరెడ్డి గుంటూరులోని రెడ్డి లేడీస్ హాస్టల్ బ్లాకు నిర్మాణానికి రూ.25 లక్షలు విరాళాన్ని అందించారు. హాస్టల్ వ్యవస్థాపకురాలు ఉడుముల కోటిరత్నమ్మ ఆధ్వర్యంలో గుంటూరు స్తంభాల గరువులోని రెడ్డి లేడీస్ హాస్టల్ పదేళ్లుగా సేవలందిస్తుంది. ఇందులో ఒక బ్లాక్ నిర్మాణానికయ్యే ఖర్చు రూ.25 లక్షలను హాస్టల్ అధ్యక్ష కార్యదర్శు లు ఉడుముల శ్రీనివాసరెడ్డి, వణుకూరి సూరారెడ్డికి అందజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హాస్టల్ నిర్వాహకులు ఆయన్ను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో హాస్టల్ ఉపాధ్యక్షుడు భీమవరపు పిచ్చిరెడ్డి, జాయింట్ సెక్రటరీ ఉడుముల శ్రీనివాసరెడ్డి, ట్రెజరర్ రాజేశ్వరరావు, యన్నం శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆలయానికి రూ.2 లక్షల విరాళం...
గొరిజవోలు గ్రామంలో రూ.4 కోట్లతో నిర్మిస్తున్న గంగా భ్రమరాంబికా సమేత మల్లిఖార్జునస్వామి ఆలయానికి గోల్కొండ గ్రూపు సంస్థల చైర్మన్ నడికట్టు రామిరెడ్డి రూ.2 లక్షల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు ఆదివారం అందించారు. విరాళాన్ని కమిటీ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ కంజుల వీరారెడ్డికి అందించారు. కార్యదర్శి చల్లా బసివిరెడ్డి, కోశాధికారి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
డీఆర్‌ఓ ఖాజావలికి రాష్ట్ర స్థాయి అవార్డు
డీఆర్‌ఓ ఖాజావలికి రాష్ట్ర స్థాయి అవార్డు


