చంద్రబాబు స్వలాభం కోసమే అంజుమన్ భూముల కబ్జా
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): చంద్రబాబునాయుడు తన స్వలాభం కోసం ముస్లిం మైనార్టీలకు చెందిన అంజుమన్ భూములను కబ్జా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్‌బాషా మండిపడ్డారు. శనివారం గుంటూరు బస్టాండ్ వద్ద గల పార్టీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో 71.57 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వడం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు వక్ఫ్‌బోర్డు భూములను కాపాడతానని చెప్పి.. ఇప్పుడు ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నడం దుర్మార్గమైన చర్య అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాగానే ఆ భూములు ఎంతటి బడా బాబుల వద్ద ఉన్నప్పటికీ స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.
మైనార్టీ ఆస్తులను కాపాడేందుకు
ఉద్యమం : అంబటి
మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్‌కి భూదాహం పెరిగిపోతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. మైనార్టీ భూములను కాజేసే కుట్రకు వైఎస్సార్ సీపీ వ్యతిరేకమన్నారు. నారా లోకేష్ ప్రోద్బలంతోనే భూములను కాజేసీ ఇండస్ట్రీలకు అప్పగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 23న ముస్లీం మైనార్టీలంతా ఏకమై అంజుమన్ భూముల స్వాధీనానికి వ్యతిరేకంగా ఉద్యమించి, కలెక్టర్‌కు విన్నవించేందుకు తరలి రావాలని పిలుపు నిచ్చారు.
మైనార్టీల ద్రోహి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ : నూరి ఫాతిమా
ముస్లిం, మైనార్టీల ద్రోహి తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి నూరి ఫాతిమా పేర్కొన్నారు. ముస్లిం ఎమ్మెల్యే అయి ఉండి అంజుమన్ భూముల కాపాడే అంశంపై ఎంతో హేళనగా సమాధానం చెప్పడం చూస్తుంటే నసీర్ అహ్మద్ చేతకానితనం స్పష్టంగా అర్థమవుతుందన్నారు. అంజుమన్ భూముల్లో ఎమ్మెల్యే నసీర్‌కు స్వలాభం ఉంది కాబట్టే ఆ భూములను లాగేసుకుంటున్నప్పటికీ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ నెల 23న కలెక్టరేట్ రోడ్డులోని అంజుమన్ ఈద్గా వద్ద నుంచి భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. అంతే కాకుండా భూములను కాపాడేందుకు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు వివరించారు.
వక్ఫ్ భూములను కాపాడతానన్న
చంద్రబాబు ఇప్పుడు వాటిని కై ంకర్యం చేయాలని చూస్తున్నారు
వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం
రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్‌బాషా


