తెనాలిలో ఏసీ మెకానిక్ దారుణ హత్య
తెనాలి రూరల్: తెనాలిలో ఏసీ మెకానిక్ ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. నందులపేటకు చెందిన ఏసీ మెకానిక్ షేక్ ఫయాజ్ అహ్మద్(52)ని గుర్తుతెలియని దుండగులు బండరాళ్లు, కర్రలతో కొట్టి హతమార్చారు. తెనాలి నందులపేటకు చెందిన ఫయాజ్ టెలిఫోన్ ఎక్చ్సేంజి సమీపంలో ఏసీ మెకానిక్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి తెనాలి టీచర్స్ కాలనీ శివారు ప్రాంతంలో ఉంటున్న మహిళను కలిసేందుకు స్కూటీపై వచ్చాడు. కొద్ది సేపటికి తీవ్ర గాయాలతో ఇంటి సమీపంలోనే పడి ఉన్న ఫయాజ్‌ను సదరు మహిళ తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. హత్య జరిగిన ప్రదేశాన్ని డీఎస్పీ బి.జనార్ధనరావు, త్రీ టౌన్ సీఐ ఎస్. సాంబశివరావు శనివారం ఉదయం పరిశీలించారు. గుంటూరు నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నించింది. డీఎస్పీ మాట్లాడుతూ ఫయాజ్ తన ఇంటికి వచ్చి వెళుతుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చేశారని హిమబిందు తెలిపిందని, ఆమె గాయపడ్డ ఫయాజ్‌ని వైద్యశాలకు తరలించిందని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని చెబుతోందని, ఘటనా స్థలంలో కర్ర, బండరాయితో మోది చంపిన ఆనవాళ్లు కనపడుతున్నాయని తెలిపారు. త్రీ టౌన్ సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెనాలిలో ఏసీ మెకానిక్ దారుణ హత్య


