కళ కళలాడుతున్న పసుపు
రైతులకు చిక్కని భరోసా అధిక వర్షాల ప్రభావంతో దిగుబడి తగ్గుతుందని అంచనా మార్కెట్ ధరలే ఊరట
దిగుబడి తగ్గుతుంది....
తెనాలి: తెనాలి ప్రాంతంలో పసుపు పైరు ఏపుగా పెరిగి పచ్చని పసిమితో కళకళలాడుతోంది. రైతులకు మాత్రం భూమిలో పసుపు దుంప చక్కగా ఊరుతుందన్న భరోసా చిక్కటం లేదు. పంట దున్నేనాటికి ఆశించిన దిగుబడి ఉండేదేమోనన్న గుబులు తొలి చేస్తోంది. ఖరీఫ్ సీజనులో అధిక వర్షాలు, మోంథా తుఫాన్ వరిని దెబ్బతీసిన విషయం తెలిసిందే. వర్షాల కారణంగా పసుపుకు దుంపకుళ్లు అక్కడక్కడా కనిపించింది. దిగుబడిపై మనసులో ఆందోళన ఉన్నా, ప్రస్తుతం మార్కెట్లో పసుపుకు మంచి ధర ఉండటం ఊరటనిస్తోంది.
రెండు వేల ఎకరాల్లో సాగు...
ఖరీఫ్ సీజనులో నాటిన పసుపు జనవరి/ ఫిబ్రవరి నెలల్లో చేతికొస్తుంది. 2023లో మార్కెట్ ధర పతనం కావటంతో ఆ ఏడాది కొందరు రైతులు సాగుకు విముఖత చూపారు. 2023–24 సీజనులో అనూహ్యంగా ధర పెరిగింది. క్వింటాలు రూ.5,000లకు కాస్త అటూ ఇటుగా ఉంటూ ధర పెరుగుతూ రూ.14,800 వరకు కొనుగోళ్లు జరిగాయి. దీంతో 2024–25 ఖరీఫ్ సీజనులో పసుపు సాగు విస్తీర్ణం కొంత పెరిగింది. ఆ ఏడాది ధర కొంత తగ్గింది. క్వింటాలు రూ.12 వేలకు అమ్ముకోగలిగారు. ప్రస్తుతం తెనాలి వ్యవసాయ సబ్‌డివిజనులో దాదాపు రెండు వేల ఎకరాల్లోనే పసుపు సాగు చేశారు. ఇందులో అధికశాతం 1500 ఎకరాల విస్తీర్ణం కొల్లిపర మండలంలోనే ఉంది.
పెట్టుబడి అధికమే..
ఇతర పంటలతో పోల్చితే పసుపు సాగుకు పెట్టుబడి ఖర్చులు అధికమని తెలిసిందే. 2024 మార్చిలో పెరిగిన మార్కెట్ ధరలతో విత్తనం ధర కూడా భారీగానే పెరిగింది. ఎకరాకు ఆరు పుట్ల చొప్పున నాటతారు. మార్కెట్ ధరల ప్రకారం విత్తన ధర ఆధారపడి ఉంటుంది. 2024లో ఒక్కో పుట్టి రూ.10 వేలకు కొనుగోలు చేశారు. 2025లో మార్కెట్ ధర తగ్గటంతో ధర దిగొచ్చింది. పుట్టి రూ.6–9 వేల వంతున అమ్మకాలు జరిగాయి. విత్తనం నాటటం నుంచి ఎండు పసుపు చేతికొచ్చేసరికి ఒక్కో ఎకరాకు కనీసం రూ.1.50 లక్షల పెట్టుబడి వ్యయం చేయాల్సి వస్తోంది. పసుపు సాగుకు కౌలు రూ.50 వేలు పైమాటగానే ఉంది.
దుంపకుళ్లు, తాటాకు తెగులు...
ఇంత పెట్టుబడితో సాగుచేస్తున్న పసుపు పైరును ఖరీఫ్ సీజనులో ఆది నుంచీ ప్రతికూల వాతావరణమే వెంటాడింది. భారీవర్షాలతో పల్లపు చేలల్లో నీరు నిలిచింది. కృష్ణానదికి వచ్చిన వరదతో లంక చేలల్లో వేసిన పైరు మునిగింది. ఈ చేలల్లో పంట చేతికొచ్చేది ఏమీ లేదని, అక్కడక్కడా దుంపకుళ్లు, తాటాకు తెగులు సోకాయి. భూమిలో దుంప ఊరే సమయంలో అల్పపీడనం కారణంగా ముసురు వాతావరణం నెలకొనటం తెలిసిందే. సూర్యరశ్మి పెద్దగా లేకపోవటం ప్రతికూలమని చెబుతున్నారు. ఈ కారణాలతో దిగుబడి ఈసారి తగ్గే అవకాశముందని భావిస్తున్నారు. దిగుబడి కొంత తగ్గినప్పటికీ మార్కెట్ ధర బాగుంటే రైతులు ఒడ్డున పడతారు. ప్రస్తుతం మార్కెట్‌లో ధర ఆశాజనకంగానే ఉంది. దుగ్గిరాల యార్డులో క్వింటా రూ.13–14 వేల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. పంట చేతికొచ్చేసరికి ధర పెరిగితే మేలు కలుగుతుంది. లేదా కనీసం క్వింటాలు రూ.14 వేలు ఉండాలని రైతులు కోరుకుంటున్నారు.
నేను ఎకరం విస్తీర్ణంలో పసుపు సాగు చేశాను. సీజనులో రెండు నెలలపాటు కృష్ణానదికి వరదలు, అధిక వర్షాల కారణంగా భూమి ఆరలేదు. ప్రతికూల వాతావరణంలో పసుపు సరిగ్గా ఊరదు. పైగా దుంపకుళ్లు ఆశించింది. గత ఏడాది ఎకరంలో 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈసారి 20 క్వింటాళ్లకు మించదని అనుకుంటున్నా.. మార్కెట్ ధర కనీసం రూ.15–16 వేలు ఉండాలని కోరుకుంటున్నా.
– వంగా అంజిరెడ్డి, పసుపు రైతు, మున్నంగి
కళ కళలాడుతున్న పసుపు


