ఎండిన మొక్కలు.. తేలని లెక్కలు | - | Sakshi
Sakshi News home page

ఎండిన మొక్కలు.. తేలని లెక్కలు

Apr 13 2025 1:59 AM | Updated on Apr 13 2025 1:59 AM

ఎండిన మొక్కలు.. తేలని లెక్కలు

ఎండిన మొక్కలు.. తేలని లెక్కలు

నెహ్రూనగర్‌: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో లక్షలాది రూపాయలు వెచ్చించి కొన్న మొక్కలు మాయమై పోయాయి. ఈ ఏడాదిలో జనవరి 10న గుంటూరులో ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు. ఆయన పర్యటించే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నుంచి చేబ్రోలు హనుమయ్య కంపెనీ వరకు రోడ్లు అందంగా కనిపించేందుకు ప్రత్యేక మొక్కలు(షో మొక్కలు) తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి రూ. 30లక్షలు వెచ్చించి తెప్పించారు. అయితే, ఎన్ని తెప్పించారో.. ఎన్ని ఉన్నాయో నగరపాలక సంస్థ అధికారుల వద్ద ఎటువంటి లెక్కా లేదు.

ఆవులు, బర్రెలు తినేశాయి?

సీఎం చంద్రబాబు పర్యటన కోసం తెచ్చిన మొక్కలను వివిధ పార్కుల్లో పెట్టారు. అయితే, వాటి పర్యవేక్షణకు చర్యలు తీసుకోకపోవడంతో చాలా వరకు ఎండిపోయాయి. కొద్ది రోజుల కిందట కొరిటెపాడు వాకింగ్‌ ట్రాక్‌లో మొక్కలు పాడైపోయాయని సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో నగరపాలక సంస్థ అధికారులు దీనిపై విచారణ చేపట్టారు. అయితే, మొక్కలు తెప్పించిన ఏడీహెచ్‌ శ్రీనివాస్‌ ఆవులు, బర్రెలు తినేశాయని చెప్పినట్లు సమాచారం. దీంతో ఆయన అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఏడీహెచ్‌ శ్రీనివాస్‌ సరెండర్‌?

మొక్కల నిర్వహణలో ఆలసత్వం వహించిన ఏడీహెచ్‌ శ్రీనివాస్‌ను మాతృశాఖకు సరెండర్‌ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్కుల నిర్వహణకు ఇంజినీరింగ్‌ అధికారులకు అప్పగించారు. మొక్కల బిల్లు కూడా ఇంజినీరింగ్‌ అధికారులు ప్రాసెస్‌ చేయలేదు.వివరాలు లేకపోవడంతో పెండింగ్‌లో పెట్టారు.

నామినేషన్‌ పద్ధతిలో తెప్పించడంపై ఎస్‌ఈ గుర్రు

సీఎం పర్యటన గుంటూరులో ఉన్న నేపథ్యంలో రోడ్లు అందంగా ఉండేందుకు ప్రత్యేకంగా మొక్కలు తెప్పించాలని కమిషనర్‌ ఏడీహెచ్‌ను ఆదేశించారు. దీంతో హడావుడిగా రెండు రోజుల ముందు నామినేషన్‌ పద్ధతిలో కడియం నుంచి తెప్పించారు. మొక్కలు తెప్పించే ప్రక్రియను కాంట్రాక్టర్‌ అప్పగించి ఉంటే బాగుండేదని అప్పుడే ఎస్‌ఈ నాగమల్లేశ్వరావు ఈ ప్రక్రియను వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. నామినేషన్‌ పద్ధతిలో మొక్కలు తెప్పించినందుకే ఆయన బిల్లు ప్రాసెస్‌ చేయడం లేదని నగరపాలక సంస్థ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై నాగమల్లేశ్వరరావును వివరణ కోరగా మొక్కలకు సంబంధించిన బిల్లు పెండింగ్‌లో ఉందని తెలియజేశారు.

రూ.30 లక్షలు హుష్‌ కాకి ! నగరపాలక సంస్థ పరిధిలో నాటామంటూ అధికారులు వెల్లడి ఎక్కడా కనిపించని పరిస్థితి ఇటీవల కొరిటపాడు పార్కులో ఎండిపోయిన మొక్కలు సోషల్‌ మీడియాలో వైరల్‌ పార్క్‌ ఏడీహెచ్‌ శ్రీనివాస్‌ను సరెండర్‌ చేసిన కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement