గోదావరి జిల్లా అల్లుడికి 158 రకాల వంటలతో విందు భోజనం
గుంటూరు జిల్లా: ఉభయ గోదావరి జిల్లాల్లో పండుగలకు వచ్చిన అల్లుళ్లకు అత్తవారింట అతిథి మర్యాదలకు లోటుండదు... రకరకాల పిండి వంటలతో భారీస్థాయిలో విందు భోజనాలు పెడుతుంటారు. ఒక్కోసారి ఆహార పదార్థల సంఖ్య వందల్లో ఉంటూ ఆశ్చర్యపరుస్తుంది. గోదావరి జిల్లాకు చెందిన అల్లుడు గుంటూరు జిల్లా తెనాలిలోని అత్తారింటికి వస్తే మర్యాదలు ఆస్థాయిలోనే ఉండాలి కదా. .అనుకున్నారు కామోసు!
తెనాలి చెంచుపేటలోని శ్రీవేంకటేశ్వర గ్యాస్ కంపెనీ నిర్వాహకులు వందనపు మురళీకృష్ణ దంపతులు తమ అల్లుడు శ్రీదత్తకు సంక్రాంతి పర్వదినం రోజున 158 రకాలతో విందు భోజనం పెట్టారు. మురళీకృష్ణ కుమార్తె మౌనికకు, రాజమండ్రి యువకుడు శ్రీదత్తకు గత ఏడాది వైభవంగా వివాహం జరిగింది. వివాహం తర్వాత వచ్చిన పెద్ద పండగ సంక్రాంతికి అల్లుడిని ఆహ్వానించారు. గోదావరి జిల్లా నివాసి అయిన అల్లుడికి ఆస్థాయి మర్యాద చేయాలనే భారీ విందు ఇచ్చారు. ఈ విందును గురించి పట్టణవాసులు ఆసక్తిగా చర్చించుకున్నారు.

కొత్త అల్లుడికి 145 రకాలతో విందు భోజనం
తెనాలి: సంక్రాంతి పండుగకు కొత్త అల్లుళ్లకు ఇచ్చే మర్యాదల్లో తెనాలి వాసులు గోదావరి జిల్లాలతో పోటీ పడుతున్నారు. ఆయా జిల్లాల సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. పట్టణానికి చెందిన బదరీ బేకరీ నిర్వాహకుడు కనిగిచర్ల రమాకాంత్, సంక్రాంతి రోజున ఆహ్వానించుకున్న అల్లుడు సుదీష్ కుమార్‌కు 145 రకాల వంటకాలతో విందు భోజనం వడ్డించారు.
రమాకాంత్ కుమార్తె భవ్య నిఖిత, నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన సుదీష్‌కు గత ఆగస్టు 13న వివాహమైంది. పెళ్లయ్యాక వచ్చిన తొలి సంక్రాంతికి కుమార్తెను, అల్లుడిని రమాకాంత్‌ను ఆహ్వానించారు. పట్టణ నందులపేటలోని తన నివాసంలో పిండివంటలు, కమ్మని భోజనంతో అల్లుడికి ఘనమైన విందు ఇచ్చారు. తమ ప్రేమను చాటారు.


