మినీ నాటకశాలలే దిక్సూచి
తెనాలి: నాటకం...బతుక్కో పాఠం...నాటక ప్రదర్శనకు వస్తున్నవారిలో ఎక్కువమంది యువతే. యువనటులూ ఈవైపే వస్తున్నారు. భిన్నమైన కథలు, అధునాత సాంకేతికత భాగస్వామ్యంతో నాటకానికి పూర్వవైభవం వస్తోంది. ఇదంతా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో.. అక్కడ కొంతకాలంగా టికెట్ ప్రదర్శనలకు హౌస్‌ఫుల్ బోర్డులు పెడుతున్నారు. ఆ వైభోగం మన రాష్ట్రంలోనూ రావాలంటే మినీ నాటక శాలలు అందుబాటులోకి రావాలి. నటశిక్షణకు కేంద్రప్రభుత్వ ఫండింగ్‌ను అందుకోవాలి. ఆదిశగా సమాయత్తం కావాలని ప్రముఖ రంగస్థల, సినీ నటుడు, దర్శకుడు ఎస్‌ఎం బాషా అభిప్రాయం. తెనాలిలో రాష్ట్రస్థాయి నాటికల పోటీల్లో ఉత్తమ నటుడుగా ఎంపికై న బాషా, తన నట ప్రస్థానాన్ని, నాటక పునరుజ్జీవానికి సూచనలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
కొత్త కథలతో జీవం..
హైదరాబాద్‌లో ఒకప్పుడు కళాప్రదర్శనలంటే రవీంద్రభారతి ఒక్కటే. ఇప్పుడు తక్కువ ఖర్చుతో వేదికలొచ్చాయి. రంగభూమి, ఫీనిక్స్ ఎరినీ, అవర్ సేక్రెడ్ స్పేస్, లమాకాన్, నృత్యం ఫోరం ఫర్ ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్, సప్తగిరి వంటి ఎన్నో కళావేదికలు, నాటకబృందాల కళాదాహాన్ని తీరుస్తున్నాయి. హెచ్‌సీయూ, తెలుగు యూనివర్సిటీ, నిజాం కాలేజీలు థియేటర్ ఆర్ట్స్‌లో శిక్షణనిస్తున్నాయి. ఏటా 150 మంది విద్యార్థులు పీజీ, ఎంఫిల్ పట్టాలతో బయటకొస్తున్నారు. నాటకాలు, సినిమాలు, టీవీ సీరియల్స్, లఘుచిత్రాల్లోనూ వీరికే అవకాశాలు లభిస్తున్నాయి. మూసధోరణిలో సాగే సాంఘికాలు, పౌరాణికాల స్థానంలో తెలుగు సాహిత్యకారులు కొత్త కథలతో జీవం పోస్తున్నారు.
మూడేళ్లపాటు ఆడిట్ చేయిస్తే కేంద్రం ఫండింగ్..
ఆంధ్రాలో ఈ వైభోగం రావాలంటే చిన్నపట్టణాలతో సహా మినీ నాటకశాలలు రావాలి. కళావేదిక, 150–200 మించని సీటింగ్, లైటింగ్, మైక్ సిస్టం, స్క్రీన్‌తో సహా వసతులుంటే, తక్కువ ఖర్చుతో నాటకాలు, రిహార్సల్స్, స్క్రీన్‌పై సినిమాలు, పుస్తక ఆవిష్కరణలు, సమీక్ష సమావేశాలకు అవకాశం ఉంటుంది. అంతర విశ్వవిద్యాలయాల సాంస్కృతిక పోటీలకు వస్తున్న వివిధ రాష్ట్రాల నాటకాలు అద్భుతంగా ఉంటున్నాయి. నాటకసంస్థలు మూడేళ్లపాటు ఆడిట్ చేయిస్తే కేంద్రప్రభుత్వం ఫండింగ్ ఇస్తుంది. ఆంధ్రాలో ఇలాంటి సంస్థలు కేవలం 3–4 ఉంటే, తెలంగాణలో 20, కర్ణాటకలో వందల్లో సంస్థలున్నాయి.
నాటకాలకు ప్రేరణ తెనాలి..
నాటకాలకు ప్రేరణ ఆంధ్రాప్యారిస్ తెనాలి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో 1963లో జన్మించాను. నాన్న మౌలాబి బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి. బదిలీపై తెనాలి రావటంతో ప్రాథమిక విద్య ఇక్కడే. తోటి ఉద్యోగులతో కలిసి నాన్న నాటకం వేశారు. ఆ రిహార్సల్స్, తెనాలి కళావైభవం చూస్తూ పెరిగాను. తర్వాత నరసరావుపేటలో మళ్లీ అలాంటి వాతావరణమే. హై స్కూల్లోనే ఫిరంగిపురంలో జరిగిన రాష్ట్రస్థాయి ఏకపాత్రల పోటీల్లో ద్వితీయ బహుమతి లభించింది. కాలేజీ విద్యార్థిగా అక్కడి ‘రంగస్థలి’లో భాగస్వామిగా నాటకాలాడాం. యూనివర్సిటీ పోటీల్లో నా దర్శకత్వంలో ప్రదర్శించిన ‘జాతర’ నాటికకు ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ దర్శకుడు, విలన్ బహుమతులొచ్చాయి.
30కి పైగా బహుమతులు..
యువత రాకతో నాటకానికి
పూర్వవైభవం
ప్రముఖ రంగస్థల, సినీనటుడు,
దర్శకుడు ఎస్‌ఎం బాషా
వృత్తి.. ప్రవృత్తినీ బ్యాలెన్స్ చేస్తూ..
గుంటూరులో రంగస్థల కళాకారుల ఐక్యవేదిక వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా అయిదేళ్లు పనిచేశాను. హైదరాబాద్‌లోనే నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాలను వివిధ జిల్లాల్లో జరగటానికి నేను తీసుకున్న చొరవే కారణం. కళాకారుల పింఛనుకు, గ్రూప్ ఇన్స్యూరెన్స్‌కు కృషిచేశాను. నేను పనిచేసిన బ్యాంకు శాఖల్లో 200 మందిని నటీనటులుగా తీర్చిదిద్దాను. బ్యాంక్ డే రోజున వారిచే నాటకాలను ప్రదర్శించేలా చేశాను. కళాకృష్ణచే ‘బతుకమ్మ పేరిణి’ నృత్యరూపకాన్ని ముంబయిలో బ్యాంక్ దినోత్సవ రోజున ప్రదర్శన ఇప్పించాం. వృత్తినీ, ప్రవృత్తినీ బ్యాలెన్స్ చేసుకుంటూనే ఇవన్నీ సాధించాను.
చదువయ్యాక 1986లో బ్యాంకు జాబ్ వచ్చింది. ఎక్కడకు వెళ్లినా నాటకాన్ని ఆపలేదు. హైదరాబాద్‌లో సెటిలయ్యాను. 2023 జూన్‌లో రిటైరయ్యాను. మరోవైపు ఇన్నేళ్ల కెరీర్‌లో 60 నాటిక/ నాటకాలను వందల ప్రదర్శనలిచ్చాను. దర్శకత్వం వహించాను. 60 మంది టీమ్‌తో ‘రంగులరాట్నం’ నాటకాన్ని విస్తృతంగా ఆడాం. కథా రచయిత గంధం నాగరాజుతో నాటకం రాయించింది నేనే. లక్ష్మి, మహాత్మ, గోల్కొండ హైస్కూల్, బాణం వంటి సినిమాల్లోనూ నటించాను. తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం, గరికపాటి రాజారావు పురస్కారం, నంది నాటకాల్లో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయనటుడు సహా వివిధ పరిషత్తులో 30 పైగా బహుమతులు అందుకున్నాను.
మినీ నాటకశాలలే దిక్సూచి


