గుంటూరువెస్ట్: యువతలోని క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి స్థానిక బ్రాడీపేట 3/11 మాస్టర్‌మైండ్స్ బాలాజీ క్యాంపస్(వజ్రం హోటల్ వెనుక)లో ఉచిత ప్రత్యేక చెస్ శిక్షణ కార్యక్రమం జరగనుంది. మాస్టర్‌మైండ్స్ సౌజన్యంతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో పేరొందిన శిక్షకులచే మెలకువలు నేర్పిస్తారు. ముందుగా వచ్చిన 30 మందికి మాత్రమే అవకాశం. ఉచితంగా శిక్షణతోపాటు పార్టిసిపేషన్ సర్టిఫికెట్, ప్రోత్సాహక బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్‌కు అంజిబాబును 92484 45648 నెంబర్‌లో సంప్రదించగలరు.
గుంటూరు దిశ డీఎస్పీగా రామారావు బాధ్యతలు స్వీకరణ
పట్నంబజారు: గుంటూరు దిశ పోలీసు స్టేషన్ డీఎస్పీగా కె.సి.హెచ్.రామారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1991 బ్యాచ్ ఎస్‌ఐ అయిన రామారావుకు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పనిచేసిన అనుభవం ఉంది. 2011లో ఆయన సీఐగా పదోన్నతి పొంది, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో పనిచేశారు. 2020లో డీఎస్పీగా పదోన్నతి పొందిన ఆయన సీఐడీ కర్నూలు జిల్లాలో పనిచేశారు. అనంతరం బదిలీల్లో భాగంగా గుంటూరు దిశ పోలీసు స్టేషన్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ కలహాల నేపథ్యంలో స్టేషన్‌కు వచ్చే ప్రతి కుటుంబ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అదేవిధంగా మహిళలు, విద్యార్థినులు, యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించి, వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పారా మెడికల్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
గుంటూరుమెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో పారా మెడికల్ ఉద్యోగాలను కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు తెలిపారు. ఉద్యోగాలకు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్హతలు, పోస్టుల వివరాలు, దరఖాస్తు ఫారాల కోసం గుంటూరుఏపీ.ఇన్/ఎంహెచ్2023 వెబ్‌సైట్‌లో చూడాలన్నారు. ఆన్‌లైన్‌లో కాకుండా వ్యక్తిగతంగా ఇతర మాధ్యమాల ద్వారా దరఖాస్తులు స్వీకరించరని, ఈనెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
మొక్కజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
మార్క్‌ఫెడ్ డీఎం కరుణ
మార్టూరు: రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంటను రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మార్క్‌ఫెడ్ డీఎం కరుణ అన్నారు. మండలంలోని వలపర్ల గ్రామంలో సోమవారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆమె అధికారులు, రైతులతో మాట్లాడారు. తేమ శాతం 14 శాతం కంటే తక్కువ, ఇతర వ్యర్థాలు 1 శాతంలోపు ఉండాలన్నారు. రైతులు ఆర్బీకే సెంటర్‌లలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆమె తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ లోకనాథం, ఏఓ వీ కిరణ్‌కుమార్, స్థానిక రైతులు పాల్గొన్నారు.
యార్డుకు 1,00,102 బస్తాల మిర్చి రాక
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు సోమవారం 1,00,102 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 96,526 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నెంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.10,000 నుంచి రూ.23,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగి, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ.23,500 వరకు పలికింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.13,000 వరకు ధర లభించింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 64,054 బస్తాలు మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.


