అబార్షన్‌ హక్కుకు గొడ్డలిపెట్టు

US Abortion Ruling Is Setback to Women Rights: Vineeta Dwivedi Opinion - Sakshi

ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఒక పసిపాప భూమ్మీదికి వచ్చిన వార్త కంటే సంతోష కరమైన విషయం మరొకటి ఉండదు. భూమ్మీద అన్ని బాధలూ, వ్యాధులూ, మరణాలూ సంభవిస్తున్నప్పటికీ, శిశువు జన్మించడం అంటే ఒక కుటుంబ భవిష్యత్తే కాదు, మానవజాతి భవిష్యత్తుకు కూడా గొప్ప ఆశాభావాన్ని కలిగిస్తుందన్నమాట. అందుకే కడుపులో ఉన్న బిడ్డను అబార్షన్‌ రూపంలో చంపడం అంటే అది ఘోరమైన హత్య అని చాలామంది విశ్వసిస్తున్నారు. కానీ బిడ్డ పుట్టడం అనేది అంత సులభమైన విషయం కాదు. అత్యంత నిస్పృహలో, నిరాశాజనకమైన పరిస్థితుల్లో పుట్టే బిడ్డ జననం మహిళలను తరచుగా తీవ్రమైన కుంగుబాటుకూ, కొన్నిసార్లు వైద్యపరమైన సంక్లిష్టతల్లోకీ నెడుతుంటుంది.

కానీ జన్మనివ్వడం అనేది మహిళలు, వారి కుటుంబాలు చేసుకోవలసిన ఎంపిక. అత్యవసరమైన సమయాల్లో అది వారి హక్కు, ఎంపికగా మాత్రమే ఉంటుంది. స్వచ్ఛంద మాతృత్వం అని కొంత మంది చెబుతున్నది, మహిళల గర్భస్రావ హక్కు. ఇది పునరుత్పత్తి, పనిలో సమానత్వానికి సంబంధించిన సాహసోపేతమైన ఫెమినిస్టు డిమాండుగా మాత్రమే లేదు. ఇది నిజంగానే మహిళ తన సొంత దేహంపై తాను మాత్రమే తీసుకోవలసిన ఎంపిక స్వాతంత్య్రంగా ఉంటుంది.

అబార్షన్‌ అనేది వైద్యపరమైన అవసరమనీ, వైద్య శాస్త్రం స్వీయాత్మకమైన అంశంగా ఉండదనీ అమెరికన్‌ కాలేజీ ఆఫ్‌ ఆబ్‌స్టిట్రీషియన్స్‌ అండ్‌ గైనకాలజిస్ట్స్‌ (ఏసీఓజీ) చెప్పింది. అబార్షన్‌ రూపంలో గర్భధారణను తొలగించడానికి వైద్యపరమైన జోక్యం అవసరమైన పరిస్థితులు ఉంటాయి. మహిళ ఆరోగ్యాన్ని ఈ జోక్యమే కాపాడుతుంది. 

2012లో సవితా హలప్పనవర్‌ అనే భారత సంతతి మహిళా డెంటిస్టు ఐర్లండులో రక్తంలో వ్యాధికారక క్రిములు ఉన్న కారణంగా ఆపరేషన్‌ అవసరమైన పరిస్థితుల్లో దారుణంగా చనిపోయారు. అబా ర్షన్‌ చేసుకుంటానన్న ఆమె డిమాండును ఐర్లండ్‌ చట్టాలు తిరస్కరిం చాయి. ఆమె మరణం పెద్ద ఉద్యమానికి దారితీసి, ఐర్లండులో సంస్క రణలు తీసుకొచ్చింది. దీంతో 2018లో ఆరోగ్య బిల్లు (గర్భధారణ తొలగింపు క్రమబద్ధీకరణ చట్టం)ను కూడా ఆ దేశం ఆమోదించింది. 

1973 నాటి ‘రో వర్సెస్‌ వేడ్‌’ తీర్పును గత వారం అమెరికా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మహిళల అబార్షన్‌ హక్కును ఎత్తిపట్టిన ఆనాటి తీర్పును అమెరికన్‌ సుప్రీంకోర్టు రద్దు చేసింది. అదే సమయంలో గర్భస్రావ ప్రక్రియను విడివిడిగా రాష్ట్రాలు ఆమోదించచ్చు లేదా పరిమితం చేయవచ్చునని ఫెడరల్‌ కోర్టు పేర్కొంది. దీంతో గత పాతికేళ్లలో చట్టపరమైన అబార్షన్‌కు ఉన్న రక్షణలను తొలగించిన నాలుగు దేశాల్లో అమెరికా ఒకటిగా మారింది. అబార్షన్‌ చట్టాలపై ఆంక్షలు విధించడం అనేది మహిళలకు వ్యతిరేకంగా వివక్షలో ఒక రూపమని మానవ హక్కుల సంస్థలు విమర్శిస్తున్నాయి. అంతర్జాతీయ న్యాయవాదులు, అడ్వకేట్ల హక్కుల సంస్థ అయిన సెంటర్‌ ఫర్‌ రీప్రొడక్టివ్‌ హెల్త్, అమెరికా సుప్రీంకోర్టు తాజా చర్యను నిశితంగా విమర్శించింది.

అబార్షన్లపై తరచుగా జరుగుతున్న చర్చ గర్భస్థ పిండం, పిండంలో రూపు దిద్దుకుంటున్న జీవానికి సంబంధించి మానసిక, వైద్యపరమైన అంశాలపై మాత్రమే దృష్టి సారిస్తోంది. అయితే పిల్లలను కనాలా, వద్దా అనే అంశాన్ని మహిళలు నిర్ణయించుకోవడం ఒక సామాజిక అడ్డంకిగా ఎందుకుందనే ప్రశ్నపై చర్చ జరగడం లేదు. మహిళలు కేవలం గర్భస్థ పిండాన్ని మోసేవారు మాత్రమే కాదు. ఇలాంటి అభిప్రాయంతోనే పిండంలో రూపొందుతున్న మరొక ప్రాణిని కాపాడే బాధ్యతను రాజ్యవ్యవస్థ తీసుకుని నిర్బంధ చట్టాలను అమలు చేస్తోంది. అబార్షన్‌ హక్కును నిషేధించడం మహిళకు ఎలాంటి అండనూ లేకుండా చేస్తుంది. ఆమె సొంత దేహం, ఆమె ఎంపిక అనేవి ఇంకా పుట్టని బిడ్డ కంటే ద్వితీయ ప్రాధాన్యత కలిగిన అంశాలుగా మారిపోయాయి. కడుపులోని పిండాన్ని కాపాడటానికి మహిళ ప్రవర్తనను క్రమబద్ధీకరిస్తున్నారు, నియంత్రిస్తున్నారు. మహిళ అంటే గర్భాన్ని మోయడం తప్ప ఒక వ్యక్తిగా ఇక ఏమాత్రం ఉండదన్నమాట.

తల్లి శారీరక, మానసిక ఆరోగ్యం ప్రమాదంలో పడినప్పడు అబార్షన్‌ చేసుకోవడాన్ని ప్రపంచంలో మూడింట రెండొంతుల దేశాలు అనుమతిస్తున్నాయి. అత్యాచారం ద్వారా, వివాహేతర సంబంధం ద్వారా గర్భం దాల్చినప్పుడు లేక బలహీనమైన పిండం కారణంగా గర్భస్రావాన్ని సగం దేశాలు అనుమతిస్తున్నాయి. కాగా ఆర్థిక, రాజకీయ కారణాలవల్ల లేక అభ్యర్థించిన కారణంగా గర్భస్రావాన్ని మూడింట ఒక వంతు దేశాలు మాత్రమే అనుమతిస్తున్నాయి. ఆంక్షలతో కూడిన అబార్షన్‌ విధానాలు ఉన్న దేశాల్లో సంతానోత్పత్తి రేటు అధికంగా ఉంటోంది. అయితే అబార్షన్లపై ఆంక్షలు విధించిన దేశాల్లో అరక్షిత అబార్షన్‌ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ దేశాల్లో ప్రసూతి మరణాలు కూడా చాలా ఎక్కువగా సంభవిస్తున్నాయి.

1973 నాటి రో తీర్పు వల్ల అమెరికాలో వేలాదిమంది టీనేజర్లు బాల్యవివాహాన్ని, చిన్నతనంలోనే మాతృత్వాన్ని అధిగమించడానికి వీలయింది. అలాగే అవాంఛిత, అనూహ్యమైన గర్భధారణల కారణంగా తక్షణం వివాహాలు చేసుకోవలిసిన పరిస్థితినుంచి మహిళలను ఈ తీర్పు కాపాడింది. కానీ ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశంలో ఇలాంటి తీర్పు రావడం అనేది మహిళల హక్కులపై తీవ్ర అఘాతం మాత్రమే కాదు... దశాబ్దాల స్త్రీవాద ఉద్యమం, మహిళల పునరుద్ధరణ, వారి హక్కుల రక్షణ కూడా ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది.

అబార్షన్‌ చేసుకోగలగడానికీ, మహిళలు ఎప్పుడు, ఎక్కడ, ఏ పరిస్థితుల్లో తల్లులు కావాలో నిర్ణయించుకోవడానికీ మధ్య సాధారణమైన లింకు ఉంటోందనీ, ఇది మహిళల జీవితాంతం వారిపై ప్రభావాలు వేస్తోందనీ 2021 బ్రూకింగ్స్‌ ఇనిస్టిట్యూట్‌ నివేదిక పేర్కొంది. మహిళల విద్య, ఆదాయం, కేరీర్, తమ పిల్లలకోసం కల్పించాల్సిన జీవితంపై ఇది పెను ప్రభావం చూపిస్తూంటుంది.

రో వర్సెస్‌ వేడ్‌ తీర్పును రద్దు చేయడం ద్వారా అబార్షన్ని రద్దు చేయడం, లేదా పూర్తిగా ఆ హక్కుకే దూరం చేయడం అనేది మహిళల వ్యక్తిగత, ఆర్థిక జీవితాలను, వారి కుటుంబ జీవితాలను హరింప జేస్తుందని ఈ నివేదిక స్పష్టం చేసింది.

అబార్షన్‌ చేసుకునే రాజ్యాంగబద్ధమైన హక్కును అమెరికన్‌ మహిళలు ప్రస్తుతం కోల్పోతుండగా, భారతదేశం మాత్రం 1971 నుంచే వైద్యపరంగా గర్భధారణ తొలగింపు చట్టం (ఎంటీపీ)ని కలిగి ఉంది. జనన లేదా కుటుంబ నియంత్రణ సాధనంగా ఇది ఉనికిలోకి వచ్చింది. 2021లో తీసుకొచ్చిన చట్ట సవరణ ద్వారా 24 వారాలలోపు గర్భస్రావం చేసుకునేందుకు ఈ చట్టం భారత మహిళలకు అనుమతించింది. మహిళల ఆరోగ్యానికి సురక్షితమైన, చట్టబద్ధమైన అబార్షన్లు ఎంతగానో అవసరం అవుతాయి. అయితే గర్భధారణను తొలగించుకోవాలంటే భారత్‌లో వైద్యుల ఆనుమతి అవసరం. కానీ అవివాహిత మహిళలు గర్భస్రావాన్ని చేయించుకోవడం భారత్‌లో మహిళలకు కళంకప్రాయంగా ఉంటున్న స్థితి కొనసాగుతోంది.

అబార్షన్‌ హక్కును వెనక్కు తీసుకోవడం అంటే ఆధునికతను మడతపెట్టేయడమే అవుతుంది. చట్టబద్ధమైన పద్ధతులు, వైద్యపరంగా సురక్షితమైన అబార్షన్లు లేకుంటే మహిళలు మరింత ప్రమాదంలో పడతారు. వారి జీవితాలు మరింతగా దుర్భరమవుతాయి. అనూహ్యమైన, అవాంఛితమైన గర్భధారణను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు మహిళలు మరింత ప్రమాదకరమైన, అంధకారయుతమైన స్థానంలోకి నెట్టబడతారు. పైగా నిర్బంధ మాతృత్వం వల్ల వారి జీవిత గమనమే మారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. (క్లిక్‌: ఆదివాసీలు అందరికీ ప్రయోజనాలు అందాలి)

- వినీతా ద్వివేది 
అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ఎస్పీజేఐఎంఆర్‌
(‘మింట్‌’ సౌజన్యంతో)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top