Mallepally Laxmaiah: ఆదివాసీలు అందరికీ ప్రయోజనాలు అందాలి

Tribals Should Receive Benefits for All: Mallepally Laxmaiah - Sakshi

కొత్త కోణం

‘‘ఆదివాసులకు ప్రత్యేక పాలనా ధికారాలు, స్వయం పాలనా వ్యవస్థలు ఉంటాయి. వాళ్ళ ఆర్థిక, సామాజిక పునాదులపై ఆధారపడి మాత్రమే వారి అభివృద్ధి సాగాలి. వాళ్ళ ప్రాంతానికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నా వాళ్ళ ప్రత్యేక మండళ్ళ అంగీకారం తప్పనిసరిగా ఉండాలి.’’ నవంబర్‌ 26, 1949న భారత రాజ్యాంగ సభ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలు ఇవి. రాజ్యాంగ సభలో ఆదివాసీల తరఫున డిసెంబర్‌ 16, 1946న స్వయంగా ఆదివాసీ అయిన జైపాల్‌ సింగ్‌ ముండా మాట్లాడుతూ... ‘‘నా జాతి ప్రజలను ఆదివాసీయేతరులు నిరంతరం దోపిడీ చేయడం యావత్‌ దేశ చరిత్ర నిండా కనిపిస్తుంది. అయితే మనం ఈ రోజు నూతన చరిత్రకు శ్రీకారం చుట్టాలి. స్వతంత్ర భారతంలో నా ప్రజలు నిర్లక్ష్యానికి గురికాకుండా సమానత్వం కోసం కృషి చేయాలని రాజ్యాంగ సభనూ, ప్రత్యేకించి ఈ సభ నాయకుడు జవహర్‌ లాల్‌ నెహ్రూనూ కోరుతున్నాను’’ అని అన్నారు. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆది వాసీల రక్షణకు అనేక ఏర్పాట్లు రాజ్యాంగంలో చేసిన విషయమూ తెలిసిందే.

బాబూ రాజేంద్రప్రసాద్, జైపాల్‌ సింగ్‌ ముండాలు చేసిన వ్యాఖ్యానాలకూ, డిమాండ్లకూ ఈనాటికీ కాలం చెల్లలేదు. వాళ్ళు ఆశించిన వ్యవస్థ గానీ, పరిస్థితులు గానీ ఈనాటికీ ఆవిష్కృతం కాలేదు. 75 ఏళ్ళ స్వాతంత్య్రం గానీ, 72 ఏళ్ళ రాజ్యాంగ రక్షణ గానీ ఇంకా ఆదివాసులకు రావాల్సినంత స్థాయిలో అందుబాటులోకి రాలేదు.

సరిగ్గా ఈ సమయంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని నేషనల్‌ డెమోక్రా టిక్‌ అలయెన్స్‌ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్మూ పేరును ప్రతిపాదించింది. దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందనేది పరిశీలకుల అభిప్రాయం. ద్రౌపదీ ముర్మూ సంతాల్‌ తెగకు చెందిన ఆదివాసీ మహిళ. భారతదేశంలోని ఆదివాసీ తెగలలో సంతాల్‌ తెగ జనాభా రీత్యా మూడవ అతిపెద్ద తెగ. ఆదివాసీ తెగలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యంగా పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, బిహార్‌ రాష్ట్రాల్లో బీజేపీ ప్రత్యక్షంగా అధికారంలో లేనందువల్ల అక్కడి ఆదివాసీ ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలుచు కోవడం ద్వారా రాష్ట్రపతి గెలుపును సులభతరం చేసుకోవచ్చునని బీజేపీ భావించి నట్టు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇది నిజమే కావచ్చు. అంతే కాకుండా ఆదివాసుల పట్ల తమ ప్రభుత్వం ఎంతో చేస్తోందనీ, వారికి అనుకూలంగా ఉందని జాతీ యంగా, అంతర్జాతీయంగా చెప్పుకోవడానికి కూడా ద్రౌపదీ ముర్మూని ముందు భాగాన నిలిపి ఉండవచ్చు.

అభిప్రాయాలేవైనా, కారణాలేమైనా ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా చేయడానికి బీజేపీ నిర్ణయించడం ఆహ్వానించదగినదే. భారతదేశ రాజకీయ చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టంగా ఉండబోతోంది. ఎన్డీయే ఇప్పటికే ఒక ముస్లింను, ఒక దళితుడిని రాష్ట్రపతిగా అందించింది. అయితే ముస్లింనూ, దళితుడినీ మొదటిగా రాష్ట్రపతిని చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే కావడం విశేషం.

ఒక వ్యక్తిని ముఖ్యంగా అణగారిన వర్గాలు, నిర్లక్ష్యానికి గురైన వర్గాలనుంచి ఏదైనా ఒక ముఖ్యమైన స్థానంలో నియమించినా, నిలబెట్టి గెలిపించినా, దాని ప్రయోజనం ఆ వ్యక్తికే పరిమితం కాకూడదనేది ప్రజాస్వామిక సూత్రం. ఒక సమూహానికి ఒక వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తే ఆ వ్యక్తికే కాక ఆ సమూహానికీ ప్రయోజనం చేకూరాలి. ద్రౌపదీ ముర్మూను రాష్ట్రపతిగా గెలిపించాలనే బీజేపీ సంకల్పం కేవలం ద్రౌపదీ ముర్మూ వ్యక్తిగత హోదాను పెంచడం, దానితో రాజకీయ ప్రయోజనం సాధించడం వరకు ఆగిపోకూడదు. ఇప్పటివరకు నిర్లక్ష్యానికి, దోపిడీ, అణచివేతకు గురైన ఆదివాసుల పట్ల ఒక ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరమే కాదు, బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అప్పుడు మాత్రమే బీజేపీకి ఆదివాసుల పట్ల ప్రేమ ఉన్నట్లు అర్థం చేసుకోగలం. 

మిగతా సమాజంతో పోల్చి చూసినప్పుడు ఇప్పటి వరకు ఆదివాసుల జీవితాల్లో వచ్చిన మార్పు చాలా స్వల్పమే. నిజం మాట్లాడాలంటే శూన్యమనే చెప్పాలి. భారతదేశంలో దాదాపు ఒక లక్షా 50 వేల గూడేలున్నాయి. అందులో చాలా గూడేలకు సరైన మౌలిక వసతులు లేవనే విషయాన్ని నవంబర్‌ 18, 2019న నాటి ఆదివాసీ శాఖా మంత్రి అర్జున్‌ ముండా లోక్‌సభకు తెలియచేశారు. ఇదే సందర్భంలో మరిన్ని వాస్తవాలనూ ఆయన తెలిపారు. భారత్‌లో మొత్తం గృహాలు 24 కోట్ల 66 లక్షల 92 వేల ఉండగా, ఆదివాసులవి 2 కోట్ల 33 లక్షల ఇళ్ళున్నట్లు, దాదాపు ఒక కోటి యాభై లక్షల ఇళ్ళు సరైన రీతిలో లేవని తెలిపారు. మరుగుదొడ్లు అతి స్వల్పంగా నిర్మాణ మయ్యాయి. 70 శాతం పిల్లలు 10వ తరగతి నుంచే చదువులు మానేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వస్తే అన్ని తరగతుల్లో కలిపి ఆదివాసీలు 6 శాతానికి మించి లేరు. ఇందులో 4వ తరగతి చిన్నా చితకా ఉద్యోగాలే అధికం.
 
ఆదివాసులు ఎక్కువగా మలేరియా, క్షయ వ్యాధులతో మరణిస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. దేశంలో వంద మంది మలేరియా బారిన పడితే అందులో ఆదివాసులు 30 మంది ఉంటున్నారు. అదివాసీ జనాభాలో ఇది 50 శాతం. పిల్లలకు వ్యాక్సిన్‌ సదుపాయాలు అందలేకపోవడం వల్ల శిశు మరణాల సంఖ్య చాలా అధికంగా ఉంది. దాదాపు 50 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. క్షయ వ్యాధితో సగటు మరణాలు లక్ష జనాభాకు 256 మరణాలు కాగా, ఆదివాసులలో అవి మూడింతలు అంటే 750కి పైగా ఉన్నాయి. వీటితోపాటు, ఇటీవల దేశాభివృద్ధి పేరుతో ఆదివాసీ ప్రాంతాల్లో వెలుస్తున్న మైనింగ్, రోడ్లు, పరిశ్రమలు, ఇతర ఆదివాసీయేతర వ్యక్తులు నెలకొల్పుతున్న సంస్థల వల్ల లక్షలాది మంది నిరాశ్రయులవుతున్నారు. (క్లిక్‌: ఆదివాసీ రాష్ట్రపతి కావడానికి ఇన్నేళ్లా?)

ద్రౌపదీ ముర్మూను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టిన బీజేపీ, దాని నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఆదివాసీల ప్రగతి, సంక్షేమం పట్ల, వారికి గౌరవంగా జీవించే హక్కును గ్యారంటీ చేసే విషయంలో శ్రద్ధ వహివంచక పోతే ఇది మరొక విఫల ప్రయోగం కాకతప్పదు. (క్లిక్‌: సిన్హా ఇప్పుడు ముర్మును అని ఏమి లాభం?)


- మల్లెపల్లి లక్ష్మయ్య  
సామాజిక విశ్లేషకులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top