Cherabanda Raju: తరతరాలనూ రగిలించే కవి

Telugu Poet Cherabanda Raju 40th Death Anniversary - Sakshi

దేశంలో 1965 ప్రాంతానికి నిరక్షరాస్యత, నిరుద్యోగం, దారిద్య్రం, పరాధీనత, కుహనా రాజకీయాలు, మత కలహాలు, సాహిత్య వ్యాపారం, విశృంఖలమైన సెక్స్‌ రచనలు వంటివి బలం పుంజు కున్నాయి. ఈ నేపథ్యంలో ‘దిగంబర కవిత్వోద్యమం’ వచ్చింది. విదేశీ ప్రభావం లేదని ‘మేము మేముగానే’ వస్తున్నామని దిగంబర కవులు ప్రకటించుకున్నారు. కొత్త పేర్లతో కవితా రంగంలోకి అడుగుపెట్టారు. బద్దం భాస్కరరెడ్డి వారిలో ఒకరు. 

బహుశా ఈ పేరు చాలా మందికి తెలియదేమో... ‘చెరబండ రాజు’ అంటే టక్కున గుర్తుకు వస్తాడు. చెర బండరాజు ప్రకృతిలోనూ విప్లవ వాదాన్ని చూశాడు. ‘‘పుడమి తల్లి చల్లని గుండెను/పాయలు పాయలుగా చీల్చుకొని/ కాల్వలై ఎవరిదో, ఏ తరం కన్నీరో/గలగలా సుళ్ళు తిరిగి/ మెల్లగా పారుతుంది’ అంటాడు. ఆయన రాసిన ‘వందేమాతరం’ గీతం ఓ సంచలనం. అందులో దేశాన్ని ఉద్దేశించి ‘నోటికందని సస్య శ్యామల సీమవమ్మ’ అన్నాడు. ఆకలిమంటల ఆర్త నాదాల్ని ‘జీవుని వేదన’గా వర్ణించే చెరబండ రాజు సాహిత్యం వేరు, రాజకీయం వేరు అనే కవి కాదు. ఆయన కవిత్వం, గేయాలు వంటివి ఆయన సాధారణ కవి కాదనీ, ‘బొట్టు బొట్టు’గా తన నెత్తుటిని ఈ నేల తల్లి విముక్తి కోసం ‘విత్తనంగా చల్లిన’ వాడనీ చెబుతాయి. 

బద్దం భాస్కరరెడ్డి 1944 జనవరి మూడవ తేదీన అంకుషాపూర్‌లో జన్మించి, జూలై 2, 1982లో తుదిశ్వాస విడిచాడు. హైదరాబాద్‌లో ఉపాధ్యాయుడిగా పని చేశాడు. ఆలోచన, అక్షరం, ఆచరణల ఐక్యతారూపం ‘బద్దం’. కవితలు, కథలు, గేయాలు అన్ని ప్రక్రియల్లో తను నమ్మిన సిద్ధాంతాలను మాత్రమే ‘అక్షరాలు’గా అగ్ని కురిపించినవాడు చెరబండ రాజు. (క్లిక్‌: ఆయన పుట్టిన రోజూ, మరణించిన రోజూ ఒక్కటే)

– భమిడిపాటి గౌరీశంకర్, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా
(జూలై 2 చెరబండ రాజు 40వ వర్ధంతి)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top