breaking news
Digambara poetry
-
Cherabanda Raju: తరతరాలనూ రగిలించే కవి
దేశంలో 1965 ప్రాంతానికి నిరక్షరాస్యత, నిరుద్యోగం, దారిద్య్రం, పరాధీనత, కుహనా రాజకీయాలు, మత కలహాలు, సాహిత్య వ్యాపారం, విశృంఖలమైన సెక్స్ రచనలు వంటివి బలం పుంజు కున్నాయి. ఈ నేపథ్యంలో ‘దిగంబర కవిత్వోద్యమం’ వచ్చింది. విదేశీ ప్రభావం లేదని ‘మేము మేముగానే’ వస్తున్నామని దిగంబర కవులు ప్రకటించుకున్నారు. కొత్త పేర్లతో కవితా రంగంలోకి అడుగుపెట్టారు. బద్దం భాస్కరరెడ్డి వారిలో ఒకరు. బహుశా ఈ పేరు చాలా మందికి తెలియదేమో... ‘చెరబండ రాజు’ అంటే టక్కున గుర్తుకు వస్తాడు. చెర బండరాజు ప్రకృతిలోనూ విప్లవ వాదాన్ని చూశాడు. ‘‘పుడమి తల్లి చల్లని గుండెను/పాయలు పాయలుగా చీల్చుకొని/ కాల్వలై ఎవరిదో, ఏ తరం కన్నీరో/గలగలా సుళ్ళు తిరిగి/ మెల్లగా పారుతుంది’ అంటాడు. ఆయన రాసిన ‘వందేమాతరం’ గీతం ఓ సంచలనం. అందులో దేశాన్ని ఉద్దేశించి ‘నోటికందని సస్య శ్యామల సీమవమ్మ’ అన్నాడు. ఆకలిమంటల ఆర్త నాదాల్ని ‘జీవుని వేదన’గా వర్ణించే చెరబండ రాజు సాహిత్యం వేరు, రాజకీయం వేరు అనే కవి కాదు. ఆయన కవిత్వం, గేయాలు వంటివి ఆయన సాధారణ కవి కాదనీ, ‘బొట్టు బొట్టు’గా తన నెత్తుటిని ఈ నేల తల్లి విముక్తి కోసం ‘విత్తనంగా చల్లిన’ వాడనీ చెబుతాయి. బద్దం భాస్కరరెడ్డి 1944 జనవరి మూడవ తేదీన అంకుషాపూర్‌లో జన్మించి, జూలై 2, 1982లో తుదిశ్వాస విడిచాడు. హైదరాబాద్‌లో ఉపాధ్యాయుడిగా పని చేశాడు. ఆలోచన, అక్షరం, ఆచరణల ఐక్యతారూపం ‘బద్దం’. కవితలు, కథలు, గేయాలు అన్ని ప్రక్రియల్లో తను నమ్మిన సిద్ధాంతాలను మాత్రమే ‘అక్షరాలు’గా అగ్ని కురిపించినవాడు చెరబండ రాజు. (క్లిక్: ఆయన పుట్టిన రోజూ, మరణించిన రోజూ ఒక్కటే) – భమిడిపాటి గౌరీశంకర్, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా (జూలై 2 చెరబండ రాజు 40వ వర్ధంతి) -
కవిత్వం రాజకీయాల్లోకి ప్రవహించదు: మహాస్వప్న
దిగంబరులారా, అజ్ఞానం మీ కవచం, అహంకారం మీ ఆయుధం, ఆత్మవంచన, పరవంచన మీకు కొత్తగా మొలిగచిన కొమ్ములు. దౌర్జన్యం మీ పంథా. మీకు ఎదురు లేదు. దిగ్విజయం మీదే. ఎందుకంటే చరిత్ర నిండా కనిపించే విజేతలంతా మీలాంటి వాళ్లే. మీకు ఎక్కడా, ఎప్పుడూ సందేహాలు లేవు. సమస్యలు లేవు. మీకు ప్రశ్నలు లేవు. ఉన్నా వాటికి సమాధానాలక్కరలేదు. మీరు ప్రపంచ ఏకైక సత్యాన్ని దర్శించిన ద్రష్టలు. కేవలం జ్ఞాన స్వరూపులు. మీ జ్ఞానాధిక్యత పట్ల మీకున్న ప్రగాఢ విశ్వాసం ప్రశస్తం. నిజంగా మీరు గొప్పవారు. మీ ‘ప్రజలు’ గొప్పవారు. మీ జెండాలు గొప్పవి. మీ నినాదాలు గొప్పవి.మీ విశ్వాసాలు గొప్పవి. మీరు కనుక్కున్న సత్యం గొప్పది. మీరు తొడుక్కున్న పందొమ్మిదో శతాబ్దపు ఐరోపా కోటు (చిరిగి, మాసి, అంతులేని గబ్బు కొడుతున్నా సరే) గొప్పది. ఎదుటి వాడిని చిత్తు చేయడం కోసం వేసిన ఎత్తుగడలు గొప్పవి. పన్నిన వ్యూహాలు గొప్పవి. అందుకే మీరు నిజంగా గొప్ప వారు. నేను జీవితంలోకీ, సాహిత్యంలోకీ దిగంబరంగానే వచ్చాను. ఆయుధాలు సిద్ధం చేసుకోలేదు. యుద్ధానికి రాలేదు కాబట్టి. నేను చిన్నవాణ్ణి, కొద్దివాణ్ణి. నాకు అన్నీ సమస్యలే. అన్నీ సందేహాలే. నాకెదురుగా అన్నీ చౌరస్తాలే. అన్నీ క్రాస్ రోడ్లే. ముఖ్యంగా ఈ దేశంలో ఎవరు ఎవరో తెలుసుకోవడం కష్టం. ఎవరు ఏ పనిచెయ్యాలో ఆ పని చేయరు. ఎవరు ఏ పని చెయ్య కూడదో ఆ పని చేస్తారు. ఇక్కడ కుక్కలు ఓండ్రపెడతాయి. గాడిదలు మొరుగుతాయి. గొర్రెలు గర్జిస్తాయి. సింహాలు ఇకిలిస్తాయి. అందుకే ఒక క్యాపిటలిస్టు మార్క్సిజాన్ని గురించి మహోపన్యాసం ఇచ్చినా, ఒక నపుంసకుడు బండ్ల కొద్దీ సెక్స్ సాహిత్యాన్ని సృష్టించినా, ఒక పరమ దుర్మార్గుడు పరమ శివుడి ఫోజు పెట్టినా ఆశ్చర్యపడనక్కరలేదు. ‘వర్గపోరాటం–వర్గ సంఘర్షణ’ అంటున్న మీరూ, మీ ప్రజలూ ఏ వర్గానికి చెందుతారో మీకు తెలీదు. మావో మ్యాజిక్కుకి వొళ్లు మరిచి కదం తొక్కతూ కదనకుతూహలంతో సాయుధ విప్లవం పదం పాడుతున్న మీకు, అర్జెం టుగా శత్రువులు కావలసిన మాట నిజమే. ఉన్న పిడికెడు మంది శత్రువులు మీ పిడికెళ్ల కెట్లాగూ అందరు. ఈ చీకటి తిర్నాళ్ల సంతలో మిగతా నిజమైన శత్రువుల అడ్రసేదో మీకు అంతుపట్టదు. అజ్ఞానంతో, ఆవేశంతో ‘సాయుధ విప్లవం జిందాబాద్’ అని మీరంటే లక్ష దోపిడీ కంఠాలు మీ వెనుక నుంచి ‘జిందా బాద్’ అని ప్రతిధ్వనిస్తున్నాయి. ‘నక్సలైట్ తత్వం వర్థిల్లాలి’అని మీరంటే ‘వర్థిల్లాలి’ అని లక్ష దోపిడీ హస్తాలు పైకి లేస్తున్నాయి. మీ అజ్ఞానాన్ని మీ ప్రజలూ, మీ ప్రజల అజ్ఞానాన్ని మీరూ దోపిడీ చేసుకుంటున్నారు. నిజం తెలుసుకోవాలనుకుంటే నిశ్శబ్దంగా సమాజ జీవనాడుల్లోకి ప్రవహించండి. కవిత్వం కావాలనుకుంటే సిద్ధాంతాల్ని, సూత్రాల్ని తెగదెంచి, ముందు మిమ్మల్ని మీరు బంధ విముక్తుల్ని చేసుకోండి. కవిగా నేనెప్పుడూ సర్వస్వతంత్రుడినే. వ్యక్తి స్వేచ్ఛను అంటే భావస్వాతంత్య్రాన్ని అరికట్టే ఏ వ్యవస్థనయినా, ఏ ఉద్యమాన్నయినా ద్వేషిస్తాను, దూషిస్తాను. శాసించే ప్రతి దౌర్జన్య హస్తాన్నీ నిలబెట్టి నరుకుతాను. ‘కట్టుబడు’ అంటే తంతాను. ఆత్మహననం కానంతవరకే సమష్టి బాధ్యతకు విలువ. మార్క్సిజం మీ సొంతమైనట్లు వాదిస్తున్న మీ అజ్ఞానానికి, ఇతర ఇజాలనూ, ఇతర కవులనూ సహృదయతతో, సానుభూతితో చూడలేని మీ బుద్ధి జాఢ్యజనితోన్మాదానికీ విచారిస్తున్నాను. మీరు నటిస్తున్న మాట యథార్థం. మీ సిన్సియారిటీని నేను శంకిస్తున్నాను. నక్సల్బరిలో ఏనాడో మొదలైన రైతు పోరాటం ఆంధ్రప్రదేశ్‌కు వ్యాపించి శ్రీకాకుళంలో మంటలు మిన్ను ముట్టాకనే మీరు కళ్లు విప్పారు. ఉన్నట్టుండి అవసరవాదాన్నీ, నక్సలైట్ విధానాన్ని అమాంతం కావిలించుకుంటున్నారు. దోపిడీ వ్యవస్థకి కారణమైన ఏ అవినీతి ప్రభుత్వాన్ని మీరు దుయ్యబడుతున్నారో, అదే అవినీతి ప్రభుత్వానికీ, దాని ఆశ్రిత సంస్థలకీ కడుగుతూ నగరాల్లో విలాస జీవితాలు గడుపుతున్న మీకు, ఎండల్లో, వానల్లో, కొండల్లో, అడవుల్లో తుపాకీ గుండ్లకు రొమ్ములొడ్డి తాము నమ్మిన దాని కోసం ఆవేశంతో పోరాడుతున్న నక్సలైట్లను సమర్థించే అధికారమూ అర్హతా లేవు. కృత్రిమమైన మోరల్ సపోర్ట్ ఎవరికీ అక్కరలేదు. మీ వందిమాగధ స్తోత్రాలూ, కైవారాలూ ఎవరికీ అక్కరలేదు. విప్లవాగ్ని జ్వాలలకు మీరేం కిరసనాయిల డబ్బాలు సరఫరా చెయ్యనక్కర్లేదు. దమ్ముంటే, నిజాయతీ ఉంటే దేశీయ సమస్యలకు నక్సలైట్ విధానం పరిష్కార మార్గమనే గట్టి నమ్మకం మీకుంటే పెళ్లాం బిడ్డల్ని వొదిలి ఉద్యోగాల్నీ విలాస జీవితాల్నీ వొదిలి కార్యరంగం మీదికి వెళ్లండి. వీరోచితంగా పోరాడండి. ఎండిన తాటాకులకు మంట పెట్టడం, అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడటం, దూరంగా నిలబడి బావిలో నాలుగు రాళ్లు రువ్వి జలావర్తాలు సృష్టించడం, సమయం వస్తే తెరచాటుకు తప్పుకుని ప్రజలతో దోబూచులాడటం కాదు దిగంబర కవులు చేయవలసింది. సాయుధ పోరాటాన్ని నేను వొప్పుకున్న మాట నిజమే. సాయుధ పోరాటమంటే నక్సలైట్ విధానమని కాదు నా అర్థం. దేశ వ్యాప్తంగా ప్రజా సానుభూతితో రావలసిన ధర్మబద్ధమైన ప్రజా పోరాటం. నాలుగైదు కెరటాలు ఉవ్వెత్తున ఎగిరి పడ్డంత మాత్రాన సముద్రంలో తుపాను రాదు. రాజకీయాలకు, మతతత్వాలకు, సంకుచితత్వాలకు అతీతంగా గిరుల్ని గీతల్ని, అవధుల్ని దాటి సర్నోన్నత స్థాయిలో స్వచ్ఛందంగా పలకవలసిన కవిత, సంకుచిత వలయాల్లోకి, రాజకీయాల బురద గుంటల్లోకి ఎందుకు ప్రవేశించవలసి వచ్చింది? సముద్రాన్ని నదిలోకి మళ్లించాలనుకుం టున్న మీరు సముద్రాన్ని ఎప్పుడూ చూసిన పాపాన పోలేదు. రాజకీయాలు కవిత్వంలోకి ప్రవహిస్తాయి. కానీ కవిత్వం రాజకీయాల్లోకి ప్రవహించదు. దిగంబర కవితోద్యమ ప్రారంభ దశలో మీలో ఒక్కడైనా మార్క్స్, మావోల పేరెత్తలేదే. వారిని చదివాక ఇప్పుడే జ్ఞానోదయమైందా? మార్క్సిజం పుట్టిన ఒక శతాబ్దం తరువాత, ఆ సిద్ధాంతాల్ని అత్యధునాతనమైనవిగా ప్రచారం చేయడానికి కవులుగా మీకు సిగ్గెందుకు లేకుండా పోయింది? పోనీ మార్క్సిజాన్ని దృఢంగా విశ్వసించినప్పుడు, ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడమే మీ ధ్యేయమైనప్పుడు, స్పష్టంగా ‘మేము మార్క్సిస్టు కవులమనో, మావోయిస్టు కవులమనో, సోషలిస్టు కవులమనో’ చెప్పుకోవడానికి సంకోచమెందుకు? దిగంబర కవులు అనే ముసుగెందుకు? శుద్ధ నాస్తికవాదులం అంటూనే పెళ్లాం సాకుతో తిరు పతి తీర్థయాత్రలు సేవించడం, శాస్త్ర సమ్మతంగా పెళ్లాడటం, ఆధునిక వివాహాలకు అత్యాధునిక పౌరోహిత్యాలు నెరపడం, పెళ్లిళ్లకు దిక్ పఠనాలు చెయ్యడం, రాజకీయోపన్యాసాలకు తయారు కావడం–ఇవన్నీ దిగంబర కవితా లక్షణాలని నేను ముందనుకోలేదు. నా దృష్టిలో దిగంబర కవిత్వ నిర్వచనమేదో కొత్తగా ఇవాళ చెప్పవలసిందేమీ లేదు. ఏ ఇజానికో తాకట్టు పడివుంటే నేను దిగంబర కవిని కానక్కర్లేదు. ఏ చెప్పులూ నా కాళ్లకి పట్టలేదు. ఏ దుస్తులూ నా ఒంటికి అతక లేదు. ఏ ఫ్రేములోనూ నా ఫొటో ఇమడలేదు. అందుకే నేను దిగంబర కవినయ్యాను. ఒక ఇజానికీ, ఒక విశ్వాసానికీ కట్టుబడిపోయి, దిగంబర కవులుగా మిమ్మల్ని మీరు నరుక్కున్నారు. మీరు నమ్మినదాన్నే ప్రపంచమంతా విశ్వసించాలని దౌర్జన్యంగా శాసిస్తూ మీ అల్పబుద్ధిని బయట పెట్టుకున్నారు. కట్టుబడిపోయిన మీకూ, దేనికీ కట్టుబడని నాకూ సంధి కుదరదు. పరిణామాల్ని ఊహించి మొహం చాటు చేసుకోవల్సిన గతి మీకు పడుతుంది. నాకు కాదు. తాటాకు చప్పుళ్లతో, కాగితప్పులి గర్జనలతో భయపెట్టలేరు. (1970లో దిగంబర కవులు ఇచ్చిన చార్జిషీట్‌కు మహాస్వప్న ఇచ్చిన సమాధానం సంక్షిప్త రూపం. మంగళవారం కన్నుమూసిన మహాస్వప్న స్మరణలో.) -
28న తెలుగు కవిత్వ సమాలోచన
తెనాలి: పట్టణ సామాజిక, సాహిత్య సంస్థ ప్రజ్వలిత ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన ‘తెలుగు కవిత్వ సమాలోచన’ రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నారు. సదస్సు బ్రోచర్‌ను శనివారం గౌతమ్గ్రాండ్లో ఆవిష్కరించారు. సదస్సు విశేషాలను సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగళ్ల వేంకట దుర్గాప్రసాద్ వివరించారు. గౌతమ్ గ్రాండ్ కాన్ఫరెన్సు హాలులో ఉదయం 9 గంటల్నుంచి ఆరంభమయే తెలుగు కవిత్వ సమాలోచనలో వివిధ కవితా రీతులపై ఆయా రంగాల ప్రముఖులు ప్రసంగిస్తారు. దిగంబర కవిత్వానికి 50 ఏళ్లయిన సందర్భంగా మూడు సంపుటాల సంయుక్త సంచిక, ధిక్కారవాదం– దిగంబర కవిత్వం పుస్తకాలను ఆవిష్కరిస్తారు. దిగంబర కవులు నగ్నముని, మహాస్వప్న, నిఖిలేశ్వర్, భైరవయ్యను సత్కరిస్తారు. సాయంత్రం జరిగే సభలో గుంటూరు సాంస్కృతిక సంస్థకు చెందిన ఎస్.బాలచందర్‌ను ప్రజ్వలిత 2015– సాంస్కృతిక సేవామూర్తి పురస్కారంతో సత్కరిస్తారు. రాష్ట్ర ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, రాష్ట్ర భాష, సాంస్కృతికశాఖ డైరెక్టర్ డి.విజయభాస్కర్‌తో సాహితీ ప్రముఖులు పాల్గొంటారు. అనంతరం ప్రముఖ కవి సీతారాం కాలేజి విద్యార్థులతో కవితావరణం నిర్వహిస్తారు. సంస్థ కార్యదర్శి వై.వేణుగోపాలరెడ్డి, విధాన నిర్ణాయక మండలి సభ్యులు కుక్కుమళ్ల ఆదెయ్య, కనపర్తి బాబూరావు, గోగినేని కేశవరావు, దేవిశెట్టి కృష్ణారావు, చందు భాస్కరరావు, సహాయ కార్యదర్శి పందిటి సుబ్బారావు, తెనాలి అబ్రహాం లింకన్, సమన్వయకర్త తెనాలి వినయ్‌కుమార్ పాల్గొన్నారు.