రాయని డైరీ: శశి థరూర్‌ (కాంగ్రెస్‌ ఎంపీ)

Shashi Tharoor Rayani Dairy Guest Column By Madhav Singaraju - Sakshi

రాత్రి కలలోకి మన్మోహన్‌ సింగ్, చిదంబరం, అరుణ్‌ శౌరి వచ్చారు! ముగ్గురూ కలిసే కలలోకి వచ్చారా, కలలోకి వచ్చాకే ముగ్గురూ కలిశారా గుర్తుకు రావడం లేదు. 
‘‘డెంగీ నుంచి ఎప్పుడు కోలుకున్నారు మన్మోహన్‌ జీ’’ అని అడిగినట్లున్నాను. అందుకు ఆయన.. ‘‘ఢిల్లీ నుంచి ఎప్పుడొచ్చారు మన్మోహన్‌జీ అని అడిగినట్లుగా అడుగుతున్నావేంటి థరూర్‌..’’ అని మృదువుగా నవ్వుతూ అన్నారు!

ఎనభై తొమ్మిదేళ్ల వయసులోని ఒక మాజీ ప్రధానిని ఎంపిక చేసుకుని మరీ ఆ డెంగీ దోమ కుట్టడం వెనుక ఉండగల సంభావ్యతల గురించి కలలోనే నేను ఆలోచిస్తూ ఉన్నాను.
‘‘ఏమిటి ఆలోచిస్తున్నావు థరూర్‌?’’ అని అడిగారు మన్మోహన్‌!
ఆ అడగడం కూడా ఆయన నా కలలోకి వచ్చి అడిగినట్లుగా కాకుండా, నేను ఆయన కలలోకి వెళితే అడిగినట్లుగా అడిగారు. 
‘‘ఏం లేదు మన్మోహన్‌ జీ. కబురు పంపితే నేనే ఢిల్లీ వచ్చేవాడిని కదా.. మీరు తిరువనంతపురం వరకు రావడం ఎందుకు అని ఆలోచిస్తున్నాను’’ అని చెప్పాను. 
‘‘నువ్వు అంత టైమ్‌ ఇస్తే కదా థరూర్‌’’ అన్నారు మన్మోహన్‌ భారంగా.
‘‘ఎంత టైమ్‌ మన్మోహన్‌ జీ’’ అన్నాను
‘‘కబురు పంపేంత టైమ్‌’’ అన్నారు మన్మోహన్‌.
‘‘అవునవును. కబురు పంపే టైమ్‌ కూడా ఇవ్వలేదు మీరు..’’ అని చిదంబరం గొంతు కలిపారు. అరుణ్‌ శౌరి కలపలేదు. గొంతూ కలపలేదు, మాటా కలపలేదు.
మన్మోహన్‌ కాంగ్రెస్‌. చిదంబరం కాంగ్రెస్, నేను కాంగ్రెస్‌. అరుణ్‌ శౌరి ఒక్కరే బీజేపీ. 

‘‘ఇప్పుడు నువ్వే పార్టీలో ఉన్నావని అనుకుంటున్నావు థరూర్‌?’’ అని అడిగారు మన్మోహన్‌!! 
‘‘ఇప్పుడు మీరే పార్టీలో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు థరూర్‌’’ అని చిదంబరం అడిగారు!!
‘‘ఇప్పుడు మీరే పార్టీలో ఉన్నారో గుర్తు చేసే టైమ్‌ని కూడా మీరు మాకు ఇవ్వలేదు థరూర్‌’ అని అరుణ్‌ శౌరి అన్నారు!! 
‘‘ఆ ట్వీట్‌ ఏంటి థరూర్‌! కాంగ్రెస్‌ పార్టీనే వంద కోట్ల వ్యాక్సిన్‌లు వేయించినంత గొప్పగా ట్వీట్‌ చేశావు! ‘ఇది భారతీయులకు గర్వకారణం’ అంటావు! ‘క్రెడిట్‌ అంతా గవర్నమెంటుదే’ అంటావు. దేశంలో కాంగ్రెస్‌ గవర్నమెంట్‌ ఉందనుకుంటున్నావా ఏంటి?’’ అన్నారు మన్మోహన్‌.

‘‘అందుకే థరూర్‌.. మీరెంత అందంగా ఉన్నా, మీకెంత ఇంగ్లిష్‌ వచ్చినా, మీరెన్ని పుస్తకాలు రాసినా, ఆఖరికి న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి అండర్‌ సెక్రెటరీ జనరల్‌గా పని చేసి వచ్చినా.. కాంగ్రెస్‌ పార్టీలో సహాయ మంత్రిగా తప్ప మీరు ఏ టెర్మ్‌లోనూ పూర్తి స్థాయి మంత్రిగా లేరు’’ అన్నారు అరుణ్‌ శౌరీ!! 
‘‘మళ్లీ ఎప్పుడైనా మోదీని అభినందిస్తూ ట్వీట్‌ ఇచ్చే ముందు మాక్కొద్దిగా టైమ్‌ ఇవ్వు థరూర్‌. మోదీని విమర్శిస్తూ నువ్వొక పుస్తకం రాసిన సంగతిని నీకు గుర్తు చేస్తాం..’’ అన్నారు మన్మోహన్‌. 
‘‘అవును గుర్తు చేస్తాం..’’ అన్నట్లు చూశారు చిదంబరం, అరుణ్‌శౌరి.
కల ఎగిరిపోయింది.

మోదీని అభినందించడం ఏంటని అడిగేందుకు.. వస్తే రాహుల్‌ రావాలి. లేదంటే సోనియాజీ రావాలి. వాళ్లు రాకుండా వీళ్లు కలలోకి రావడం ఏంటి? అసలు ఈ ముగ్గురి కాంబినేషన్‌ కలకు అర్థం ఏమై ఉంటుంది?
‘కలలు–అర్థాలు’ పుస్తకం కోసం షెల్ఫ్‌ వెతుకుతున్నాను. వరుసల్లోంచి ‘ది ప్యారడాక్సికల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ చేతిలోకి వాలింది. మోదీని విమర్శిస్తూ నేను రాసిన పుస్తకం అదే. 
కలకు అర్థం, కాంబినేషన్‌కు లింకూ రెండూ దొరికాయి!   
మూడేళ్ల క్రితం.. వేదికపై ఆ పుస్తకాన్ని ఆవిష్కరించింది మన్మోహన్, చిదంబరం, అరుణ్‌ శౌరీలే!

-మాధవ్‌ శింగరాజు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top