విరాట్‌ కోహ్లీ (స్టార్‌ క్రికెటర్‌) రాయని డైరీ | Sakshi Guest Column On Virat Kohli Rayani Diary | Sakshi
Sakshi News home page

విరాట్‌ కోహ్లీ (స్టార్‌ క్రికెటర్‌) రాయని డైరీ

Published Sun, May 11 2025 1:48 AM | Last Updated on Sun, May 11 2025 1:48 AM

Sakshi Guest Column On Virat Kohli Rayani Diary

మాధవ్‌ శింగరాజు

ఆట ఎన్ని పొరపాట్లనైనా క్షమించేస్తుంది. మళ్లీ మళ్లీ ఆడేందుకు అవకాశం ఇస్తూ ఉంటుంది. కానీ పెళ్లయిన వాడి జీవితంలో ఒక్క పొరపాటుకైనా క్షమాపణ ఉండదు. పోన్లే పాపం, ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం అని జీవితం అనుకోదు. జీవితం దయ తలచినా, జీవిత భాగస్వామి క్షమాభిక్ష పెట్టదు!
ఎవరో తెలియనైనా తెలియని ఒక అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో పొరపాటున లైక్‌ కొట్టినందుకు అనుష్క నా వైపు చూడటమే మానేసింది! తెలియని అమ్మాయికి, తెలియకుండా లైక్‌ కొట్టడంలో ఉండేది పొరపాటే కానీ మరొకటి మరొకటి ఎందుకవుతుంది?! 

నా నెత్తి మీద ఏ దేవతో ఆ క్షణంలో కూర్చొని ఉండాలి. ఊరికే ఫోన్‌ చూస్తూ ఉన్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ అమ్మాయి కనిపించింది. ప్రింటెడ్‌ ర్యాప్‌ స్కర్ట్, గ్రీన్‌ టాప్‌. నా అంతట నేనే ఆ అమ్మాయి ఫొటోకి లైక్‌ కొట్టానా, లేక లైక్‌ తనంతటదే వెళ్లి ఆ అమ్మాయి ఫొటో కింద పడిందా తెలియటం లేదు. అసలు ఆ అమ్మాయే గుర్తు లేదు.

అమ్మాయి వేసుకున్న ర్యాప్‌ స్కర్ట్, గ్రీన్‌ టాప్‌ గుర్తుండీ, అమ్మాయి గుర్తు లేక పోవటం అనేది ఉంటుందా? ఉండొచ్చేమో! నా నెత్తి మీద దేవతకు ఎంత మహిమ ఉందంటే... సరిగ్గా అనుష్క పుట్టిన రోజుకు మర్నాడే ఇలా జరిగింది. తనదొక రేర్‌ ఫోటోను వెతికి తీసి, ‘యూ ఆర్‌ మై లవ్‌’ అని కవిత్వం రాసి, తనకు బర్త్‌ డే విషెస్‌ చెప్పిన కొద్ది గంటలకే... ఆ ఎవరో తెలియని అమ్మాయికి నేను లైక్‌ కొట్టిన స్క్రీన్‌ షాట్‌లను క్రికెట్‌ అభిమానులు గొప్పగా సెలబ్రేట్‌ చేశారు.

ఆ సెలబ్రేషన్‌ అనుష్క వరకు వచ్చింది. ‘‘ప్రేమించుకుని కదా పెళ్లి చేసుకున్నాం... ఈ తిక్క వేషాలేంటి?’’ అని అనుష్క నన్ను డైరెక్ట్‌గా అడిగినా బాగుండేది. తన ముందు ఆరార్లు ముప్పై ఆరు గుంజీళ్లు తీసేవాడిని.

పాపభూయిష్ఠమైన నా పొరపాటుకు నివృత్తి, నిష్కృతి రెండూ లభించేవి. తనకు సిక్సర్లంటే ఇష్టం. అందుకే అన్ని గుంజీళ్లు.
సిక్సర్లంటే తనకు ఇష్టమే కానీ, నేనంటే ఉండేంత ఇష్టమేమీ కాదు. మిడ్‌ ఓవర్స్‌లో స్పిన్‌ బాల్స్‌ని ఫేస్‌ చెయ్యలేక ఔట్‌ అయి బయటికి వచ్చిన ప్రతిసారీ... ‘‘నాకోసం అదే పనిగా సిక్సర్‌లు కొట్టేయనవసరం లేదు’’ అని నవ్వేసేది. ఇప్పుడు తనే నా మీద బౌన్సర్లు వేస్తోంది... తన మౌనంతో!

అనుష్క మాట్లాడటం లేదు. వామిక నిద్రపోతోంది. అకాయ్‌కి మాటలు రావటానికి ఇంకా టైమ్‌ పడుతుంది. అకాయ్‌ ఒక్కడే ఇంట్లో ఇప్పుడు నా మేల్‌ ఫ్రెండ్‌. వాడు నా చెయ్యి పట్టుకుని నడవటానికి, బ్యాట్‌ పట్టుకుని నాతో ఆడటానికి, బైక్‌ మీద కాలేజీకి వెళ్లి రావటానికి, మళ్లీ ఎప్పుడైనా అనుష్క నాతో మాట్లాడటం మానేసినప్పుడు.. ‘‘ఏంటి డాడీ అలా ఉన్నారు?’’ అని నన్ను అడగటానికి వాడికి టైమ్‌ పడుతుంది.

రెస్టారెంట్‌ నుంచి రాగానే అనుష్క నేరుగా పిల్లల గదిలోకి వెళ్లిపోయింది. రెస్టారెంట్‌ ముందు కార్లోంచి దిగుతున్నప్పుడు ఎప్పటిలా తనకు చెయ్యందించినా, తను నా చెయ్యందుకోలేదు. కనీసం నాకోసం ఆగనైనా ఆగకుండా నన్ను దాటుకుని, నడుచుకుంటూ రెస్టారెంట్‌ లోపలికి వెళ్లిపోయింది.
ఒక్క లైక్‌ జీవితాన్ని ఎంత ఛిద్రం చేసింది!

బాల్కనీలోకి వెళ్లి నిలుచున్నాను. సిటీ అంతా వెలిగిపోతోంది. నాలో మాత్రం చీకటి. ఎందుకు నేనలా చేశాను?!
ఆకాశంలో చుక్కలు మిణుకు మిణుకుమంటున్నాయి. ఒక చుక్క అమితాబ్‌ బచ్చన్‌. ఒక చుక్క బిల్‌ క్లింటన్‌. ఒక చుక్క బరాక్‌ ఒబామా. ఒక చుక్క బిల్‌ గేట్స్‌.

ఆ చుక్కల్లో నేనూ ఒక చుక్కనయ్యానా? అనుష్కకు తీవ్రమైన ఆవేదన మిగిల్చినందుకు!  
రాత్రి రెండు దాటేసినట్లుంది. మెల్లిగా అడుగులు వేసుకుంటూ పిల్లల గదిలోకి వెళ్లాను. వామిక నిద్రపోతోంది. అకాయ్‌ నిద్ర పోతున్నాడు. అనుష్క నిద్ర పోతున్నట్లుగా ఉంది. తను పడుకుని ఉన్న వైపు వెళ్లి, తన తల పక్కనే నేల పైన మోకాలి మీద కూర్చున్నాను. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement