శిలాజ ఇంధనాలకు రాయితీలు తగ్గితేనే...

Sakshi Guest Column On Fossil Fuels Must Subsidies

విశ్లేషణ

శిలాజ ఇంధనాల వినియోగం నానాటికీ పెరుగుతున్నందు వల్ల  కాలుష్యం మరింత పెరుగుతోంది. అందుకే ప్రపంచ దేశాలు ఆ ఇంధనాలపై ఇస్తున్న సబ్సిడీలను తగ్గించాలని వివిధ అంతర్జాతీయ సంస్థలూ, సదస్సులూ దశాబ్దాలుగా పిలుపునిచ్చాయి. ఉదాహరణకు కాప్‌– 21 సదస్సులో 40 కంటే ఎక్కువ దేశాలు శిలాజ ఇంధన సబ్సిడీలను తొలగించడానికి ఒక ఉమ్మడి ప్రకటన చేశాయి.

అయినా కూడా పారిశ్రామిక దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు శిలాజ ఇంధనాల ఉత్పత్తి, వినియో గానికి బడ్జెట్‌ బదిలీలు, పన్ను మినహాయింపులు, ఆర్థిక హామీలు అందజేస్తూనే ఉన్నాయి. ఈ సబ్సిడీల వలన వాతావరణానికి ప్రాథమికంగా హాని చేస్తున్న శిలాజ ఇంధనాల ఉపయోగం పెరుగుతూనే ఉన్నది. అభివృద్ధి చెందిన దేశాల నుంచి తగిన చర్యలు లేకపోవడంతో వర్ధమాన దేశాలు కూడా ముందడుగు వేయడానికి సిద్ధంగా లేవు.

2023లో భారతదేశంలో మొత్తం ఇంధన సబ్సిడీలు  రూ. 3.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ‘ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌’ చేసిన కొత్త పరిశోధన ప్రకారం ఇవి గత తొమ్మిదేళ్లలో గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దేశంలో ఇంధన వనరుల డిమాండ్‌ పెరగడంతో పాటు, 2022లో ప్రపంచ ఇంధన సంక్షోభం నేపథ్యంలో, ప్రభుత్వం 2023లో అన్ని రకాల ఇంధన వనరుల లభ్యతను విస్తరిస్తూ హైబ్రిడ్‌ విధా నాన్ని అవలంభించింది.

పెరుగుతున్న ఇంధన వినియోగం, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తరువాత అంతర్జాతీయ ఇంధన ధరల సంక్షోభం ప్రభావం, అనేక దేశాలు అనుకున్న లక్ష్యాలకు వ్యతిరేకంగా శిలాజ ఇంధనాలకు మద్దతును గణనీయంగా పెంచాయి. భారతదేశం కూడా ఈ దిశ గానే అనేక చర్యలు అమలులోకి తెచ్చింది. 2022– 2023లో గరిష్ఠ స్థాయికి చేరుకున్న శిలాజ ఇంధన ధరల ప్రభావం నుంచి పేద, మధ్య తరగతి కుటుంబాలను ఆదుకోవడానికి భారత ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్‌ రిటైల్‌ ధరలను పరిమితం చేసింది. పన్నులను తగ్గించింది.

వ్యాపారులు, వినియోగ దారులకు ప్రత్యక్ష నగదు బదిలీలు చేసింది. ఆయా చర్యల ఫలితంగా చమురు, గ్యాస్‌ సబ్సిడీలు 2022తో పోలిస్తే 2023లో 63 శాతం పెరిగాయి. అయితే, 2023లో మొత్తం ఇంధన సబ్సిడీలలో బొగ్గు, చమురు, గ్యాస్‌ సబ్సిడీలు దాదాపు 40 శాతం కాగా, కాలుష్య రహిత ఇంధన వనరుల (క్లీన్‌ ఎనర్జీ)కు సబ్సిడీలు 10 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. మిగిలిన సబ్సిడీలలో ఎక్కువ భాగం విద్యుత్‌ వినియోగానికీ, ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినవీ ఉన్నాయి. ఇదే కాలంలో బొగ్గు సబ్సిడీలు కూడా 17 శాతం పెరిగాయి. మొత్తంగా  క్లీన్‌ ఎనర్జీ సబ్సిడీల కంటే శిలాజ ఇంధన సబ్సిడీలు ఐదు రెట్లు ఎక్కువ.

కేంద్ర ప్రభుత్వం 2023లో ప్రభుత్వ ఆధీనంలోని చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు ప్రత్యక్ష బడ్జెట్‌ బదిలీల ద్వారా చమురు, గ్యాస్‌ రంగానికి గణనీయమైన మద్దతును అందించింది. ఈ కాలంలో, మొత్తం చమురు – గ్యాస్‌ సబ్సిడీలు కనీసం రూ.70,692 కోట్లకు పెరి గాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వ సబ్సిడీల కారణంగా వరి, గోధుమలు, మక్కలు, చెరుకు వంటి ఆహార సంబంధిత ఉత్పత్తుల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేయ డానికి చాలా మంది మొగ్గుచూపుతున్నారు. ఒకవైపు ఆహార భద్రత సాధించటానికీ, ఆకలి తగ్గించడానికీ వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం... ఇంకొక వైపు సబ్సిడీలు ఇచ్చి అదే ఆహార పంటలను ఇతరత్రా ఉపయోగాలకు మళ్ళిస్తోంది. ఇందువల్ల కలిగే దీర్ఘకాలిక దుష్ప్రభావం ఊహించలేని విధంగా ఉండవచ్చు.

2020 ఆర్థిక సంవత్సరంలో, కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి మొత్తం ఇంధన ఆదాయం రూ. 6,99,565 కోట్లుగా అంచనా. ఇది మొత్తం ప్రభుత్వ ఆదాయంలో దాదాపు 17 శాతం.

ఇంధన వనరుల నుంచి వచ్చే ఆదా యంలో ఎక్కువ భాగం (83శాతం) చమురు, గ్యాస్‌ నుండి వస్తోంది. పునరుత్పాదక ఇంధనం నుంచి 1 శాతం కంటే తక్కువే వస్తోంది. ఈ ఆదాయం కూడా ఎక్కువగా కేవలం రెండు పన్నుల నుండి వస్తోంది: కేంద్ర ఇంధన ఎక్సైజ్, రాష్ట్ర స్థాయి వ్యాట్‌. శిలాజ ఇంధన శక్తి వనరుల వల్ల ఆదాయం 2030 నాటికి అదనంగా రూ. 30 వేల కోట్ల నుంచి రూ. 3,40,000 కోట్లకు పెరగవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఈ ఆదాయం కోల్పోవటానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. క్రమంగా ఈ ఆదాయం మీద ఆధార పడటం తగ్గించడానికి కూడా సుముఖంగా లేవు.

అయితే శిలాజ ఇంధనాల వల్ల ఆదాయం మాత్రమే కాదు భారం కూడా ఉంటుంది. ఇంధనాల ధరలో ప్రతిబింబించని ఖర్చుల భారం చాల ఎక్కువ. ఒక అంచనా ప్రకారం ఈ భారం ప్రభుత్వ ఆదాయానికి ఐదు రెట్లు ఎక్కువ. ఈ భారం రకరకాలుగా ఉంటుంది. ప్రధానంగా నీరు, గాలి, ఇతర ప్రకృతి వనరుల కాలుష్యం వల్ల కలిగే  మరణాలు, అనారోగ్య సమస్యలు, వాటిని అధిగమించడానికి కల్పించవలసిన మౌలిక సదుపాయాల రూపంలో ఈ భారాన్ని చూడవచ్చు. 

అందుకే కాలుష్య రహిత ఇంధన  (క్లీన్‌ ఎనర్జీ) ఉత్పత్తులు పెంచడానికి చర్యలు తీసుకోవాలని అనేక అంతర్జాతీయ సంస్థలు అంటున్నాయి. ప్రపంచ వాతా వరణ సదస్సులలో కాలుష్య రహిత ఇంధనాల వైపు ఉత్పత్తి, వినియోగ రంగాలు మారాలని ఎప్పటి నుంచో ఒత్తిడి ఉంది. ‘గ్లాస్గో  కాప్‌ 26’ సదస్సులో బొగ్గు ఆధా రిత విద్యుత్, ఇతర ఇంధన ఉపయోగాలను క్రమంగా తగ్గించాలని పెట్టిన ముసాయిదా తీర్మానాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకించింది. కేవలం బొగ్గు కాకుండా అన్ని రకాల శిలాజ ఇంధనాల ఉపయోగం క్రమంగా తగ్గించాలని వాదించింది. దుబాయి కాప్‌ 28 సదస్సులో ఈ దిశగా అన్ని రకాల శిలాజ ఇంధనాలను దశల వారీగా తగ్గించాలనే తీర్మానం దాదాపు ఖరారు అయినా సర్వామోదం పొందలేదు.

పెరుగుతున్న కర్బన కాలుష్యం కారణంగా భూమి ఉష్ణోగ్రతలు పెరిగి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తు న్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదకర శిలాజ ఇంధ నాలపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా వాటికి రాయితీలు తగ్గించాలి. అది సాధ్యం కావాలంటే సమూల ఆర్థిక పరివర్తనం అవసరం. ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. క్లీన్‌ ఎనర్జీ అందుబాటులోకి వస్తే ఆర్థిక వృద్ధి సుస్థిరం అవుతుంది. శిలాజ ఇంధన దిగుమతుల మీద ఆధారపడిన ఆర్థిక అభివృద్ధి సుస్థిరం ఎప్పటికీ కాలేదు.

ప్రకృతిని కలుషితం చేస్తూ అభివృద్ధి దిశగా పయనించడం దుర్భరంగా ఉంటుంది. అందుకే కర్బన కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా అవసరమైన వాతా వరణ లక్ష్యాలను చేరుకోవడం కోసం ఒక ఆచరణాత్మక దృష్టి అవసరం. ప్రభుత్వం శిలాజ ఇంధన పన్ను ఆదా యంలో కొంత భాగాన్ని కొత్త కాలుష్య రహిత శక్తి వనరుల వైపు మళ్ళించాలి. సుస్థిర అభివృద్ధికీ, సమాన ఫలాలు అందరికీ అందించే ఆర్థిక వ్యవస్థకూ ఇంధనాల కూర్పు చాల కీలకం.

డా‘‘ దొంతి నరసింహా రెడ్డి 
వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు

Election 2024

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top