ప్రశ్నే ప్రజాస్వామ్యానికి జీవనాడి | Sakshi
Sakshi News home page

ప్రశ్నే ప్రజాస్వామ్యానికి జీవనాడి

Published Tue, Jul 19 2022 1:31 AM

Sakshi Guest Column Constitution Rights Central Govt ABK Prasad

ఆదేశిక సూత్రాలనే కాదు, రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా ఆచరణలోకి రాకుండా కేంద్ర పాలకులు జాగ్రత్తపడుతున్నారు. అదేమని అడిగితే, మాటల తూటాలను కూడా బూతులుగా పరిగణిస్తున్నారు. ప్రశ్నించే గొంతులను నోరెత్తకుండా చేసి, యథేచ్చగా పాలన చేయడానికి రోజుకొక కొత్త చిట్కాలు వెలువడుతున్నాయి. వలస పాలకులైనా, నాడు దేశ పౌరుల స్వేచ్ఛను ‘బందీ’ చేయడానికి వినియోగించిన దేశ ద్రోహ నేర చట్టాన్ని రద్దు చేసు కున్నారుగానీ, మన పాలకులు దాన్నే పట్టుకుని వేలాడుతున్నారు. ఇప్పటికైనా దేశ ఉన్నత న్యాయస్థానంలో మంచి సంస్కరణలకు పునాది లేచింది. ‘న్యాయం అనేది ప్రజల న్యాయబద్ధమైన హక్కుల్ని రక్షించడంలోనే కాదు, సామాజిక–ఆర్థిక న్యాయాన్ని చేకూర్చడంలో కీలకమైన అంశంగా ఉండాలి.’

‘‘ఒక వ్యంగ్య చిత్రకారుణ్ణి (కార్టూనిస్టు) దేశద్రోహ నేరారోపణపైన జైల్లో పెట్టడమంటే ఇక మన రాజ్యాంగం విఫలమైనట్టే!’’
– సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తి జస్టిస్‌ ధనంజయ వై.చంద్రచూడ్‌
‘‘భావ ప్రకటనా స్వేచ్ఛకు దేశం హామీ పడిన మాట నిజమే నయ్యా, ఇంతకూ నువ్వు పాలక పార్టీ మనిషివి, అవునా?’’
– మంజుల్‌ కార్టూన్‌ (29 జనవరి 22)
‘‘కర్ణాటకలోని బీజేపీ పాలనలోని అవినీతి నిరోధక విభాగం అధిపతిని నేను గట్టిగా మందలించినందుకుగానూ నన్ను బదిలీ చేస్తా మని బీజేపీ పాలకులు ఢిల్లీ నుంచి పరోక్షంగా బెదిరించారు.’’
– కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌.పి.సందేశ్‌ (కోర్టులో బహిరంగ ప్రకటన– 13 జూలై 22 నాటి వార్త)

వివిధ స్థాయుల్లో ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరులు, విధానాలు మెజారిటీ పాలక ప్రభుత్వం పేరిట దేశంలో చలామణీ అవుతున్నాయి. ఈ వాతావరణంలో రాజ్యసభను (పేరు ఎగువ సభ) పాలకపక్షం ఉపయోగించుకుంటున్న తీరు ప్రశ్నార్థకమవుతోంది. గతంలో కాంగ్రెస్‌ పాలకులు తమకు మెజారిటీ లోపించినప్పుడు కొన్ని కీలకమైన బిల్లులకు ఆమోదముద్ర వేయించుకోవడానికి రాజ్య సభలో అడ్డదారులు తొక్కడం మనకు తెలుసు. ఇప్పుడు ఆ తప్పుడు పద్ధతిలో భాగంగానే బీజేపీ–ఆరెస్సెస్‌ కూటమి పాలకులూ రాజ్య సభను ఉపయోగించుకోవడానికి వెనుకాడటం లేదు. పరోక్ష పలుకు బడికి లేదా ప్రయత్నాలకు వేదికగా రాజ్యసభ మారుతోంది. గతంలో దేశ ప్రధాని హోదాలో పీవీ నర సింహారావు (కాంగ్రెస్‌)కు అస్తుబిస్తు మెజారిటీ ఉన్నప్పుడు, ‘గట్టె’క్క డానికి వాటంగా ఉపయోగపడింది రాజ్యసభేనని మరచిపోరాదు. అందుకే అప్పుడూ, ఇప్పుడూ కూడా పాలకపక్షాలు రాజ్యసభ స్థానాలు పెంచుకోవడానికి అన్యమార్గాలు వెతుకుతున్నాయి. ఆ మార్గాల్లో ప్రధానమైన ఎత్తుగడగా రాష్ట్రాలను పరోక్షంగా ప్రభావితం చేయడం ఒకటి.

వడ్డించేవాడు మనవాడైతే కడపంక్తిలో కూర్చున్నా పదార్థాలన్నీ బీరుపోకుండా చేరినట్టే, అలహాబాద్‌ కోర్టు తీర్పుతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన పదవిని కోల్పోవలసి వచ్చినప్పుడు ఆమెను తాత్కాలికంగా గట్టెక్కించడానికి పరోక్షంగా సాయం చేసినవారు సుప్రీం న్యాయమూర్తి వి.ఆర్‌. కృష్ణయ్యరే! కాగా సుప్రీంకోర్టు ప్రధాన సీనియర్‌ న్యాయమూర్తిగా నియమితులు కావాల్సిన జస్టిస్‌ హెచ్‌.ఆర్‌. ఖన్నా ప్రభుత్వ పన్నాగాలకు లోనుకాకుండా ఉన్నందుకే అర్హమైన ప్రమోషన్‌ను కోల్పోవలసి వచ్చింది. అయినా ప్రజల మధ్య, న్యాయమూర్తుల మధ్య, ప్రజాస్వామ్య సంప్రదాయాల మధ్య జస్టిస్‌ ఖన్నా నిలబడ్డారు. అయితే, మన దేశంలో ఆయన్ని మరచిపోయాం! మరీ విచిత్రమేమంటే, ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిర రాజకీయ డిటెన్షన్‌ ఉత్తర్వులను ఒక్క కలంపోటుతో రద్దు చేసినందువల్ల జైళ్ల నుంచి విడు దలైన రాజకీయ ఖైదీల్లో హెచ్చుమంది బీజేపీ డిటెన్యూలు కూడా ఉన్నా వాళ్లకూ ఖన్నా సేవలు గుర్తు రాకపోవడం గమనార్హం.

అంతేగాదు, బ్రిటన్‌లో రాణి క్వీన్స్‌ కౌన్సిల్‌లో విశిష్ట సభ్యుడైన హెచ్‌.హెచ్‌. యాస్క్విత్‌ (1908–16) ఇంగ్లండ్‌ ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా ఇంగ్లిష్‌ వాడి జైళ్లలో మగ్గుతూన్న మన బాల గంగాధర తిలక్‌ను ప్రస్తావించాడు. ప్రజానుకూలమైన జర్నలిజాన్ని (పబ్లిక్‌ జర్నలిజం) ఇంగ్లండ్‌ ప్రజలు గౌరవిస్తారనీ, అలాగే తిలక్‌ రాతలన్నీ పబ్లిక్‌ జర్నలిజంగానే పరిగణనలోకి వస్తాయనీ యాస్క్విత్‌ సమర్థించాడు. తిలక్‌ రచనల్ని పబ్లిక్‌ జర్నలిజంగా పరిగణించకపోతే, పత్రికా స్వేచ్ఛకే గండికొట్టినట్టు అవుతుందని హెచ్చరించాడు. 

ఈ ప్రజాస్వామ్య సంప్రదాయాలను ‘పరగడుపు’గా భావిస్తు న్నందునే మన పాలకులు దేశ వాస్తవ చరిత్రను పక్కకు తోస్తున్నారు. మహాత్మాగాంధీ మునిమనుమడు, చైతన్యశీలి అయిన తుషార్‌ గాంధీ, ఇంకా ఇతర గాంధేయులు ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ పాల కులు క్రమంగా దేశంలోని ప్రధాన గాంధేయ సంస్థలపై ఆధిపత్యం సాధించి నియంత్రించ బోతున్నారనీ, గాంధీ సిద్ధాంతాలకు భిన్నమైన సిద్ధాంతాలను చొప్పించే ప్రమాదం ఉందనీ వారు పేర్కొన్నారు. ఈ వ్యూహంలో భాగమే సావర్కార్‌ భజనను ముందుకు నెట్టడమని చెబుతూ, ప్రస్తుత కేంద్ర పాలకుల్ని తృప్తిపరచడం కోసం దేశ చరిత్రనే వక్రీకరిస్తున్నారనీ తుషార్‌ ప్రభృతులు దేశ ప్రజల్ని హెచ్చరించి అప్రమత్తుల్ని చేయవలసి వచ్చింది. 

ఇక, రాష్ట్రపతులను ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే ఎన్నుకోవాలని భారత రాజ్యాంగ సభ సభ్యుడు ప్రొఫెసర్‌ కె.టి. షా అన్నారు. దీన్ని ప్రతిపాదిస్తూ ఓ చిత్రమైన వ్యంగ్యాస్త్రం రాజ్యాంగ సభ సభ్యుల పరిశీలనకు వదిలారు: ‘‘దేశ రాష్ట్రపతి దేశ ప్రధానమంత్రికి కేవలం ఓ గ్రామ్‌ఫోన్‌గా మాత్రమే పనిచేయాలని సభవారు కోరుకుంటు న్నారా?’’ అని షా ప్రశ్నించారు. అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి తన అధి కారాలను కేంద్ర మంత్రి మండలి సహాయ, సలహాల మీద ఆధారపడి అమలు చేస్తారనీ, అందువల్ల రాష్ట్రపతులు కేవలం ‘రబ్బరు స్టాంపు’గా వ్యవహరించడం కుదరదనీ లోక్‌సభ మాజీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన పి.డి.టి ఆచార్య (14 జూలై 2022) వివరించారు. స్వతంత్ర భారత చరిత్రలో రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి ఉద్దండులు కొన్ని విధాన నిర్ణయాలపైన ప్రభు త్వంతో బాహాటంగానే విభేదించి, ప్రభుత్వాల్ని ప్రభావితం చేయగలి గారని ఆచార్య గుర్తు చేశారు. అంతేగాదు, ‘భారతదేశానికి రాష్ట్రపతులు అవసరమేగానీ, కేవలం రాష్ట్రపతి కార్యాలయ నిర్వాహ కులు మాత్రం కా’దని ఆచార్య అభిప్రాయం! 

ఇతర అన్ని పరిణామాలకన్నా, నేటి భారత పాలనా యంత్రాం గంలో విధాన నిర్ణయాల పరిధిలో అడుగడుగునా ‘కొట్టొచ్చేట్టు’ అశ్రద్ధ కనిపిస్తోంది. భారత రాజ్యాంగంలో ఏ ఆదేశిక సూత్రాలు పేద, నిరుపేద బహుజనుల భవిష్యత్తును తీర్చి దిద్దేందుకు దోహదం చేస్తాయో ఆ సూత్రాలనే పాలకులు పక్కనబెట్టడానికి అలవాటు పడ్డారు. ‘ ప్రజా బాహుళ్యం పట్ల ... రాజ్యాంగం కల్పించిన హక్కుల్నే కాదు, బాధ్యతల అధ్యాయంలో పేర్కొన్న ఆదేశిక సూత్రాలను కూడా ఆచరణలోకి రానివ్వకుండా పాలకులు జాగ్రత్తపడుతున్నారు. అదే మంటే పార్లమెంట్‌లో, శాసనసభల్లో మాటల తూటాలను బూతు లుగా పరిగణించి, అసలు నోరెత్తకుండా చేసి, యథేచ్చగా పాలన కొనసాగించేలా రోజుకొక కొత్త చిట్కాలు వెలువడుతున్నాయి.

మన వేలు విడిచిన వలస పాలకులైనా, నాడు దేశ పౌరుల స్వేచ్ఛను ‘బందీ’ చేయడానికి వినియోగించిన దేశ ద్రోహ నేర చట్టాన్ని ఇంగ్లండులో రద్దు చేసుకున్నారుగానీ, మన పాలకులు ఇంకా దాన్నే పట్టుకుని వేలాడుతున్నారు. కనీసం ఇప్పటికైనా దేశ ఉన్నత న్యాయస్థానంలో మంచి సంస్కరణలకు పునాది లేచింది. వాటిని కూడా అదుపు చేయాలన్న దుగ్ధ పాలకులను విడనాడటం లేదు. జస్టిస్‌ ఫజిల్‌ అలీ అన్నట్టు ‘న్యాయం అనేది ప్రజల న్యాయబద్ధమైన హక్కుల్ని రక్షించడంలోనే కాదు, సామాజిక – ఆర్థిక న్యాయాన్ని ఆచరణలో చేకూర్చడంలో కీలకమైన అంశంగా ఉండాలి’.

‘‘చీకట్లను చీల్చుకుని ఒక కొత్త సూర్యుడు ప్రభవిస్తున్నాడు,
ఒక సామూహిక గానం పల్లవిస్తోంది – 
ఇళ్లనూ, బళ్లనూ, వాకిళ్లనూ
సమస్త ఆత్మీయ ప్రపంచాలనొదిలి
ఆదర్శాలనే ప్రపంచంగా మార్చుకున్నారు వాళ్లు
నూతన ప్రపంచానికి ద్వారాలు తెరిచారు వాళ్లు
వాళ్లకు మన ఆహ్వానం అనివార్యం’’(దొరా ఫరూఖీ కవితకు ఉదయమిత్ర స్వేచ్ఛానువాదం.)!


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement