ఇది... పెగ్గా సెస్‌! | Sakshi
Sakshi News home page

ఇది... పెగ్గా సెస్‌!

Published Tue, Apr 16 2024 12:54 AM

Sakshi Guest Column On Chandrababu By Vijaybabu

అభిప్రాయం

ఉండిలో అంతసేపు ఉండి వాళ్లతో విసిగి వేగి వేసారి ఇంటికి వచ్చిన చంద్రయ్యకు ఇల్లంతా హడావుడిగా కనిపించింది. రామయ్య, అచ్చయ్య,వెంకన్నలాంటి వాళ్లతో పాటు వకీళ్లు కూడా కనిపించారు. వాళ్ళ హడావిడితో పాటు సంటోడి ముఖంలో ఆందోళన చూసేసరికి ఏం అర్థం కాలేదు. 

‘‘ఏటయ్యింది?’’ అడిగాడు. అయినా అంతా నిశ్శబ్దం. ఎవరి నోటి నుంచి బదులు రాలేదు. ‘‘సెస్‌! అడుగుతున్నది మిమ్మల్నే. అంతా బెల్లం నోట్లో ఎట్టుకున్నట్టు మాహాడరే?’’ సున్నితంగా గద్దించాడు. ‘‘అయ్యా! అది కాస్తంత ఇబ్బందికర పరిస్థితి’’ వకీలు రవీంద్ర గంభీర వదనంతో పలికాడు. ‘‘అదేనయ్యా అదేటో సెప్తేనే కదా తెలిసేది? గౌరమ్మా ఏటైనాది? నువ్వైనా సెప్పు’’ అన్నాడు దూరంగా ఉన్న భార్య వైపు చూస్తూ. ‘‘అది ఏటంటే... మన సంటోడు పోన్లో మాట్లాడే దంతా ఇనేత్తున్నారంట. ఒకేపు కేసులు గట్రా ఉన్నాయి గందా? అదేదో పెగాసస్‌ అంట. దాంతో మన సంటోడు పోన్లో దూరి మొత్తం ఇనేస్తున్నారంట’’ సస్పెన్స్‌కి తెరదించుతూ భార్య గౌరీ చెప్పింది.

‘‘మీరేం కంగారు పడకండి. ఈ సంగతి ఢిల్లీకి కూడా కంప్లైంట్‌ చేశా’’ అన్నాడు రవీంద్ర కోటు, టై సవరించుకొంటూ. ఆ మాటకి ఉలిక్కిపడ్డాడు చంద్రయ్య. వెంటనే రామయ్య అందుకుంటూ, ‘‘ప్రెస్‌ మీట్‌ కూడా పెట్టాం.  అధికార పార్టీ కుట్రని కడిగిపారేశాం’’ అన్నాడు అచ్చయ్య వైపు మెచ్చుకోలుగా చూస్తూ.  

‘‘అంతేకాదు రేపు ఆందోళన కార్యక్రమాలు కూడా ప్లాన్‌ చేశాం’’ అచ్చయ్య ఉత్సాహంగా పలికాడు. ‘‘ఇది దేశంలోనే అతి పెద్ద కుట్ర’’ వెంకన్న ఆవేశంగా పలికాడు. ‘‘అసలు ఈ పెగా సెస్సు...’’ ఎప్పటిలాగే కాగితాలు ఏవో చూపుతూ పొట్టాభి ఏదో చెప్పబోయాడు. చంద్రయ్యకు ఆగ్రహం తన్నుకొచ్చింది. అవ్యక్తమైన ఉద్వేగాన్ని అణచుకొంటూ ‘‘సెస్‌! ఊరుకొండెహె. అంతా మీ మానాన మీరు చేసుకెల్లి పోవడమేనా? కనీసం ముందు నాతో ఒక ముక్క సెప్పాలని తెల్దేటి? పెతివాడికి అతి ఉత్సాహం!’’ 

చంద్రయ్య తనని తను తమాయించుకొని, ‘‘సరే సరే. ఢిల్లీ లెవెల్‌ దాకా తీసుకెల్లారన్నమాట. సర్లే ఆ తర్వాత ఎలా ముందుకు బోవాలో రేపు చర్చిద్దాం వెళ్ళండి’’ అన్నాడు కూల్‌ గా. ‘‘నువ్వూ ఎల్లి తొంగో’’ అన్నాడు సంటోడితో. ‘‘ఏటీ అలా  సిటపటలాడిపోతున్నారు. ఎండదెబ్బ కొట్టేసి నాదా?’’ అన్నది గౌరీ దగ్గరకొస్తూ. ‘‘నాక్కాదు నీ కొడుక్కి కొట్టినాది. నేను అలా కాస్త బయిటికి ఎల్లొస్తే చాలు. ఏదో ఒక పేడ తట్ట ఎట్టేస్తాడు. అవునే నాకు తెలవక అడుగుతాను. ఆడి పోను హ్యాకింగ్‌ చేసేవాడు ఎవడుంటాడు?’’

‘‘అంటే వాడి  ఫోను హ్యాకింగ్‌ అవలేదా?’’ చిరుకోపం ప్రదర్శిస్తూ అడిగింది గౌరీ. ‘‘సెస్‌. మల్లీ అదే మాట. వాడి ఫోనుతో ఎవరికి పనే? ‘‘మరెవరికి పని?’’ రెట్టించింది గౌరీ. ‘‘ఇంకెవరికి? నాకు, నీకు, కాదంటే కోడలు పిల్లకు’’ ‘‘అంటే ఏటి మీరు అనేది?’’ అనుమానంగా చూస్తూ అడిగింది గౌరీ. ‘‘మరేటుంది? నేనే చేశాను. అంతా నేనే చేశాను. ఒకేపు నేను వాడి కోసం పడరాని పాట్లు పడుతూ, నానా తిట్లు తింటూ, ఎండలో తిరుగుతూ ఉంటే, ఈడేమో ఏసీలో తొంగొని, 24 గంటలు ఫోన్‌తో కాలం గడిపేస్తుంటాడు.

అసలు ఆ ఫోన్లో ఏటుందో తెలుసుకుందామని నేనే ఆ పని చేశా! తీరా ఫోన్లో సమాచారం మరి ఏటున్నదో తెలుసా?? ఫోన్‌ అంతా అమెరికా ఫ్రెండ్స్‌తో చాటింగ్లు, వీడి వీర గాథలు, సిగ్గీలు, జొమాటోల ఆర్డర్లు. ఈ మధ్య కాస్త ఎండలో తిరగటం మొదలెట్టిన దగ్గర నుంచి ఫోన్‌ అంతా సిగ్గీ ఆర్డర్లే.  సిగ్గు లేకపోతే సరి. ఈ సమాచారం తెలుసుకొని ఎవరైనా ఏం చేసుకుంటారు? ఇంత హడావిడి జరుగుతున్నా బాధ్యత లేదు. ఓ ఎదవ హడావిడి తప్ప. పోనీ నాతో పాటు తిప్పుకుందాం అంటే, ఎక్కడ ఏ పేడతట్ట ఎత్తాడో అని భయం’’ అంటూ అసలు సంగతి బయట పెట్టే సరికి గౌరీ అవాక్కయిపోయింది. 

పి. విజయబాబు 
వ్యాసకర్త పూర్వ సంపాదకులు

Advertisement
Advertisement