అప్పుడే పట్టణాలు శుభ్రపడతాయి!

Refuse Reduce Reuse and Recycle is the Solution For Waste Management - Sakshi

ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ అతి వేగంగా పెరుగుతోంది. భారతదేశంలోనూ ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సందర్భంలో పట్టణాలలో చెత్త, వ్యర్థాలు ప్రతి రోజూ కుప్పలు కుప్పలుగా పెరిగిపోవటం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇందువల్ల ప్రజారోగ్యానికీ, పర్యావరణానికీ ఎంతో హాని కలుగుతోంది. స్థానిక సంస్థలకు ఈ చెత్తను తొలగించడం సవాలుగా మారింది. గత రెండు దశాబ్దాలలో వేగవంతమైన పట్టణాభివృద్ధి, జనాభా పెరుగుదల, మారుతున్న జీవన ప్రమాణాలు పట్టణాల్లో వ్యర్థాల పెరుగుదలకు హేతువులుగా చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బహుముఖ వ్యూహంతో వ్యర్థాల నిర్వహణను చేపట్టవలసిన అవసరం ఉంది. 

ఇప్పటివరకూ చేపడుతున్న కార్యక్రమాలలో ఆర్‌ఆర్‌ఆర్‌ఆర్‌  (రెఫ్యూజ్‌: తిరస్కరణ, రెడ్యూస్‌: తగ్గించడం, రీయూజ్‌: తిరిగి వాడటం, రీసైకిల్‌: వేరుచేసిన చెత్తను ఇతర వస్తువులను తయారు చేయడానికి లేదా పునర్వినియోగానికి సిద్ధం చేయడం) వంటి వ్యూహాలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు ఇండోర్‌ నగరంలో అమలవుతున్న కార్యక్రమాల ద్వారా తెలుస్తోంది. వ్యర్థాల నిర్వహణలో ఇండోర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ గత 5 సంవత్సరాలుగా దేశంలోనే మొదటి ర్యాంకు సాధిస్తోంది. ఇండోర్‌ నగంలోని ప్రజలలో వచ్చిన అవగాహన, ప్రవర్తనలోని మార్పులు, మునిసిపల్‌ సిబ్బంది అకుంఠిత దీక్ష వల్లనే ఇది సాధ్యమయింది.  

ఇండోర్‌ నగరంలోని వివిధ ప్రాంతాలలో పది ట్రాన్స్‌ఫర్‌ కలెక్షన్‌ సెంటర్లను అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఏర్పాటు చేశారు. ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల నుండి వేరు వేరుగా సేకరించిన చెత్తను భారీ వాహనాల ద్వారా ప్రాసెసింగ్‌ యూనిట్‌కు తరలిస్తారు. అక్కడ పొడి చెత్తను ఆరు రకాలుగా విభజించి ఆ తదుపరి మిగిలిన కొద్దిపాటి ఉపయోగం లేని చెత్తను శాస్త్రీయ పద్ధతి ద్వారా లాండ్‌ ఫిల్లింగ్‌ చేస్తారు. ప్రాసెసింగ్‌ యూనిట్‌ నుండి తరలించిన చెత్తతో అనేక నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు.

ఇటీవల హైదరాబాదులో ‘ఇంక్‌వాష్‌’ సంస్థ నిర్వహించిన సదస్సులో చెత్త రీసైక్లింగ్‌ చేయడం ద్వారా అత్యధికంగా లాభాలు పొందే ఉపాధి అవకాశాలపై చర్చ జరిగింది. చెత్తతో వస్తువులను తయారు చేయడానికి ముందుకు వచ్చే స్టార్టప్‌ సంస్థలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.

జనాభా పెరుగుతున్న నగరాలలో రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళికలను రచించి పకడ్బందీగా ‘చెత్త’ సమస్యను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. స్థానిక సంస్థలు, ప్రభుత్వాలు, ప్రజలను చైతన్యవంతులను చేయాలి. కాలనీ, రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి. అలాగే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, వనరులను సమకూర్చుకోవాలి. అప్పుడే ప్రతి నగరం, పట్టణం పరిశుభ్రతతో అలరారుతుంది. 

- ప్రొఫెసర్‌ కుమార్‌ మొలుగరం 
భారత ప్రభుత్వ ప్రాంతీయ పట్టణ అధ్యయన కేంద్రం డైరెక్టర్, ఓయూ

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top