వివక్ష ఉందంటే ఉలుకెందుకు?

Professor Sripati Ramudu Write Caste Discrimination, Human Rights - Sakshi

వివక్ష సృష్టికర్తలు, వివక్ష లేదని చెప్పడమో లేక దాన్ని తక్కువ చేసి చూపడమో చేస్తూ వుంటారు. అందులో భాగంగానే  బాధితుల ఆక్రందనల్ని ప్రమాదకరమైన అలవాట్లుగా చూపిస్తుంటారు. ఈ మధ్య ఒక వైపు దళితుల మీద వివక్ష వుందని చెబుతూనే మరోవైపు  వివక్ష తీవ్రతనూ, పరిమాణాన్నీ పలుచన చేసి చూపించే ప్రయత్నాలు ఎక్కువయ్యాయి. నవంబర్‌ 17న ‘సాక్షి’లో పి. కృష్ణమోహన్‌ రెడ్డి రాసిన ‘ఇక్కడి వివక్షే కనిపిస్తుందా?’ వ్యాసంలో ఈ ధోరణి కనిపిస్తుంది. ఆధారాల కంటే సొంత అవసరాలనే నిజాలుగా ప్రచారంచేసే పోస్ట్‌– ట్రూత్‌ మేధావులు పెరిగిపోయారు. ఇక్కడి వివక్షని తెలుసు కోవడానికి విదేశాల రిపోర్టులు అవసరం లేదనీ... నిజాన్ని గుర్తించే జ్ఞానం వుంటే సరిపోతుందనీ తెలుసుకోలేకపోతున్నారు. కులం కొనసాగింపు కోసం కొత్తకొత్త వాదనలు కనిపెడుతున్నారు. 

దళితులు ప్రతి విషయాన్నీ కుల కోణం నుంచి చూస్తున్నారని ఆందోళన చెందటం అందులో మొదటిది. తమ తప్పును కప్పిపుచ్చు కోవడానికి అన్ని కులాలు వివక్ష ఎదుర్కొంటున్నాయి అంటారు. దళితులు ఎదుర్కొనే అంటరానితనం భిన్నమైందని ఒప్పుకోరు. ‘కొన్ని సంఘటన లను చూపించి’ దేశమంతా వివక్ష ఉందనడం సరి కాదంటారు. 2021లోనే  దేశంలో 50,900 దాడులు నమోదు అయినట్లు నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో చెప్పింది. ఇన్ని దాడులు చెదురు మదురు ఘటనలుగా కనిపించడం ఆశ్చర్యమే. 

దళితులు ఇక్కడి వివక్షనే ఎదిరించడం ‘అధర్మ’మట. ఆఫ్రికాలో అపార్తీడ్‌కూ, అమెరికాలో జాతి వివక్షకూ వ్యతిరేకంగా దళితులు సంఘీభావం ప్రకటించడం వీళ్ళకి కనబడదు. ఎక్కడో వివక్ష ఉంది కాబట్టి ఇక్కడ దళితులు దాన్ని అనుభవించాలంటారు! ఆస్ట్రేలియాలో ఆదివాసీలకు జరిగిన అన్యాయానికి ఆ దేశ అధినేత క్షమాపణ చెప్పాడు. అమెరికాలో నల్ల జాతీయుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హరీస్‌ క్షమాపణలు చెప్పారు. అలాంటి ఊరట కలిగించే మాట ఇక్కడ ఎవరైనా చెప్పగలరా? రిజర్వేషన్లు సమానత్వానికి వ్యతిరేకం అని ప్రచారం చేస్తారు. కానీ వీళ్ళకు కులం, అంటరానితనం అసమానత్వంగా కనబడవు. 

అమెరికాలో ‘పౌర హక్కుల చట్టం 1964’ ప్రకారం జాతి, మతం, లింగం వంటి అంశాల వల్ల ఒక వ్యక్తిని వివక్షకు గురి చేయకూడదు. ఈ చట్టం లోని ‘టైటిల్‌ సెవెన్‌’ ప్రకారం ప్రభుత్వంతో కలిసి పనిచేసే వ్యక్తులు, సంస్థలు... కాంట్రాక్టులు, వ్యాపారాల్లో అఫర్మే టివ్‌ యాక్షన్‌  ప్లాన్‌  అమలు చేసి తీరాలి. అంటే నల్ల జాతీయులు, లాటిన్‌ అమెరికన్స్, మహిళలు, మైనారిటీలు, ట్రాన్స్‌ జెండర్స్‌ వంటి వారికి  తప్పకుండా ఉద్యోగావకాశాలు కల్పించాలి. నియామకాలలో డైవర్సిటీ ఇండెక్స్‌ పాటించి తీరాలి. ఇది రిజర్వేషన్‌ లాంటిదే. అమెరికా సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో డైవర్సిటీ ఇండెక్స్, హాలీవుడ్‌ సినిమాల్లో నల్ల జాతీయులు కనిపించడం వంటివి అఫర్మేటివ్‌ యాక్షన్‌లో భాగమే. దౌర్భాగ్యం ఏంటంటే... బతుకుదెరువు కోసం వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్న మన వాళ్ళు అక్కడ కూడా కుల వివక్షను పెంచి పోషిస్తున్నారు. అందుకే అక్కడి దళితులు నల్లజాతీయుల లాగే తమకూ రక్షణ చట్టాలు కావాలని ఉద్యమాలు చేస్తున్నారు. అకడమిక్స్‌లోనూ వివక్ష రాజ్యమేలుతోంది. దానికి వ్యతిరేకంగా పోరాడే విద్యార్థులనూ, ఉద్యోగులనూ కులవాదులుగా చిత్రించడం  ‘అలవాటైన దుర్మార్గం’ కాదా? దళితులు ఇప్పుడిప్పుడే చదువుకు దగ్గర అవుతున్నారు. వాళ్లకి వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు విష వలయాలుగా మారటం అన్యాయం కాదా?

అంబేడ్కర్‌ మీద అక్కసు వెళ్లగక్కడం మరో పోకడ. గతంలో  అమెరికాకి చెందిన నల్లజాతి నాయకులు ఇండియా వచ్చి గాంధీని కలిసి ఆహ్వానించారు గాని అంబేడ్కర్‌ని కలవలేదని పెద్ద రహా స్యాన్ని కనిపెట్టినట్టు ప్రచారం చేస్తున్నారు. గాంధీని పిలిచారు కాబట్టి అంబేడ్కర్‌ వివక్ష మీద పోరాటం చెయ్యలేదని చెప్పగలరా? గాంధీ ఒక దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపిస్తున్న నేతగా ప్రపంచాన్ని ఆకర్షించాడనే సంగతిని మరువరాదు. అంబేడ్కర్‌ను తక్కువ చేసి చూపాలనే దుగ్ధతో అనవసరమైన పోలికలు తీసుకొస్తే ఎలా? ‘అంబే డ్కర్‌ ఎంతో సహనంతో ఇప్పటిదాక నామీద దాడి చెయ్యకపోవడం అతని గొప్పతనమే’ అని గాంధీ స్వయంగా ‘హరిజన’ పత్రికలో ఎందుకు రాసుకున్నాడో తెలిస్తే లోతు అర్థమౌతుంది. 

దేశంలో చాక్లెట్‌ కొన్నా పన్ను కట్టాల్సిందే. ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ... మిగిలిన పౌరుల్లాగానే పన్ను కడుతున్నారు. అందులోంచే సంక్షేమ కార్యక్రమాలకూ, పారిశ్రామిక వసతుల కోసం, కార్పొరేట్‌ లకూ, భూమి ఉన్న రైతులకూ రాయితీలు ఇవ్వడం కోసం ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది. రాయితీల్లో తొంబై శాతం పైగా లబ్ధి దారులు పైకులాలవారే. ఈ రాయితీలతో పోల్చుకుంటే రిజర్వేషన్ల విలువ అతి స్వల్పం. దేశాన్నే ప్రైవేట్‌ చేతుల్లో పెడుతుంటే పట్టించు కోకుండా తరతరాలుగా అణచివేతకు గురైనవారికి ఇస్తున్న రిజర్వేషన్ల మీద దాడిచేయడం ఏమిటి? కులం పేరుతో ఎవరి పట్లయినా వివక్ష చూపడం జరిగినా, దాడి జరిగినా నైతికంగా అందరూ బాధ్యత వహించాలి. దాన్ని అందరూ గర్హించాలి. (క్లిక్ చేయండి: మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో.. !?)


- ప్రొఫెసర్ శ్రీపతి రాముడు 
ఆచార్యులు, సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇన్‌క్లూజివ్‌ పాలసీ, హెచ్‌సీయూ

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top