పేద పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట

Meruga Nagarjuna Writes on Jagananna Videshi Vidya Deevena Scheme - Sakshi

ప్రజలకు ఉపయోగపడే పథకాలను అమలు చేయడంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, ఆయన తనయుడు జగన్‌మోహన్‌ రెడ్డిల పాలనలు తిరుగులేని తార్కాణం. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకం వైసీపీ పాలనలో వెలువడిన మరో ఆణిముత్యం.

చంద్రబాబు నాయుడు హయాంలో అమలు చేసిన విదేశీ విద్యా దీవెన పథకానికి నిర్దుష్టమైన నియ మాలు లేవు. ఏడాదికి 100 మంది ఎస్టీలకు, 300 మంది ఎస్సీలకు, 400 మంది కాపులకు, 500 మంది మైనారిటీలకు, 1,000 మంది బీసీలకు పరిమితం చేశారు. పేదల్లో ఉన్న అగ్ర వర్ణాల వారిని అనర్హులుగా చేశారు. మొత్తం మీద ఏడాదికి 2,300 మందికి మించకుండా విద్యార్థులను ఎంపిక చేశారు. అయితే ఈ కొద్ది మంది ఎంపికలోనూ అనేక అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకున్నాయి. పరిమితికి మించిన ఆదాయం కలిగిన కుటుంబాల పిల్లలకు కూడా ఈ పథకం వర్తింప చేశారు.

అలాగే ఎంపికైన విద్యార్థులలో కొంత మంది అనుమతి లేకుండానే చదివే యూనివర్సిటీలు, దేశాలూ మార్చుకున్నారు. కొంత మంది అయితే అసలు కోర్సు పూర్తి చేయకుండానే ఆర్థిక సహాయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే విదేశీ విద్యా పథకంలో ఉన్న లోపాలన్నింటినీ సరిదిద్ది, అక్రమాలకు తావు లేకుండా పూర్తిగా పారదర్శక విధానంలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా ముఖ్యమంత్రి జగన్‌ ‘జగనన్న విదేశీ విద్య’ పథకానికి రూపకల్పన చేశారు.

ఈ పథకంలో ముందుగా యూనివర్సిటీల నాణ్యతా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రపంచ స్థాయిలో ఇచ్చే క్యూఎస్‌ (క్వాక్వరెల్లి సిమండ్స్‌) ర్యాంకింగ్‌లో 1 నుంచి 200 లోపు ర్యాంకులు కలిగిన యూనివర్సిటీల్లో చదవడం వల్ల విద్యా ర్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 1 నుంచి 100 దాకా క్యూఎస్‌ ర్యాంకులు కలిగిన యూనివర్సిటీల్లో చదవడానికి సీట్లు సంపాదించిన విద్యార్థులకు పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ ఇవ్వాలనీ, అదే విధంగా 101 నుంచి 200 దాకా క్యూఎస్‌ ర్యాంకింగ్‌ కలిగిన యూని వర్సిటీలకు ఎంపికైన విద్యార్థులకు రూ. 50 లక్షల వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలనీ నిర్ణయించారు. బాబు హయాంలో అమలు చేసిన విదేశీ విద్యా పథకంలో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు రూ. 15 లక్షలు, కాపులు, బీసీలకు రూ.10 లక్షలు మాత్రమే ఆర్థిక సహాయం చేసే వారు.

దీన్ని బట్టి చంద్రబాబు ప్రభుత్వంలో అమలు చేసిన విదేశీ విద్యా పథకం కంటే జగనన్న విదేశీ విద్యా పథకంలో విద్యా ర్థులకు అందించే ఆర్థిక సాయాన్ని ఎంత ఎక్కువగా పెంచారో గమనించవచ్చు. అంతే కాదు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమలు చేసిన విదేశీ విద్యా పథకంలో ఏడాదికి 2,300 మందిని మాత్రమే ఎంపిక చేయాలన్న పరిమితి ఉండేది. కానీ జగనన్న విదేశీ విద్యా పథకంలో అలాంటి పరిమితి ఏదీ లేదు. క్యూఎస్‌ 200 లోపు ర్యాంకులు కలిగిన యూనివర్సిటీలకు ఎంతమంది విద్యార్థులు ఎంపికైతే అంత మందికీ కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

ఇది కాకుండా గతంలో కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికే పరిమితమైన ఈ పథకాన్ని అగ్రకులాల్లో పరిమిత ఆదాయం కలిగిన వారికి కూడా వర్తింపజేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీనికితోడుగా గతంలో ఉన్న ఆర్థిక పరిమితి రూ. 6 లక్షలను రూ. 8 లక్షలకు కూడా పెంచారు. ఈ విధంగా పేద పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అపరిమితమైన ప్రయోజనాలతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసు కొచ్చింది.  ప్రతి యేటా సెప్టెంబర్‌ – డిసెంబర్, జనవరి–మే మాసాల్లో అర్హుల గుర్తింపు కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేయడం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది.

అయితే విదేశీ విద్యా పథకాన్ని నిలిపివేశారని చంద్రబాబు నాయుడు విమర్శించడం దారుణం. ఆయనకు ప్రజా ప్రయో జనాల కంటే రాజకీయాలే ప్రధానమని ఈ పథకాన్ని విమర్శించడం బట్టి అర్థమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇంత మంచి పథకాన్ని తీసుకురావడంతో సరిపెట్టకుండా టాప్‌ 200 యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించడంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారి పిల్లలు ఇబ్బంది పడకుండా వారికి ప్రత్యేకమైన శిక్షణను ఇప్పించాలని కూడా యోచిస్తుండటం ఆయన విశాల ధృక్పథానికి నిదర్శనం. (క్లిక్‌: అనవసర ఉద్యమాలు ఎందుకు?)


- డాక్టర్‌ మేరుగు నాగార్జున 
ఏపీ సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top