‘‘థరూర్‌జీ! పార్టీలో మీకెవరూ వ్యతిరేకంగా లేరు’’ | Sakshi
Sakshi News home page

‘‘థరూర్‌జీ! పార్టీలో మీకెవరూ వ్యతిరేకంగా లేరు’’

Published Sun, Oct 16 2022 6:21 PM

Madhav Singaraju Rayani DairyOn Congress Elections Kharge vs Tharoor - Sakshi

అక్టోబర్‌ 19 పెద్ద విశేషమేం కాదు. అక్టోబర్‌ 17న జరిగేవి కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలే కనుక 19న జరిగే కౌంటింగ్‌లో కాంగ్రెస్‌ గెలుస్తుందా, బీజేపీ విజయం సాధిస్తుందా, లేక ఆమ్‌ ఆద్మీ పార్టీ వచ్చేస్తుందా అనే ఉత్కంఠ ఏమీ ఉండదు. నేనో, థరూరో ఎవరో ఒకరం గెలుస్తాం. మాలో ఎవరు గెలిచినా కాంగ్రెస్‌ గెలిచినట్లే కానీ, మాలో ఒకరు ఓడిపోయి, ఒకరు గెలిచినట్లు కాదు. ఈ నిజాన్ని అంగీకరించడానికి శశి థరూర్‌ ఎందుకు సిద్ధంగా లేరో మరి?! కాంగ్రెస్‌ను గెలిపించడం కోసం ఇద్దరు కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీ పడుతున్నట్లుగా కదా ఆయన ఈ ఎన్నికల్ని  మనసా వాచా కర్మణా చూడాలి!

థరూర్‌ గానీ, నేను గానీ ఇప్పుడు ఆలోచించవలసింది హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవడం గురించి; తర్వాత జరిగే పది రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవడం గురించి; ఆ తర్వాత 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవడం గురించి. ఏడాదిలో ఇన్ని ఎన్నికల్ని పెట్టుకుని, ఏడాదికోసారి జరిగే పార్టీ అధ్యక్ష ఎన్నికలే తన సర్వస్వంగా థరూర్‌ భావించడం ఏమిటి?!

‘‘ఈ పోటీ న్యాయంగా జరగడం లేదు. అంతా నాకు వ్యతిరేకంగా జరుగుతోంది’’ అని ఆయన అంటున్నారు!

 ‘‘థరూర్‌జీ! మీరు అనుకుంటున్నట్లుగా పార్టీలో మీకెవరూ వ్యతిరేకంగా లేరు..’’ అన్నాను.. రెండు రోజుల క్రితం ఫోన్‌ చేసి.  
నిజానికి ఆ మాట చెప్పడానికి నేను ఆయనకు ఫోన్‌ చేయలేదు. సోనియాజీ పార్లమెంటరీ ప్యానెల్‌ ఛైర్‌పర్సన్‌గా థరూర్‌ని ఎంపిక చేశారని తెలిసి చేశాను. చేసి, ‘‘కంగ్రాట్స్‌ థరూర్‌జీ..’’ అన్నాను. 

‘‘థ్యాంక్యూ ఖర్గేజీ! మరి నేను కూడా ఇప్పుడే మీకు కంగ్రాట్స్‌ చెప్పేయమంటారా, అక్టోబర్‌ 19 వరకు ఆగమంటారా?’’ అని నవ్వుతూ అడిగారు థరూర్‌. ఆయన ఉద్దేశం నాకు అర్థమైంది. సోనియాజీ నాకు సపోర్ట్‌ చేస్తున్నారు కాబట్టి పార్టీ అధ్యక్షుడిగా ఆల్రెడీ నేను గెలిచేసినట్లేనని!!

‘‘అప్పుడు కూడా నేనే మీకు కంగ్రాట్స్‌ చెబుతాను థరూర్‌జీ. ‘మీ’ ప్రయత్నం వల్లనే కదా, పార్టీకి అసలంటూ ఎన్నికలు జరుగుతున్నాయి..’’ అన్నాను. 
‘మీ’ అనడంలో నా ఉద్దేశం ‘జి–23’ అని. పార్టీలో ఎన్నికలకు ఒత్తిడి తెస్తూ రెండేళ్ల క్రితం సోనియాజీకి లేఖ రాసిన గ్రూప్‌ అది. 
జి–23 అనే మాటకు పెద్దగా నవ్వారు థరూర్‌. 

‘‘ఖర్గేజీ! మీకొకటి తెలుసా? ఆ గ్రూపులో ఉన్నవారెవరూ ఇప్పుడు నాతో లేరు. మీ వైపు వచ్చేశారు. ఆ గ్రూపులో నేను ఉన్నందుకు కూడా ఇప్పుడు నాతో ఎవ్వరూ లేరు. వాళ్లూ మీ వైపే ఉన్నారు. నేనొస్తున్నానని తెలిసి దేశవ్యాప్తంగా పీసీసీ ప్రెసిడెంట్‌లు పొలాల్లోకి, పక్క ఊళ్లలోకి, లేని పోని సంతాపాల పనుల్లోకి పరుగులు తీస్తున్నారు! మొన్న తెలంగాణలో చూశారు కదా! అక్కడి ప్రెసిడెంట్‌ మీకు ఒకలా, నాకు ఒకలా ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. నాకు షాక్‌ ట్రీట్‌మెంట్‌. మీకు స్వీట్‌ ట్రీట్‌మెంట్‌..’’ అన్నారు నవ్వు ఆపకుండా థరూర్‌.

‘‘థరూర్‌జీ! మీపై నిజంగా వ్యతిరేకత ఉంటే సోనియాజీ మీకు పార్లమెంటరీ ప్యానెల్‌ పోస్ట్‌ ఇచ్చేవారా?! సోనియాజీనే స్వయంగా మీకు పోస్ట్‌ ఇచ్చాక కూడా పార్టీలో మిమ్మల్ని వ్యతిరేకించే వారు ఉంటారా?!’’ అన్నాను. ఆ మాటకు మళ్లీ పెద్దగా నవ్వి.. ‘‘ఖర్గేజీ.. వ్యతిరేకత లేకపోవడం మద్దతు అవుతుందా, మద్దతు ఇవ్వక పోవడం వ్యతిరేకత అవుతుంది కానీ..’’ అన్నారు థరూర్‌. రేపే పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక. ‘‘ఖర్గేజీ వస్తే మారేదేమీ ఉండదు. నేనొస్తే నాతో పాటు మార్పును తెస్తాను’’ అని థరూర్‌ చెబుతున్నారు. చూడాలి.. రేపు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రతినిధులు మార్పు కోసం ఓటేస్తారో, ఏదీ మారకుండా ఉండటం కోసమే ఓటేస్తారో
-మాధవ్‌ శింగరాజు 

Advertisement
 
Advertisement
 
Advertisement