మనోభావాలు ముఖ్యం.. ఆచితూచి వ్యవహరించాలి

Macharla Mogili Goud Write on Neera Cafe Name Contoversy - Sakshi

గీత వృత్తికి చెందిన గౌడ కులస్థుల కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో... వారి సంక్షేమార్థం రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ భువనగిరి జిల్లా ‘నందనం’ అనే గ్రామంలో 8 కోట్ల రూపాయల వ్యయంతో నీరా శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం పట్ల సర్వతా హర్షం వ్యక్తమైంది. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై నెక్లెస్‌ రోడ్డులో ఒక నీరా హబ్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో దానికి ‘వేదామృతం’ అని పేరు పెట్టారు. అదే ఇప్పుడు వివాదానికి దారి తీసింది.

హైదరాబాద్‌లోని కొంతమంది బ్రాహ్మణ వర్గం నాయకులు రాష్ట్ర ప్రభుత్వ సలహా దారైన డాక్టర్‌ రమణాచారిని కలిసి నీరాపానీయానికి ‘వేదామృతం’ అనే నామకరణం ఎంత వరకు సమంజసమైనది అని ప్రశ్నిస్తూ వినతి పత్రం సమర్పించారు. దీంతో వాద ప్రతివాదాలు ఊపందుకున్నాయి.

హిందువుల పవిత్ర గ్రంథాలలో ‘వేదాలు’ అనేవి చాలా ప్రాధాన్యం సంతరించుకొన్నవనీ, అవి ప్రపంచానికి మార్గదర్శకాలనీ, నీరాకు వేదామృతం అనే పేరు పెట్టడం హైందవ జాతిని అవమానించేదిగా ఉందనే విషయాన్ని తెరమీదకు తీసుకువచ్చారు ఈ పేరును వ్యతిరేకించేవారు.

అయితే కల్లుగీత వృత్తిపై ఆధారపడిన గౌడ కుల సంఘాలు, నాయకులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వేదామృతం పేరును సమర్థించడంతో సమస్య జటిలమైందని చెప్పాలి. ఆయుర్వేద వైద్యపరంగా నీరా అనేది సర్వరోగ నివారిణి అనీ, ముఖ్యంగా క్యాన్సర్‌ను కూడా నివారించే ఔషధ గుణాలున్నాయనేది వారి వాదం. 

వేదాల్లో సురాపానం గురించి ఉందనీ, ‘సుర’ అంటే అమృతం అనీ, దేవతలూ, రాక్షసులూ దానిని సేవించారని ప్రకటనలు ఇవ్వడం సరికాదు. వేదాలకు భారతీయ సంస్కృతిలో ఉన్న ప్రాముఖ్యం, పవిత్రతను దృష్టిలో పెట్టుకుని గౌడ సోదరులు వేదామృతం అనే పేరును సమర్థించే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సమాజంలోని అన్ని వర్గాల మనోభావాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. (క్లిక్ చేయండి: నిజంగా కులగణన అవసరమేనా?)

– డాక్టర్ మాచర్ల మొగిలి గౌడ్
రిటైర్డ్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, చేవెళ్ల

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top