వందేళ్ల ఆంధ్రుల స్వప్న సాకారం పోలవరం

Kovvuri Trinath Reddy Article On Polavaram Project - Sakshi

సందర్భం

ప్రపంచంలోనే గొప్పదని చెప్పుకునే చైనాలోని త్రీ గోర్జెస్‌ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌లో శరవేగంగా నిర్మాణమవుతున్న పోలవరం ప్రాజెక్ట్‌ తలదన్నబోతోంది. చైనా త్రీ గోర్జస్‌ ప్రాజెక్టు ప్రవాహం 41 లక్షల క్యూసెక్కులయితే మన పోలవరం ప్రవాహం 50 లక్షల క్యూసెక్కులు. వాస్తవంగా చెప్పాలంటే ‘త్రీ గోర్జస్‌’ మూడు మహానదుల కలయిక... ప్రవాహంలోనూ, ఆధునిక సాంకేతికతలోనూ, ఇతర విశేషాలకు సంబంధించి పోలవరం ప్రాజెక్టుతో పోలిస్తే త్రీ గోర్జస్‌ చిన్నబోయినట్లే... దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కన్న కలను ఆయన కుమారుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మరీ సాకారం చేయబోతున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్‌కు కొన్ని ప్రత్యేకతలు సంతరించుకొనున్నాయి. సీఎం జగన్‌ ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణంపై ఒక సమగ్ర క్యాలెండర్‌ ఏర్పాటుతో ప్రణాళికాబద్ధంగా అధిక శ్రద్ధ పెట్టారు... గతంలో ప్రాజెక్ట్‌కు చెందిన కొన్ని విభాగాల్లో అవినీతి జరిగిందని గుర్తించి రీ టెండరింగ్‌ విధానం తీసుకు రావడం ద్వారా ప్రజాధనం వృథా కాకుండా అడ్డుకట్ట వేశారు... ఆ తరువాత మాత్రమే అపార అనుభవం ఉన్న మెగా ఇంజనీరింగ్‌ సంస్థ టెండర్‌ ద్వారా ప్రాజెక్ట్‌  దక్కించుకుంది. 

ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వరదలొచ్చినా, కరోనా విలయ తాండవం చేసినా ఒక్కరోజు కూడ పని ఆగకుండా చేయడం గొప్ప విశేషం. అలాగే ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్లు సైతం చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. వీరంతా పోలవరం చరిత్రలో నిలిచిపోతారు. సీఎం జగన్‌కు ఆ నిబద్ధతే శ్రీరామరక్ష కానుంది. ఎంతగా అంటే గోదావరి నదిపైన ఒక్కొక్క గేటు 20 మీటర్ల ఎత్తు ఉండే 48 గేట్లు ఇక్కడ ప్రాజెక్టులో ఏర్పాటు చేసి నదీ గమనం మార్చి నిర్మించడం, స్పిల్‌ వే ద్వారా మళ్ళించిన ప్రాజెక్ట్‌ ప్రపంచంలో ఇదే కావడం తెలుగు వాడికి ముఖ్యంగా ఆంధ్రుడికి ఒక గర్వకారణంగా నిలిచిపోనుంది. ఇది భారతదేశానికి కూడా గర్వకారణమే కదా. 

పైగా సముద్రాన్ని మరపించేలా మంచినీటి మత్స్య సంపదకు ఆటంకం లేకుండా ఫిష్‌ ల్యాడర్‌ ఏర్పాటుతో మత్స్య సంపదకు ఆటంకం లేకుండా ముందుగానే పాదుకొల్పారు. ఇక పాపికొండల అందాలు మరింత ఆస్వాదించేలా ప్రత్యేకంగా నావిగేషన్‌ కెనాల్‌ ఏర్పాటు చేయడం వంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ ప్రాజెక్టులో చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడైనా ప్రకృతి ప్రతికూలించి వర్షాలకు ఆటంకం కలగవచ్చు. ఆ పరిస్థితే వస్తే డెల్టా సాగునీటి సరఫరాలకు ఆటంకం లేకుండా స్పిల్‌ లెవెల్‌ స్థాయిలో జలనిధి అడుగున ప్రాథమిక పునాది స్థాయినుంచి నీటి పారుదలకు ఆటంకం లేకుండా స్కవర్‌ స్లూయిస్‌లను నిర్మించారు.

దార్శనికతకు వైఎస్సార్‌ నిలువెత్తు నిదర్శనం
ధవళేశ్వరం వద్ద బ్యారెజ్‌ నిర్మించిన కాటన్‌ మహాశయుడు 1852లోనే గోదావరిపై రిజర్వాయర్‌ అవసరమని పేర్కొన్నారు... ఆనాడు ఆయన వెలిబుచ్చిన అభిప్రాయంకు అనుగుణంగా పోలవరం ప్రాజెక్ట్‌ కుడి, ఎడమ కాలువలు తవ్వించిన డేరింగ్‌ అండ్‌ డేషింగ్‌ పొలిటికల్‌ హీరో దివంగత వైఎస్సార్‌ ఈ ప్రాజెక్టుకు జీవం పోశారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆధునిక రాజకీయ పాలనా వ్యవస్థలో మనదేశంలో ఎన్నో పథకాలకు శంకుస్థాపనలు లెక్కకు మిక్కిలిగా జరిగాయి... అంటే ఒకసారి చేసినదానికే మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు చేసిన వైనం పోలవరానికి దక్కింది... ఇలా ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారు ఆశించి పోలవరాన్ని కుటిల తరహాలో పావుగా ఆడుకుంటే వైఎస్సార్‌ మాత్రం ఆ తరహా కుటిలత్వానికి చరమగీతం పాడి రైతాం గానికి అనువుగా వాడుకున్నారు... అందుకే దాదాపు 360 కిలోమీటర్ల నిడివి కల్గిన రెండు కాల్వల పనులు చేపట్టి తొంబై ఎనిమిది శాతం పూర్తి చేశారు. 

సాగు, తాగు నీటి సమస్యతో పాటు పారిశ్రామిక ప్రగతికి పోలవరం ఒక్కటే పరిష్కారం చూపగలమని నమ్మారు... ఆలోచన రావడం తరువాయి ఆచరణలో పెట్టి ప్రాజెక్ట్‌కు ఇరువైపులా ఉభయగోదావరి జిల్లాల్లో కాల్వల నిర్మాణానికి భూసేకరణకు ఉపక్రమించారు. ఇందుకోసం రూ. వేలకోట్లు ఖర్చయినా సరే పరవాలేదనుకుని రంగంలోకి దిగారు. ఇలా రైతులకు పరిహారాలు అందజేసి ముందుగా పనులకు శ్రీకారం చుట్టడంతో కేంద్రం దిగొచ్చింది. ఫలితంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుకి నిధులు తామే ఇచ్చి పూర్తి చేస్తామని రాష్ట్ర విభజనలో భాగంగా మాట ఇచ్చింది. కానీ, బాబుని నమ్మి ఓట్లేస్తే సరికొత్త ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చాక తామే నిర్మిస్తామని తలదూర్చి రాజకీయం చేశారు తప్ప అయిదేళ్లయినా పునాదులు దాటకుండా నిర్వీర్యం చేశారనేది జగమెరిగిన సత్యమేగా. మరీ ముఖ్యంగా ఆర్‌ఆర్‌ ప్యాకేజ్‌ స్థాయిలోనే అవినీతి అక్రమాలు జరిగిన తీరు లోకానికి తెలియ చేయడంలో జగన్‌ కృతకృత్యులయ్యారు. ఆ తరువాత పరిణామాలు అందరికీ తెలిసిందే. 

1900 ప్రాంతం నుంచీ దాదాపు వందేళ్ళు రాజకీయం చేస్తూ పోలవరాన్ని అటకెక్కించిన తీరును తన చాణక్యంతో వైఎస్సార్‌ తిప్పికొట్టిన సంగతి వర్తమాన పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. దివంగత వైఎస్సార్‌ 17,500 క్యూసెక్కుల మేరకు నీరు పారే కుడి, ఎడమల కాల్వల తవ్వకానికి ఆనాడు చేపట్టిన సాహసోపేత చర్యే ప్రస్తుతం శరవేగంగా పనులవుతున్న ‘పోలవరం’గా చరిత్రకెక్కింది... ఈ కారణంగా ఉభయ గోదావరులకే కాదు అటు ఉత్తరాంధ్ర... ఇటు సర్కార్‌... రాయలసీమ జిల్లాలకు కూడా సాగు, తాగు పారిశ్రామిక అవసరాలు నెరవేరతాయి కదా..! ఇప్పుడు గోదావరి జిల్లాల డెల్టా స్థిరీకరణ జరగడమే కాదు. మెట్ట ప్రాంతాలకు, ఇతర జిల్లాల నీటి సమస్యలకు చెక్‌ పెట్టినట్టేగా. అన్నిటికీ మించి 960 మెగావాట్ల అతి చౌకైన విద్యుదుత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టులో కీలకమైన అంశం... ఈ ప్రాజెక్టుకోసం ఊళ్లు, ఇళ్లూ వదిలేసి నిర్వాసితులయిన ఒకో కుటుంబానికి రూ. 10 లక్షల రూపాయలు పరి హారంగా ఇవ్వడానికి ముఖ్యమంత్రి జగన్‌ ఉదారతతో తాజాగా నిర్ణయం తీసుకోవడం ప్రశంసనీయం. వారికి జీవించేందుకు అవసరమయ్యే ఇతర ఆర్థిక సాయం అందించడం.. జీవన భృతి ఏర్పాటు.. ఉద్యోగ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది.


కొవ్వూరి త్రినాథరెడ్డి 
కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి,
రాష్ట్ర వైఎస్సార్‌సీపీ రైతు విభాగం
మొబైల్‌ : 94402 04323

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top