అభివృద్ధిలో ప్రజా కోణం ఏది?

Kommineni Srinivasa Rao Article On Public Perspective Development - Sakshi

విశ్లేషణ

దేశానికి, ఆయా రాష్ట్రాలకు ఏ మోడల్‌ అవసరం అన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అభివృద్ధి అంటే ఏమిటి? కేవలం రోడ్లు, భవనాలు నిర్మించడమే అభివృద్ధి అవుతుందా? లేక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బాగా జరిగితే అభివృద్ధి అవుతుందా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ బాగా పెరిగిందని సంతోషపడ్డారు. బాగానే ఉంది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఇళ్ల స్థలాల విలువ బాగా పెరిగిన మాట నిజం. కొన్ని ప్రతిష్టాత్మక ప్రాంతాలలో గజం లక్ష నుంచి రెండు లక్షల వరకు ధర పలుకుతుంది. అదే సమయంలో లక్షలాది మంది ఇళ్లు లేక, ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. కాని స్థలాభావం కారణంగా ఆశించిన రీతిలో వాటిని ప్రభుత్వం నిర్మించలేక పోతోంది. గత కార్పొరేషన్‌ ఎన్నికలలో ఆ ప్రభావం కూడా పడి టీఆర్‌ఎస్‌కు నష్టం జరిగింది. తాజాగా కేసీఆర్‌ తెలంగాణలో ఒక ఎకరా అమ్మితే ఏపీలో రెండు ఎకరాలు కొనుక్కోవచ్చని చెబుతున్నారు. గతంలో ఇది రివర్స్‌లో ఉందని ఆయన అన్నారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్‌ రావులు కూడా ఏపీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు. నిజానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నడూ కేసీఆర్‌ను కానీ, టీఆర్‌ఎస్‌ నేతలను కానీ విమర్శించలేదు. అయితే ఇప్పుడు టీఆర్‌ఎస్‌ నేతల స్వరంలో ఎందుకు మార్పు వచ్చిం దన్నది ఆసక్తికర అంశమే అవుతుంది. 

అభివృద్ధిలో మార్గాలు వేరు
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన ఎన్నికల ప్రణాళిక ప్రకారం నవరత్నాల హామీలను అమలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. పలువురు రెండు రాష్ట్రాల మధ్య పోలిక పెట్టి మాట్లాడుతున్నారు. అది కేసీఆర్‌కు కాస్త చికాకుగా ఉంటోంది. ఉదాహరణకు ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకోవాలని ఇక్కడ కార్మికులు కోరారు. కేసీఆర్‌ ఒప్పుకోలేదు. కాని ఏపీలో మాత్రం జగన్‌ చేసి చూపించారు. కేసీఆర్‌ కూడా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రైతు బంధు వంటి ప«థకం గత ఎన్నికలలో బాగా ఉపయోగపడింది. అలాగే జగన్‌ కూడా రైతు భరోసాతో పాటు అమ్మ ఒడి, చేయూత, వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ఏర్పాటు, వృద్ధాప్య పెన్షన్లు ఇంటివద్దకు తీసుకు వెళ్లి ఇవ్వడం వంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

కాగా గతంలో అమరావతిలోనే మొత్తం డబ్బు అంతా ఖర్చు చేయాలని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించి రాజకీయంగా దెబ్బతిన్నారు. అయితే అమరావతి ముప్పై గ్రామాల పరిధిలో రాజధాని గ్రామాలలో అక్కడ అభివృద్ధి ప్రత్యేకంగా ఏమీ లేకపోయినా భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. అదే సమయంలో ఆ 30 గ్రామాలు దాటి విజయవాడ వైపుకాని, గుంటూరు వైపు కాని భూముల ధరలు ఆ రోజుల్లోనే తగ్గిపోయాయి. దానికి తోడు రాజధాని గ్రామాలలో మినహా గుంటూరు, కృష్ణా జిల్లాలలోని పొలాలను, స్థలాలను గ్రీన్‌ జోన్‌ కింద ప్రకటించడంతో అసలు కొనేవాడు లేకపోయాడు. అప్పటి నుంచే ఏపీలో రియల్‌ ఎస్టేట్‌ బాగా పడిపోయిందన్నది వాస్తవం. కాని కేసీఆర్‌ ప్రకటన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎంతో సంతోషం కలిగించింది. జగన్‌ను విమర్శించడానికి ఆయన ఈ పాయింట్‌ వాడుకుంటున్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయిన కొంతకాలానికి మూడు రాజధానుల విధానం ప్రతిపాదించారు. దాంతో అమరావతి ప్రాంతంలో రేట్లు కొంతమేర తగ్గాయి. కాని అదే సమయంలో విశాఖపట్నం, కర్నూలు తదితర ప్రాంతాలలో భూముల రేట్లు బాగా పెరిగాయి. విశాఖపట్నంలో అయితే ఎకరా భూమి వెల 107 కోట్ల రూపాయల వరకు ఉందని మీడియాలో వార్తలు వచ్చాయి. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అంతటా భూముల ధరలు  పెరిగాయి. 

పేదలకు వసతుల కల్పనే అసలు అభివృద్ధి
ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా, కేసీఆర్‌ పనిగట్టుకుని ఏపీని తక్కువ చేసి చూపించడంలో ఆంతర్యం ఏమిటా అన్న చర్చ జరుగుతోంది. జగన్‌ సోదరి షర్మిల సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకున్న నేపథ్యం ఏమైనా ఈ వ్యాఖ్యల వెనుక ఉందా? షర్మిల వల్ల ఏ పార్టీకి నష్టం వస్తుందన్నది ఇంకా స్పష్టత రాలేదు. భవిష్యత్తులో ఆమె ప్రకటించే విధానాలు, ఆమె యాత్రలలో వచ్చే స్పందనను బట్టి రాజ కీయం సాగుతుంది. ఆమె కూడా రాజన్న రాజ్యం అంటూ ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో కూడా వైఎస్‌ అభిమానులు గణనీయంగానే ఉన్నారు. ఒకవేళ షర్మిల పార్టీ వారిని ఆకర్షించితే టీఆర్‌ఎస్‌కు కూడా కొంత నష్టం జరగవచ్చు. 

అయితే ఈ విషయంలో వైఎస్‌ జగన్‌ ప్రమేయం లేకపోయినా, టీఆర్‌ఎస్‌కు ఈ పరిణామం నచ్చలేదేమోననిపిస్తుంది. షర్మిలతో టీఆర్‌ఎస్‌ నేతలే పార్టీ పెట్టిస్తున్నారని భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శిస్తుంటే, బీజేపీ చొరవతోనే ఆమె పార్టీ విషయంలో ముందుకు వెళుతున్నారని టీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. మరో మూడేళ్లలో జరిగే శాసనసభ ఎన్నికలలో వైఎస్‌ ప్రభావం తగ్గించడానికిగాను కేసీఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ కామెంట్లు చేశారా అన్న అనుమానం వస్తోంది. అలాగే కేటీఆర్‌ ఆశ్చర్యకరంగా చంద్రబాబును పొగుడుతూ మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. రియల్‌ ఎస్టేట్‌ విలువలు పెరిగితే రాష్ట్రం అభివృద్ధి అయినట్లా? లేక పేదలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం అభివృద్ధి అవుతుందా అన్నదానిపై ఏపీ, తెలంగాణల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. 

దళితులకు ఒక్కొక్కరికి మూడు ఎకరాల చొప్పున భూమి ఇస్తామని గతంలో కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఆ హామీని ఎంతమేర నెరవేర్చారో టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పవలసి ఉంటుంది. ఏపీలో ముఖ్యమంత్రి జగన్‌ ముప్పై లక్షల మందికి సెంటు నుంచి సెంటున్నర వరకు పేదలకు స్థలాలు ఇచ్చారు. వాటి విలువ పాతికవేల కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఆ ప్రకారం ఆ పేదలకు అంత మొత్తం ఆస్తిని జగన్‌ సమకూర్చారు. ఇది అభివృద్ధిగా పరిగణించరా? కొందరు కేసీఆర్‌ ప్రకటన ఆధారంగా జగన్‌పై రాజకీయ విమర్శలు చేస్తున్నారు. కాని వాటికి ఎంత విలువ ఉందన్నది ఈ మధ్య జరిగిన స్థానిక ఎన్నికలు తేల్చేశాయి. కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల భావనకు తొలుత ప్రాముఖ్యత వచ్చినా, ఆశించిన రీతిలో వాటి నిర్మాణం జరగలేదు. అది కొంత ఆయనకు మైనస్‌ అయింది. ఆ విషయాన్ని ప్రస్తావించకుండా కేసీఆర్‌ తెలివిగా రియల్‌ ఎస్టేట్‌ పెరిగిందని అంటున్నారు. 

తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ముఖ్యం
రియల్‌ ఎస్టేట్‌ అన్నది ఆయా పరిస్థితులను బట్టి పెరగవచ్చు, తగ్గవచ్చు. హైదరాబాద్‌ పలుమార్లు ఆటుపోట్లు ఎదుర్కొంది. హైదరాబాద్‌లో ఇళ్లు లేని పేదలకు ఏపీలో మాదిరి ఇక్కడ ప్రభుత్వం స్థలాలు ఇవ్వగలదా? అన్నదానికి సమాధానం దొరకదు. ఏపీలో గతంలో మాదిరి స్పెక్యులేషన్‌ ఉండకపోవచ్చు. అంతమాత్రాన తెలంగాణలో కన్నా ఏపీలో భూముల రేట్లు తక్కువగా ఉన్నాయని అనుకుంటే పొరపాటే అవుతుంది. కేసీఆర్‌ మాటలు మోతుబరులకు అనుకూలంగా ఉన్నట్లు కనబడుతుంటే, ఏపీలో మాత్రం పేదల పక్షాన ప్రభుత్వం పనిచేస్తున్నట్లు అర్థం అవుతుంది. ఏది ఏమైనా రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి తప్ప, అనవసరంగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకోవడం ద్వారా రెండు రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని మాత్రం చెప్పాలి.

రియల్‌ ఎస్టేట్‌ విలువలు పెరిగితే రాష్ట్రం అభివృద్ధి అయినట్లా? లేక పేదలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం అభివృద్ధి అవుతుందా అన్నదానిపై ఏపీ, తెలంగాణల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఏపీలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ముప్పై లక్షల మంది పేదలకు సెంటు నుంచి సెంటున్నర వరకు స్థలాలు ఇచ్చారు. వాటి విలువ పాతికవేల కోట్లుగా అంచనా వేస్తున్నారు. పేదలకు అంత మొత్తం ఆస్తిని జగన్‌ సమకూర్చారు. ఇది అభివృద్ధి కాదా? కొందరు కేసీఆర్‌ ప్రకటన ఆధారంగా జగన్‌పై రాజకీయ విమర్శలు చేస్తున్నారు. కాని వాటికి ఎంత విలువ ఉందన్నది ఈ మధ్య జరిగిన స్థానిక ఎన్నికలు తేల్చేశాయి. ఏది ఏమైనా రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి తప్ప, అనవసరంగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకోవడం ద్వారా రెండు రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని మాత్రం చెప్పాలి.
 


వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు 
సీనియర్‌ పాత్రికేయులు
    

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top